Telangana Urea Shortage | యూరియా కోసం యుద్ధమే! సహకార సంఘాల వద్ద పడిగాపులు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సహకార సంఘ కార్యాలయాల వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు గాస్తున్నారు. తెల్లవారుజాము నుంచి సంఘ కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు. అయినా యూరియా దొరకడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు ఏమీ చేయలేక చేతులు ఎత్తేశారు. దీనితో అగ్రహించిన రైతులు పలు చోట్ల ఆందోళనకు దిగారు.

(విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి)
Telangana Urea Shortage | ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో యూరియా కోసం రైతులు యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఒక్కసారిగా పంటల సాగు ఊపందుకుంది. ఇదే సమయంలో రైతులకు కావాల్సిన రసాయనిక ఎరువుల కొరత తీవ్రమైంది. ప్రస్తుతం వరి పంటకు కావలసిన యూరియా కొరత ఏర్పడింది. కానీ.. రైతులకు అవసరమైన యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం ముందుజాగ్రత్త వహించకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణంగా చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సహకార సంఘ కార్యాలయాల వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు గాస్తున్నారు. తెల్లవారుజాము నుంచి సంఘ కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు. అయినా యూరియా దొరకడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు ఏమీ చేయలేక చేతులు ఎత్తేశారు. దీనితో అగ్రహించిన రైతులు పలు చోట్ల ఆందోళనకు దిగారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ రైతులు అగ్రవేశాలు వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా అమరచింతలో యూరియా అందక ఆగ్రహించిన ఓ రైతు సహకార సంఘ కార్యాలయంపై రాళ్ళతో దాడి చేశాడు. అధికారులు ఏమీ చేయలేక చూస్తుండిపోయారు. మహబూబ్ నగర్ లో యూరియా కోసం రైతులు పడిగాపులు పడినా బస్తా కూడా దొరకలేదు. ఓ రిక్షా కార్మికుడు సొమ్మసిల్లి పడిపోతే, యూరియా కోసం వచ్చి పడిపోయాడని బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి ఆరోపించారు. అదంగా మాజీ మంత్రి డ్రామా అని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు.
లిక్విడ్ యూరియా మెలిక
భూత్‌పూర్ సహకార కేంద్రం వద్ద యూరియా బస్తాతో పాటు యూరియా లిక్విడ్ బాటిల్ కొనాలని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. జిల్లాలో ఎక్కడ చూసినా రైతుల ఆందోళన కనిపిస్తోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది.