ఎల్‌నినో తో ఎదురుకానున్న తీవ్ర వర్షభావ కరువు పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటింజెన్సీ(ముందస్తు) ప్లాన్‌ను విడుదల చేసింది. వానాకాలం–2026 దృష్ట్యా వివిధ శాఖలకు ముందస్తు కార్యాచరణపై మార్గదర్శకాలు అందించింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల రక్షణకై రూపొందించిన తొలి కంటింజెన్సీ ప్రణాళికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో విడుదల చేశారు.వానాకాలంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేలా ప్రణాళికను రూపొందించారు.
కంటింజెన్సీ(ముందస్తు) ప్రణాళికలో వ్యవసాయ, తాగునీటి రంగాల్లో నష్టం జరగకుండా అధికారులకు ప్రభుత్వం దిశా నిర్ధేశం చేసింది. వర్షాలు ఆలస్యమైనప్పుడు వేయాల్సిన ప్రత్యామ్నాయ పంటలు, విత్తనాల రకాలను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. సాగునీటి కంటే తాగునీటి సరఫరాకే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని నిర్దేశించారు. నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో ఈ నెల, వచ్చే నెలకు సంబంధించిన వాతావరణ అంచనాలను విశ్లేషించి, ఆయా ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉండే నీటి నిల్వలు, ఇన్‌ఫ్లోలు, సాగునీటి లభ్యతపై ఖచ్చితమైన అంచనాలను కూడా బులెటిన్‌లో పొందుపరచాలని అధికారులకు సూచించారు. వారపు బులెటిన్‌ను రైతు వేదికలు, గ్రామపంచాయతీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు సోషల్ మీడియా వేదికలు, స్థానిక మీడియా ద్వారా విస్తృతంగా రైతులకు ఎప్పటికప్పుడు శాస్త్రీయ సమాచారం అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు మార్గదర్శకం చేశారు.
