తెలంగాణలో పీజీ, పీజీ డిప్లొమా ,ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సీపీగెట్-2026 (TG CPGET 2026) ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ ఫలితాలను హైదరాబాద్‌లోని తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) కార్యాలయంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి తదితరులు విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి అధికారిక వెబ్‌సైట్ TG CPGET ద్వారా ర్యాంక్ కార్డులను, స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జులై 8 నుంచి 16వరకు జరిగిన టీజీ సీపీగెట్ పరీక్షకు 52,697మంది దరఖాస్తు చేసుకోగా.. 45,465 మంది హాజరయ్యారు. వీరిలో 42,526 మంది (86.3శాతం) క్వాలిఫై అయినట్లు అధికారులు వెల్లడించారు. జెండర్ వారీగా చూస్తే.. 31,534 మంది అమ్మాయిలు, 13,925 మంది అబ్బాయిలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్‌లు సీపీగెట్ పరీక్ష రాయగా.. వీరిలో 29,365 మంది అమ్మాయిలు, 13,158 మంది అబ్బాయిలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్‌లు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు.
సీపీగెట్ ర్యాంకుల ఆధారంగానే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఎంఏ (MA), ఎంఎస్సీ (M.Sc), ఎంకామ్ (M.Com) తో పాటు పలు పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటేడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో ఉస్మానియా యూనివర్సిటీ (OU), కాకతీయ యూనివర్సిటీ (KU), తెలంగాణ విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTUH), తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం (కోటి ఉమెన్స్ కాలేజ్) వంటి ప్రతిష్టాత్మక వర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలున్నాయి.
ర్యాంకుల విడుదల పూర్తి అయిన తర్వాత సీపీగెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలవుతుంది. విద్యార్థులు సాధించి ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. విడతల వారీగా ఈ ప్రక్రియ ఉంటుంది.
