సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై తెలంగాణ సర్కార్ ఫోకస్

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 9.25 లక్షల సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం వేగం పెంచింది. 6 లక్షల మందికి నోటీసులు జారీ చేసి అర్హులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందించేందుకు చర్యలు చేపట్టింది.

తెలంగాణలో దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా భూముల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు వేగవంతం చేసింది. 9.25 లక్షల దరఖాస్తులను పరిశీలించి..6 లక్షలకు మందికి నోటీసులను రెవెన్యూ శాఖ జారీ చేసింది. నిర్ణీత గడువులోగా విచారణలు పూర్తి చేసి అర్హులైన రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందజేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

అధికారిక రిజిస్ట్రేషన్ లేకుండా తెల్ల కాగితాలపై జరిగిన భూముల క్రయవిక్రయాలు అధికారిక రికార్డుల్లో నమోదు కాకపోవడంతో లక్షలాది మంది రైతులు తమ భూములపై చట్టబద్ధమైన హక్కులు పొందలేక ఏళ్ల తరబడిగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9.25 లక్షల మంది రైతుల సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా వారు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, పంట బీమా తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. కుటుంబ అవసరాల కోసం విక్రయించుకోలేకపోతున్నారు.

2020లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాదాబైనామా సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులను స్వీకరించింది. అయితే చట్టపరమైన, న్యాయపరమైన వివాదాలతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. సాదా బైనామాల ద్వారా భూములు కొనుగోలు చేసిన వారిలో అర్హత కలిగిన చిన్న, సన్నకారు రైతులకు ఆ భూములపై చట్టబద్ధమైన హక్కులు కల్పించే దిశగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మొత్తం 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం దిశగా 6లక్షల మందికి నోటీసులు జారీ చేశారు.

గ్రామస్థాయిలో విచారణలు నిర్వహించి సంబంధిత భూములపై అభ్యంతరాలను స్వీకరించి, నిశితంగా పరిశీలించిన అనంతరం అర్హులైన వారికి సెక్షన్ 13(బీ) ప్రక్రియ ద్వారా సంబంధిత భూములపై పట్టాదార్ హక్కులు కల్పిస్తారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 3.65 లక్షలకుపైగా పట్టాదార్ పాస్‌ పుస్తకాలు జారీ చేసినట్లు ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భూభారతి అమలులో భాగంగా సర్వే మ్యాప్ ఆధారిత రిజిస్ట్రేషన్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ప్రభుత్వం దానిని దశల వారీగా అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించింది. భూమి సర్వే, స్టాంపులు- రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డులను ఒకే వ్యవస్థలో సమన్వయం చేయడం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Latest News