Dharani | ‘ధరణి’ దోపిడి! రైతులను లూటీ చేసిన పోర్టల్?

Dharani | ధరణిలో తన భూ రికార్డులు సరి చేసుకొనేందుకు నల్గొండ జిల్లాలోని గిరిజన రైతు రూ. 2 లక్షలు ఖర్చు చేశారు. కానీ, ఇంతవరకు ఆయనకు ఫలితం దక్కలేదు. తనకున్న భూమిని రికార్డుల్లో సరిచేయించుకొనేందుకు తిరగని ఆఫీస్ లేదు, మొక్కని అధికారి లేడు. ప్రభుత్వం మారింది...ఇప్పుడైనా తన సమస్య తీరుతుందా అని ఆయన ఆశగా ఎదురు చూస్తున్నారు.

  • By: raj |    telangana |    Published on : Aug 08, 2025 2:00 AM IST
Dharani | ‘ధరణి’ దోపిడి! రైతులను లూటీ చేసిన పోర్టల్?

జేబులు ఖాళీ చేసుకున్న అన్నదాత
అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
భూభారతితో పరిష్కారం లభించేనా?
సగటున 50 వేల నుంచి లక్ష ఖర్చు!

Dharani | విధాత : ధరణిలో తన భూ రికార్డులు సరి చేసుకొనేందుకు నల్గొండ జిల్లాలోని గిరిజన రైతు రూ. 2 లక్షలు ఖర్చు చేశారు. కానీ, ఇంతవరకు ఆయనకు ఫలితం దక్కలేదు. తనకున్న భూమిని రికార్డుల్లో సరిచేయించుకొనేందుకు తిరగని ఆఫీస్ లేదు, మొక్కని అధికారి లేడు. ప్రభుత్వం మారింది…ఇప్పుడైనా తన సమస్య తీరుతుందా అని ఆయన ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో ఇలాంటి సమస్యలే ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఒక్కో రైతుది ఒక్కో సమస్య.. సమస్య ఎలాంటిదైనా పరిష్కారం కోసం డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఫీజులు, అధికారుల చుట్టూ తిరిగేందుకు రవాణా ఖర్చులు కలిపితే మోయలేని భారం అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలం దేవత్ పల్లి తండాకు చెందిన ఆంబోతు తావుర్యా అనే రైతుకు ఏడు ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాస్ బుక్ మంజూరు చేశారు. ఈ భూమిని ఆయన సాగు చేసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ధరణిని తెచ్చింది. ఈ క్రమంలో తావుర్య పేరుతో భూమి రికార్డు చేసే సమయంలో భూమిని రెండు ఎకరాలు తక్కువ చూపారు. అంటే తావుర్యా పేరున ఏడు ఎకరాలకు బదులుగా ఐదు ఎకరాల భూమిని మాత్రమే అధికారులు రికార్డు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన తావుర్య రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగారు. తన పేరున భూమి రికార్డులను సరిచేయాలని కోరారు. దీనికి సంబంధించి ఆయన అధికారులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేశారు. ఇలా దరఖాస్తు చేసిన ప్రతిసారీ రూ.1000 ఫీజు చెల్లించాలి. మీ సేవా సెంటర్ కు రూ. 100 నుంచి రూ. 200 ఖర్చు చేశారు. తావుర్యా మూడుసార్లు దరఖాస్తు చేస్తే మూడుసార్లూ ఆయన దరఖాస్తును రిజెక్ట్ చేశారు. తన భూమి రికార్డులు సరిచేసేందుకు తావుర్యా క్షేత్రస్థాయిలో ఓ అధికారికి చేతులు కూడా తడిపినట్టుగా ఆరోపిస్తున్నారు. అయినా కూడా తన భూమి రికార్డులు సరికాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దేవరకొండ, చందంపేట, నల్గొండ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తావుర్యా తిరిగుతూ.. ఇప్పటి వరకు రూ.2 లక్షలు ఖర్చు పెట్టినా…తన సమస్య పరిష్కారం కాలేదని తావుర్యా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరి భూమిని మరొకరి పేరుతో పొరపాటునో లేదా ఇతర కారణాలతో ధరణిలో రికార్డైన ఘటనలు కూడా ఉన్నాయి. వీటిని సరిచేసేందుకు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండాపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక చిన్న తండాలో ఒక్క రైతు తన సమస్యను పరిష్కరించుకోవడం కోసం రూ. 2 లక్షలు ఖర్చు పెట్టాడు. ధరణిలో వచ్చిన దరఖాస్తుల్లో లక్ష మంది రైతులు సగటున రూ.50 వేలు ఖర్చు చేస్తేనే వందల కోట్లు అవుతోంది. ఇలా తాము తమ జేబులు ఖాళీ చేసుకోవాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు.

ధరణిలో 25 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో టీఎం 33 మ్యాడ్యూల్ కిందే ఎక్కువగా అప్లికేషన్లున్నాయి. వీటిని పరిష్కరించాలని కోరుతూ వచ్చిన దరఖాస్తులు రిజెక్టు అయ్యేవి. ఈ అప్లికేషన్లకు ఫీజు ఉండాలని ప్రభుత్వంలో కీలకంగా పనిచేసి రిటైరైన అధికారి సూచించినందునే రూ.1000 ఫీజును డిసైడ్ చేశారనే ప్రచారం కూడా ఉంది. ఇక స్లాట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకొంటే స్టాంప్ డ్యూటీ తమకు తిరిగి ఇవ్వలేదని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ధరణి అమలు చేసిన సమయంలో ఉన్న ఇబ్బందులను అధ్యయనం చేసిన తర్వాత భూభారతిలో మార్పులు చేర్పులు చేశారు. భూమి రికార్డుల్లో తప్పులను సరి చేసే అవకాశం కల్పించారు. బాధితులు ఎవరైనా దీనికి సంబంధించి ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తే రూ.5 లక్షలోపు భూమి విలువ ఉన్న వాటిని ఆర్డీఓ, అంతకంటే ఎక్కువ విలువ ఉన్న భూమిని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారించి రికార్డులు సరిచేస్తారు. ఇప్పటికైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తోందా అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.