Telangana | తెలంగాణలో రాజుకోనున్న రాజకీయ సెగ.. 20న ఒకే రోజు జగిత్యాలలో కేసీఆర్ సభ.. మేడిగడ్డలో రేవంత్ రెడ్డి
పోగొట్టుకున్న చోటే పట్టు బిగించాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నుతుండగా, పడిపోయిన చోటే లేవకుండా పాతరేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. నిన్నమొన్నటి వరకు మీడియా వార్ సాగించిన ఇరు పక్షాలు బలనిరూపణలకు బహిరంగ సభలను ఎంచుకున్నాయి. ఈ క్రమంలోనే ఇరు పక్షాల ప్రధాన నేతలు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఈ భారీ సభలకు హాజరుకానున్నట్లు ప్రకటించడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో భాగంగా తరచూ సభల్లో పాల్గొంటున్నప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ సభ తర్వాత మరోసారి జనారణ్యంలోకి వస్తున్నారు.
విధాత, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మరోసారి రాజకీయ కత్తులు నూరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. రెండు పక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పొలిటికల్ చదరంగాన్ని రక్తి కట్టించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకు ఉత్తర తెలంగాణ జిల్లాలను వేదికగా ఎంచుకోవడం విశేషం. గమ్మత్తేమిటంటే ఇరుపార్టీలు కౌంటర్, ఎన్‌కౌంటర్ అన్నట్లుగా పరస్పరం ఎదుటి పార్టీల భుజాలపై నుంచి రాజకీయ తుపాకులు ఎక్కు పెట్టి తమ ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెడుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక మేడిగడ్డ (కాళేశ్వరం) ప్రాజెక్టును ప్రధానాంశంగా ఎంచుకున్నది. కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు బీఆర్ఎస్.. కాంగ్రెస్‌ను వీడుతున్న జీవన్ రెడ్డి చేరికను అంశంగా చేసుకున్నది.
బీఆర్ఎస్ జగిత్యాల జైత్రయాత్ర
జగిత్యాల నుంచి తమ పార్టీ జైత్రయాత్ర ప్రారంభిస్తుందని బీఆర్ఎస్ నేతలు ప్రకటిస్తున్నారు. జూలు విదిల్చిన సింహం లెక్క ఈ నెల 20 జరిగే సభ ద్వారా కేసీఆర్ జగిత్యాల గడ్డపై జనారణ్యంలోకి ప్రవేశిస్తారన్నట్లు చెబుతున్నారు. పార్టీ పూర్వ వైభవానికి ఇక్కడి నుంచే ప్రజా ఆశీర్వాదం పొందుతామని అంటున్నారు. విప్లవోద్యంలో కీలక మలుపుగా నిలిచిన జగిత్యాల జైత్రయాత్ర పేరును తమకు అనుకూలమైన అర్ధంలో ఈ సందర్భంగా బీఆర్ఎస్ నొక్కి చెబుతోంది. గత రెండు వారాలుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ నాయకత్వ శ్రేణులను బీఆరెస్ ఇక్కడ మోహరించింది. ముఖ్యంగా వరంగల్ జిల్లా నాయకులు కీలక భూమిక పోషిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే తిష్ఠవేశారు. తాజాగా శనివారం జోడుగుర్రాలుగా బావా, బామ్మర్ది కలిసి.. జగిత్యాల సభ ఏర్పాట్లను పరిశీలించారు. పనిలోపనిగా కాంగ్రెస్, సీఎంపై విమర్శలు చేశారు.
సింహం రాకతో కాంగ్రెస్ నాయకుల్లో దడ: కేటీఆర్
సింహం బయటికి వస్తుందంటే కాంగ్రెస్ గుంట నక్కల గుండెల్లో దడ పుడుతున్నదంటూ కేసీఆర్ జగిత్యాలకు రావడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. జగిత్యాలలో జరుగబోయే జైత్రయాత్రను అడ్డుకోవడానికి, రోడ్లు తవ్వుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. ‘రెండున్నర ఏళ్ల నుండి మేడిగడ్డకు పోవడానికి రేవంత్ రెడ్డికి టైం లేదు.. కానీ జగిత్యాలకు కేసీఆర్ వస్తుండనగానే మేడిగడ్డకు పోతుండు. ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరు’ అని ఘాటుగా విమర్శించారు. జగిత్యాలకు వచ్చే జన ప్రభంజనాన్ని అడ్డుకోవడం ఇక్కడున్న క్రాస్‌బ్రీడ్ ఎమ్మెల్యే వల్ల కాదుకదా, రేవంత్ వల్ల కూడా కాదని చెప్పారు. పార్టీ పూర్వవైభవాన్ని సాధిస్తుందని కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమైందని ఆ పార్టీ మరోనేత హరీష్ రావు ప్రకటించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్ అధికారంలోకి రావడం, మరోసారి ముఖ్యమంత్రి కావడం జరుగుతుందన్నారు. ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని కూడా చెప్పారు.
కాళేశ్వరం కాంగ్రెస్‌కు కదనరంగం
కాళేశ్వరం నుంచి బీఆర్ఎస్‌పై రాజకీయ దాడిని తీవ్రం చేసి మరోసారి ఆ పార్టీని ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 20న అధికారికంగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం పునరుద్ధరణ పనుల కోసం ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ వేసవినాటికి అవసరమైన ప్రాథమిక పనులు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం ఇక్కడ సభ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఏర్పాట్లు మంత్రి శ్రీధర్ బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సభకు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో పాటు, జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వైపు జగిత్యాలలో కేసీఆర్ సభ, మరొక వైపుకాళేశ్వరంలో రేవంత్ రెడ్డి సభలు ఒకే రోజు జరుగనున్నాయి. ఇరువర్గాల సభలు, జనాల రాకపోకలతో రాజకీయం రంజుగా మారనున్నది.
కంట్లో నలుసుగా మారిన మేడిగడ్డ
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అన్నీ తానై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైన మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగిపోయాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత మేడిగడ్డ చుట్టూ జరిగిన రాజకీయ రచ్చ, విమర్శలు అందరికీ తెలిసిందే. ఒక విధంగా ఈ ప్రాజెక్టు బీఆర్ఎస్‌కు కంట్లో నలుసుగా మారింది. కుంగిపోయినప్పటి నుంచి మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బరాజ్‌లలో నీరు నిల్వా చేయరాదని ఎన్జీఎస్ఏ ఆదేశించింది. దీంతో ఈ బరాజ్‌ల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. అయితే బీఆర్ఎస్ మాత్రం బరాజ్‌లను కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెడుతోందని విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బరాజ్‌ల పునరుద్ధరణ, లోపాలు సరిదిద్దేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ ప్రాజెక్టును సందర్శించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సహజంగానే కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగా అవినీతి ఆరోపణలు చేసే అవకాశం ఉంది. తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రజోపయోగంగా పునరుద్ధరించేందుకు సిద్ధమైనట్లు చెప్పుకొనే అవకాశాలూ ఉన్నాయి. బీఆర్ఎస్ పై సీఎం తన సహజ ధోరణిలో విరుచపడే చాన్సు ఉంది. ఈ పరిణామాన్ని ముందే గుర్తించిన బీఆర్ఎస్ నాయకత్వం సీఎం పర్యటనకు ముందే మేడిగడ్డను సందర్శించినట్లు కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, వినయ్ భాస్కర్, రమణారెడ్డి, రాజయ్య, ఆరూరి, కవితతో సహా నాయకులంతా ఆఘమేఘాల మీద మేడిగడ్డకు తరలివెళ్ళి రేవంత్ రెడ్డి పై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వం కాళేశ్వరం పునరుద్ధరణ పనులు చేపడితే తమ ఒత్తిడి వల్లే చేపట్టారని చెప్పుకునేందుకు చిల్లర రాజకీయ ఎత్తుగడలు వేయడం బీఆర్ఎస్ కు అలవాటేనని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. కోట్లు కొల్లగొట్టి ఎదురుదాడి చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
రిజిస్ట్రేషన్లకు కొత్త రూల్.. సర్వే మ్యాపు ఉంటేనే ఇకపై రిజిస్ట్రేషన్.. భూ సమస్యలకు చెక్
ఏలియన్ల రహస్యాలు అతి త్వరలో.. : ట్రంప్ తాజా సంచలనం
ఈ అక్షయ తృతీయకు బంగారం ‘హైజంప్’
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram