Dana Kishore | రోడ్లపై వర్షపు నీళ్లు నిలువకుండా సంపులు కడతామంటున్న సర్కారు
హైదరాబాద్ నగరంలో వర్షపు నీళ్లు రోడ్లపై నిలకుండా సంపులు కడతామని తెలంగాణ సర్కారు అంటోంది. ఈ మేరకు ఖైరతాబాద్ జంక్షన్, రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సోమాజిగూడ ఆర్టీఏ ఆఫీస్ ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల సంపులను నిర్మించనున్నట్లు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ వెల్లడించారు

విధాత: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వర్షపు నీళ్లు రోడ్లపై నిలకుండా సంపులు కడతామని తెలంగాణ సర్కారు అంటోంది. ఈ మేరకు ఖైరతాబాద్ జంక్షన్, రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సోమాజిగూడ ఆర్టీఏ ఆఫీస్ ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల సంపులను నిర్మించనున్నట్లు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలో గుర్తించిన 140 నీళ్లు నిలిచే ప్రాంతాల్లో సైతం.. సంపులు నిర్మించడానికి తగిన స్థలాన్ని గుర్తించాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. మొదటగా ఖైరతాబాద్ జోన్, జూబ్లీహిల్ సర్కిళ్లలో రూ. 20 కోట్లతో మొత్తం 11 ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపులు నిర్మిస్తామని తెలిపారు. వర్షం కురిసే సమయంలో ఈ సంపుల్లో నీటిని సేకరించి.. అనంతరం సమీపంలో ఉన్న నాలాల్లో పంపింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తారని వెల్లడించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లు, ఎస్ఈలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు