Relief for Telangana: Normal Rains Likely Despite Weak Monsoon Forecast
- ● దేశవ్యాప్తంగా 92% రుతుపవనాల అంచనా
- ● తెలంగాణలో సాధారణం నుంచి అధిక వర్షాలు అవకాశం
- ● ఎల్ నినో ప్రభావం ఇతర ప్రాంతాల్లో ఎక్కువ
- ● పాజిటివ్ IODతో చివర్లో భారీ వర్షాలు సూచన
విధాత వెదర్ డెస్క్ | 13 ఏప్రిల్ 2026 | హైదరాబాద్:
Monsoon Forecast : దేశవ్యాప్తంగా రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని అంచనాలు వెలువడినప్పటికీ… తెలంగాణకు మాత్రం ఉపశమనం కనిపిస్తోంది. వర్షాభావ ఆందోళనలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో సాధారణం నుంచి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ సంకేతాలు ఇస్తోంది. ముఖ్యంగా సీజన్ చివర్లో భారీ వర్షాలు పడే అవకాశాలు రైతులకు, ప్రజలకు ఆశ కలిగిస్తున్నాయి.
తెలంగాణకు రుతుపవనాల ఊరట
మేఘాల ముసురు… ఎప్పుడొస్తాయో అని ఎదురుచూపుల్లో..
దేశవ్యాప్తంగా 2026 నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. మొత్తం వర్షపాతం దీర్ఘకాల సగటు (LPA)లో 92% మాత్రమే ఉండొచ్చని వెల్లడించింది. ఇది గత కొన్నేళ్లలో అరుదుగా కనిపించే ‘బిలో నార్మల్’ అంచనా కావడం గమనార్హం. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణకు మాత్రం ఊరట కలిగించే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంచనాల ప్రకారం దక్షిణ భారత ప్రాంతంలో భాగమైన తెలంగాణలో సాధారణం నుంచి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ముఖ్యంగా వ్యవసాయానికి కీలకమైన జూన్-సెప్టెంబర్ కాలంలో సరిపోను వర్షాలు పడే అవకాశాలు ఉండటంతో రైతులు కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తోంది.
ఎల్ నినో ప్రభావం తగ్గించే IOD… చివర్లో భారీ వర్షాల సూచనలు
వాన దంచికొడితే నగరం ఇలా… ట్రాఫిక్‌లో తడిసి ముద్దవుతున్న హైదరాబాద్ జీవితం
ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు బలపడే అవకాశం ఉండటం వల్ల దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో వర్షాలు తగ్గే అవకాశముందని IMD తెలిపింది. సాధారణంగా ఎల్ నినో సమయంలో రుతుపవనాలు బలహీనంగా ఉండటం తెలిసిందే. అయితే తెలంగాణకు ఇది పూర్తిగా ప్రతికూలంగా మారదని నిపుణులు చెబుతున్నారు. సీజన్ చివర్లో ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) ఆశావహంగా వృద్ధి చెందే అవకాశముండటమే కారణంగా తెలుస్తోంది. ఈ పరిస్థితి ప్రభావంతో తెలంగాణ సహా దక్షిణా రాష్ట్రాల్లో ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. దీంతో సీజన్ ప్రారంభంలో తక్కువ వర్షపాతం ఉన్నా, చివర్లో ఆ లోటు భర్తీ అయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మే చివర్లో విడుదలయ్యే రెండో దశ అంచనాలు ఈ విషయంలో మరింత స్పష్టత ఇవ్వనున్నాయి.
