MLA’s Defection Case : పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆరుగురు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపు కేసుపై విచారణకు సిద్ధమయ్యారు.

విధాత, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ట్రయల్ మొదలు పెట్టారు. ఆరుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. జగిత్యాల సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. పార్టీ మార్పునకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలని స్పీకర్ వారిని కోరారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు వివాదంపై ట్రయల్ విచారణ చేయాలని నిర్ణయించుకున్న స్పీకర్ ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేశారు.
ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మందిలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(గద్వాల), అరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), సంజయ్(జగిత్యాల), గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్‌చెరు), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ) ప్రకాశ్‌గౌడ్(రాజేంద్రనగర్), కాలె యాదయ్య(చేవెళ్ల), తెల్లం వెంకట్రావు(భద్రాచలం) స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. .వారంతా స్పీకర్ కు తాము బీఆర్ఎస్ లోనే ఉన్నట్లుగా గత నోటీసులలో తమ సమాధానంగా పేర్కొన్నారు. వీరితోపాటు నోటీసులు స్వీకరించిన శాసనసభ్యులు కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్‌పూర్), దానం నాగేందర్(ఖైరతాబాద్) మాత్రం ఇంకా సమాధానాలివ్వలేదని తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా మళ్లీ నోటీసులు
మరోవైపు బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు కూడా స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపు అభియోగాల విషయమై మరికొన్ని ఆధారాలు కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. తమ అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో అందజేయాలని సూచించారు. స్పీకర్ వద్ద విచారణలో భాగంగా.. నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలు, ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వాదనలుంటాయి. కాబట్టి.. తదుపరి విచారణ కోసం లీగల్ ఫార్మాట్‌లో అభ్యంతరాలను ఇవ్వాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు. లేఖ అందిన మూడు రోజుల్లోగా అందించాలని గడువు విధించారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి.. కాంగ్రెస్‌లో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచించిన సంగతి తెలిసిందే.