కారు డోరు తీసిన మహిళకు షాక్..పరుగో పరుగు !
అడవిలో నుండి వచ్చిన ఎలుగుబంటి కారులోకి దూకి మహిళను షాక్ ఇచ్చింది, భయంతో ఆమె పరిగెత్తి పారిపోయింది!

విధాత : అరణ్యాలు తరిగిపోయి..జనావాసాలు పెరిగిపోతుంటే సమీప అడవుల్లోంచి వన్యప్రాణులు జనంలోకి రావడం సాధారణంగా చూస్తుంటాం. అలా వచ్చిన ఓ ఎలుగుబంటి చేసిన చర్యతో ఓ మహిళకు గుండె ఆగినంత పనైంది. ఎప్పుడొచ్చిందో..ఎక్కడి నుండి వచ్చిందో గాని..ఓ ఎలుగుబంటి కారులో దూరింది. మహిళ ఇంటి నుంచి బయటకు వచ్చి తన కారులోకి ఎక్కే క్రమంలో దాని డోర్ తీసి ఉండటంతో కొంత అనుమాన పడింది. డోరు కాస్తా తెరిచి లోనికి తొంగి చూస్తే కారులో ఎలుగుబంటి డ్రైవింగ్ సీట్లో మకాం వేసి ఉండటం కనిపించింది.
అంతే భయంతో డోరును తిరిగి బలంగా వేసి చేతిలో ఉన్న పండ్లు, కూరగాయల బుట్టను పడేసి వెనక్కి పరుగు లంఘించుకుంది. ఈ చర్యతో భయపడిన ఎలుగుబంటి కారు డోరును తోసేసి బయటకు దూకింది. ఆ తర్వాత ఆ మహిళ ఎలుగుబంటికి దొరకకుండా ఇంట్లోకి పరుగెత్తింది. కారు బయటకు వచ్చిన ఎలుగుబంటి ఆ మహిళ పడేసిపోయిన పండ్లు, కూరగాయాలు తినేసి వెళ్లిపోయింది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా…అసాధారణమైన హైజాకర్.. కారు ఎత్తుకెళ్లే ప్లాన్ పాడైపోయిందంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.