Etela Rajendar : రాష్ట్ర అభివృద్దిలో మా సహకారం ఉంటుంది

రాష్ట్ర అభివృద్ధికి ఎప్పటికీ సహకరిస్తామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. డబుల్ బెడ్ రూమ్, యూరియా సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు.

Etela Rajendar : రాష్ట్ర అభివృద్దిలో మా సహకారం ఉంటుంది

Etela Rajendar | తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ఎంపీల సహకారం ఎప్పటికీ ఉంటుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. శనివారం నాడు తెలంగాణ సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మల్కాజిగిరి ఎంపీ రాజేందర్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యూరియా కొరతపై రాజకీయం చేయకుండా రైతులకు అందించే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యలను రెండు నెలల్లో పరిష్కరించాలని ఆయన కోరారు.

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు విసిరి వేసినట్టు ఎక్కడో దూరంగా ఉన్నాయన్నారు. కేటాయింపులు సరిగా జరగలేదని ఆయన అన్నారు. కరెంటు సౌకర్యం, రోడ్ల సౌకర్యం, డ్రైనేజీలు, లిఫ్ట్లు సరిగా లేవన్నారు.
ఈ సమస్యలు పరిష్కారం కాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాస ఉండటం కష్టంగా ఉందన్నారు. రెండు నెలల్లో పరిష్కారం చూపించాలని ఆయన కోరారు. ఇళ్లు ఎవరికి కేటాయించారో వారిని మాత్రమే ఉండేలా చూడాలని ఆయన కోరారు. కొత్తగా ఇళ్ల కేటాయింపులో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదని ఆయన అన్నారు. నిజంగా పేదరికంలో ఉండి భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని ఆయన కోరారు. ఇల్లు లేని పేదవారికి మాత్రమే ఇల్లు ఇవ్వాలి తప్ప పైరవీలకు చోటివ్వవద్దని కోరారు.

బస్తీలలో నివసించే వారికి అక్కడే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తే వారికి జీవనోపాధి సమస్య ఉండదు. కూరగాయలు, పండ్లు అమ్ముకునేవారు, ఇళ్లల్లో పనిచేసే బ్రతికే వారికి అక్కడే ఇల్లు కట్టిస్తే లైవ్లీహుడ్ దెబ్బతినకుండా ఉంటుందనీ కోరారు. దీనికి మంత్రి సుముఖత వ్యక్తం చేశారు.

సిమెంట్, ఇనుము , ఇసుక , మేస్త్రీల వేతనాలు ఇతరత్రా ఖర్చులు పెరగడంతో ఐదు లక్షల్లో ఇల్లు కట్టడం సాధ్యం కాదని ఆయన అన్నారు. జవహర్ నగర్ భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదని .. ఇవి ఆర్మీ భూములని ఆయన అన్నారు. జవహర్ నగర్ డంపు యార్డ్ పక్కన భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకునే వారంతా పేదలేనని ఆయన అన్నారు. కానీ రెండు మూడు లక్షల రూపాయల లంచం ఇస్తే తప్ప ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. రెవెన్యూ అధికారులు, బ్రోకర్లు కలిసి ఇబ్బందులు పెడుతున్నారని ఆయన తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలని మంత్రిని కోరినట్టు ఆయన తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టే నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. నిబంధనల్లో మినహాయింపుల కోసం కేంద్రాన్ని కోరుతామమని ఎంపీ చెప్పారు.

యూరియా ఎంత అవసరమో స్టాక్ తెప్పించి ముందుగానే నిల్వ చేసుకోవాలి. కానీ, రాష్ట్రంలో యూరియా విషయంలో ఎక్కడ ప్లాన్ కొరవడిందో తెలియదన్నారు. ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. కానీ, కేంద్రం మీద నెపం నెట్టవద్దని కోరారు.