Site icon vidhaatha

Bogus cards । బోగస్‌ కార్డుల ఏరివేత ఇలా? ఆప్షన్ల ఎంపికకు సర్కార్‌ కసరత్తు!

రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు 83.04 లక్షలు
రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలు 89.69 లక్షలు
కార్డుల కోసం కొత్త దరఖాస్తులు 10 లక్షలు
కుటుంబాలకంటే అధికంగా రేషన్‌ కార్డులు
మరోవైపు ఆదాయ పరిమితి పెంచాలన్న డిమాండ్లు
ప్రభుత్వానికి సవాలుగా బోగస్‌ కార్డుల ఏరివేత

bogus cards । కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం (Telangana government) సిద్ధమైంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే లక్షల్లో ఉన్న బోగస్ కార్డుల (bogus cards) ఏరివేత ఎలా? అన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలుగా మారింది. రేషన్‌ బియ్యంతోపాటు ఇతర సరుకులను ఈ రేషన్‌ కార్డుల ద్వారా సబ్సిడీ ధరలకు (subsidized prices) అందిస్తారు. అయితే.. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం వచ్చి ఇక్కడ స్థిరపడినవారు సైతం కార్డులు పొందారని తెలుస్తున్నది. ఈ విషయాన్ని ఇటీవల సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub-Committee) కూడా నిర్ధారించుకున్నది. మరోవైపు కొంతమందికి డబుల్ రేషన్ కార్డులు (double ration cards) ఉన్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి కాకుండా ఆదాయ వర్గాల వారు కూడా ప్రభుత్వ రాయితీలు పొందడానికి అక్రమంగా (illegally) రేషన్ కార్డులు తీసుకున్నారన్న సందేహాలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం, ఇతర సరుకులను అయాచితంగా పొందడానికి కొంత మంది బోగస్ రేషన్ కార్డులు తీసుకున్నారన్న విమర్శలున్నాయి. ఇలా వివిధ రకాలుగా పొందిన అనర్హుల రేషన్ కార్డులను ఏరివేయడం సర్కారుకు సవాలుగా (challenge) మారింది.

జనాభా 3.77 కోట్లు.. 83 లక్షల కుటుంబాలు

3.77 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 83.04 లక్షల కుటుంబాలు (83.04 lakh families in Telangana) ఉన్నాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డిసెంబర్ నెలలో విడుదల చేసిన తెలంగాణ ఎట్ గ్లాన్స్ (Telangana at Glance) పేర్కొంటున్నది. గ్రామాల్లో 51.69, పట్టణాల్లో 31.35 కుటుంబాలున్నాయని తెలిపింది. విచిత్రంగా తెలంగాణలో ఉన్న కుటుంబాల కంటే అధికంగా రేషన్ కార్డులున్నాయి (more ration cards than families). రాష్ట్రంలో ధనికులు, మధ్యతరగతి, పేదలు, ప్రభుత్వ ఉద్యోగులు, టాక్స్ పేయర్లు (tax payers) అందరు కలిపి 83.04 కుటుంబాలుంటే రేషన్ కార్డులేమో 89.96 లక్షలున్నాయి. ఇప్పటికే ఉన్న కుటుంబాల కంటే అదనంగా 6.65 లక్షల రేషన్ కార్డులు తెలంగాణలో ఉన్నాయి. రాష్ట్రంలో 68,99,976 మంది రైతులు ఉన్నారు. ఇందులో 66.63 లక్షల మంది రైతులకు 10 ఎకరాలలోపు భూమి మాత్రమే ఉన్నది. అయితే ఇందులో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురికి కూడా భూమి ఉన్నది. ఈ విషయం రుణమాఫీ (loan waiver) సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసిన లెక్కల్లో వెలుగు చూసింది. ఇలా లెక్కించినప్పడు ఒక్క కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పేరున ఉన్న వ్యవసాయ భూమిని (agricultural land) కలిపితే 10 ఎకరాలు దాటిన ఆ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు రాదు.. అదే విధంగా భూమి యజమానుల్లో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని మినహాయిస్తే దాదాపు 10 లక్షల మంది భూ యజమానులకు రేషన్ కార్డు మినహాయింపు జరిగే అవకాశం ఉంది.

గత ప్రభుత్వం అనేక ఏళ్లుగా రేషన్ కార్డులు జారీ చేయలేదన్న విమర్శలున్నాయి. గత ప్రభుత్వంలో అనేక మంది ప్రజలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూపులు చూశారు కూడా. అసెంబ్లీ ఎన్నికల (assembly elections) తరువాత కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో రేషన్ కార్డుల దరఖాస్తులను కూడా స్వీకరింది. దాదాపు 10 లక్షల మంది పేదలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు దారులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తే 89.69 లక్షల కార్డులు కాస్తా.. 99.69 లక్షలు అవుతాయి. దీంతో తెలంగాణలో ఉన్న కుటుంబాల కంటే రెట్టింపు రేషన్ కార్డులు గణనీయంగా పెరిగిపోతాయి. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ సర్కారు ఏ విధంగా బోగస్, డూప్లికేట్‌ కార్డులకు చెక్ పెట్టాలన్న దిశగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బోగస్ కార్డుల ఏరివేతనే పెద్ద సవాలుగా మారనున్నది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ ఇతర రాష్ట్రాల వారిని గుర్తించి, వారి కార్డులను తొలగించాలని నిర్ణయించింది. అలాగే డూప్లికేట్‌లను గుర్తించడానికి వీలుగా సాఫ్ట్‌వేర్‌ను (software to identify duplicates) వినియోగించాలన్న ఆలోచనలో ఉన్నది. అలాగే ఈ కేవైసీ చేయించాలని నిర్ణయించారు. ఇలా బోగస్, డూప్లికేట్లను ఏరివేయాలన్న నిర్ణయంతో సర్కారు ఉన్నది. మరో వైపు కుటుంబ ఆదాయ పరిమితిని కూడా కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో మూడున్నర ఎకరాల మాగాణి, ఏడున్నర ఎకరాల మెట్ట, ఏడాదికి లక్షన్నరలోపు ఆదాయం ఉండాలని పేర్కొన్నది. అదే పట్టణాల్లో అయితే.. ఏడాదికి రెండు లక్షల ఆదాయం పరిమితిని (income limit) విధించింది. వాస్తవంగా పెరిగిన ధరలను పరిశీలిస్తే ఆదాయ పరిమితిని కూడా పెంచాలన్న డిమాండ్ వస్తోంది. పట్టణాలలో నెలకు రూ. 20 వేలు సంపాదించినా కుటుంబాన్ని నడపడం కష్టమని అంటున్నారు. ఆదాయ పరిమితిని కేరళ తరహాలో ఏడాదికి మూడు నుంచి నాలుగు లక్షల వరకు విధించాలన్న డిమాండ్ తెలంగాణ ప్రజల నుంచి వస్తోంది. అలా అయితే నిజంగా రేషన్ అవసరమైన కుటుంబాలకు రేషన్ ఇచ్చిన వారు అవుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో వైపు బోగస్ రేషన్ కార్డులను యుద్ధ ప్రాతిపదిక ఏరియాలని తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తోంది.

 

 

Exit mobile version