Fee Reimbursement arrears | ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8500 కోట్లు!

రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు దాదాపు రూ.8500 పెండింగ్‌లో ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ బకాయిలు క్లియర్ కాకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు విద్యార్థులు ఉన్నత విద్యను చదవాలనే కోరికను చంపేసుకుని, అర్థాంతరంగానే ఆపేస్తున్నారని విద్యార్థి సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Fee Reimbursement arrears | ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8500 కోట్లు!

హైదరాబాద్, ఆగస్ట్ 24 (విధాత):

Fee Reimbursement arrears | ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు ఉన్నత విద్యలో చేరడానికి ఎక్కువగా స్కాలర్‌షిప్‌పైనే ఆధారపడుతారు. తెలంగాణలో ఏటా 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి ఉన్నత విద్యలో చేరుతున్నారు. వీరికి ఏటా దాదాపు రూ. 3 వేల కోట్లు అవసరం అవుతోంది. కానీ 2019 నుంచి 2025 వరకు రూ.8500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఆందోళన చేసిన సమయంలో టోకెన్లు జారీ చేసి చేతులు దులుపుకొంటున్నారని, పెండింగ్ బకాయిల్లో చిల్లిగవ్వ కూడా విడుదల చేయడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫీజు రీఎయిబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుతున్న విద్యార్థులకు సకాలంలో ఈ నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ విద్యా సంస్థలు తమకు సర్టిఫికెట్లు అందించడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. సర్టిఫికెట్లు చేతికి రాకపోవడంతో పైచదువులకు లేదా ఉద్యోగ అవకాశాలకు వెళ్లే అవకాశాన్ని కోల్పోతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరికొందరు అప్పులు తెచ్చి ప్రైవేట్ విద్యా సంస్థల బకాయిలు క్లియర్ చేస్తున్నారని తెలుస్తున్నది. మరోవైపు ఫీజు రీయింబర్స్ మెంట్ సకాలంలో రాకపోవడంతో విద్యా సంస్థలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ బకాయిలు పేరుకుపోవడంతో తాము సంస్థలను నడిపే పరిస్థితి లేకుండా పోయిందని విద్యా సంస్థల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలో 166 ఇంటర్, 72 డిగ్రీ, 29 ఇంజినీరింగ్, 47 పారా మెడికల్ కాలేజీలు మూతపడ్డాయని ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. విద్యా శాఖను బలోపేతం చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ శాఖను తనవద్దే ఉంచుకున్నారు. కానీ, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదల విషయంలో చొరవ చూపాలని విద్యార్థి సంఘాలు సీఎంను కోరుతున్నాయి.