Eco Bags for Ration | వచ్చే నెల నుంచి పర్యావరణ బ్యాగుల్లో రేషన్ బియ్యం!
వచ్చే నెల నుంచి తెలంగాణలో రేషన్ బియ్యం పర్యావరణహిత బ్యాగుల్లో పంపిణీ కానుంది. 95 లక్షల కార్డుదారులకు లాభం చేకూరనుంది.

Eco Bags for Ration | విధాత: రేషన్ కార్డు దారులు ఇక వచ్చే సెప్టెంబర్ నెల నుంచి రేషన్ బియ్యం కోసం ఇంటి నుంచి బ్యాగులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే రేషన్‌కార్డుదారులకు వచ్చే నెలలో సన్న బియ్యంతో పాటు పర్యావరణహిత బ్యాగులు పంపిణీ చేయనుంది. ఈ మేరకు జిల్లాల పరిధిలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ల (గోదాము)కు ఇప్పటికే ఈ బ్యాగులు చేరుకున్నాయి. వీటిని ఎంఎల్‌ఎస్ పాయింట్ల పరిధిలోని రేషన్ డీలర్లకు కార్డుల సంఖ్య ప్రకారం అధికారులు సరఫరా చేయనున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వమే పర్యావరణహిత బ్యాగులను అందజేయబోతోంది. వచ్చే నెలలో అందజేసే ఈ సంచులను ప్రతి నెలా బియ్యం కోసం వెళ్లేటప్పుడు తీసుకెళ్లి సరుకులు తీసుకోవచ్చు.
బ్యాగులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ముద్రించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు పథకాలను ప్రస్తావిస్తూ ‘అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అనే నినాదం ఈ పర్యావరణహిత బ్యాగులపై ముద్రించి ఉంది.
రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య ప్రస్తుతం 95 లక్షలు దాటినట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపుగా 3.10 కోట్ల మందికి సన్న బియ్యం సరఫరా అవుతోంది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉండటంతో లబ్ధదారుల సంఖ్య పెరుగనుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా తొలి దశలో.. 5.61 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు. కొత్తగా కార్డులు పొందిన వారికి సెప్టెంబర్ నెల నుంచి రేషన్ బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేస్తారు. కొత్తగా మంజూరైన కార్డుల డిజైన్లు ఇంకా ఖరారు కానందున, ప్రస్తుతం సీఎం, మంత్రి ఉత్తమ్ ఫోటోలతో కూడిన మంజూరు పత్రాలను అందిస్తున్నారు. ఈ పత్రాలను చూపించి లబ్ధిదారులు సెప్టెంబర్ నుంచి రేషన్ తీసుకోవచ్చు.