Bhu Bharati | మరో ఆరు నెలలు ఇంతే సంగతులు.. భూ భారతిని సరిదిద్ధలేకపోతున్న ఎన్ఐసీ

Bhu Bharati | ఒకప్పటి ధరణి వెబ్ పోర్టల్ మార్పు చెంది భూ భారతి పోర్ట‌ల్‌గా అవతరించినా పాత సమస్యలు మాత్రం ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా లేవు. ఎన్నో లోపాలతో తయారైన భూ భారతి పోర్ట‌ల్‌లో ఒక్కొక్కటిగా సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి.

  • By: raj |    telangana |    Published on : Jan 18, 2026 1:00 AM IST
Bhu Bharati | మరో ఆరు నెలలు ఇంతే సంగతులు.. భూ భారతిని సరిదిద్ధలేకపోతున్న ఎన్ఐసీ

గత బీఆర్ఎస్ పాలకుల పాపం కొనసాగుతోంది..

Bhu Bharati | విధాత‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి : ఒకప్పటి ధరణి వెబ్ పోర్టల్ మార్పు చెంది భూ భారతి పోర్ట‌ల్‌గా అవతరించినా పాత సమస్యలు మాత్రం ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా లేవు. ఎన్నో లోపాలతో తయారైన భూ భారతి పోర్ట‌ల్‌లో ఒక్కొక్కటిగా సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. మండల జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అండ్ తహశీల్దార్‌కు కొనుగోలుదారుడు చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిష్ట్రేషన్ ఛార్జీలను వీక్షించే అవకాశం ఇవ్వకపోవడంతో మీ సేవా ఏజెంట్లు పెట్రేగిపోయి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్) నిపుణులు రంగంలోకి దిగినా, ఇప్పట్లో సమస్య పరిష్కారం అయ్యే సూచనలు కన్పించడం లేదు. ఇలాంటి సమస్యలు ఇంకా ఎన్ని ఉన్నాయనేది తనిఖీ చేసి పక్కాగా పరిష్కరించి పక్కాగా భూ భారతి పోర్టల్‌ను సిద్ధం చేసేందుకు కనీసం ఆరు నెలల సమయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. గత బీఆర్ఎస్ ఏలుబడిలో తమ ప్రయోజనాల కోసం రూపొందించిన ధరణి వెబ్ పోర్ట‌ల్‌లో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని కనీసం పరిశీలించకుండా భూ భారతిగా మార్చడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

దేశ చట్టాలంటే భయంలేని విదేశీ కంపెనీకి ధరణి  పోర్ట‌ల్‌

అవినీతి తగ్గించి, జవాబుదారితనాన్ని పెంపొందించేందుకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారాన్ని గత బీఆర్ఎస్ పాలకులు మండల తహశీల్దార్లకు అప్పగించారు. వ్యవసాయ భూముల కోసం ప్రత్యేకంగా ధరణి వెబ్ పోర్ట‌ల్‌ను రూపొందించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) కు సాప్ట్ వేర్ రూపొందించే బాధ్యతను అప్పగించకుండా ఊరు పేరు లేని, దేశ చట్టాలంటే భయంలేని విదేశీ కంపెనీకి అప్పగించారు. అప్పటి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో 2020 అక్టోబర్ 29వ తేదీన ధరణి వెబ్ పోర్టల్ సేవలను ప్రారంభించారు. సింగిల్ విండో విధానంలో ధరణి పోర్ట‌ల్‌లో పొందవచ్చని ప్రకటించారు.

పెద్ద ఎత్తున భూ అక్రమాలను ప్రోత్సహించడం

2010లో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ధరణి కోసం ఎలాంటి అనుభవం లేని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థలకు పోర్టల్ నిర్వహణ బాధ్యతలను అప్పగించాయని ఎన్ఐసీ, కాగ్ సంస్థలు లేవనెత్తాయని గత ఏడాది ధరణి పోర్ట‌ల్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థకు పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించవద్దని చెప్పినా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయలేదన్నారు. అప్పటి మంత్రి కే.తారక రామారావుకు అత్యంత సన్నిహితుడు అయిన గది శ్రీధర్ రాజు కంపెనీకి తెలంగాణ ధరణి పోర్టల్ రూపకల్పన, నిర్వహణ బాధ్యతలు అప్పగించందిదన్నారు. ధరణి టెండర్ దక్కిన వెంటనే పేరు, యాజమాన్యం మారిందని అన్నారు. ఫిలిప్ఫీన్ దేశానికి చెందిన ఫాల్కన్ హెచ్.బీ, సింగపూర్‌కు చెందిన మరో కంపెనీ ఇందులోకి వచ్చాయన్నారు. ఇలా అనేక మలుపులు తిరిగి అంతర్జాతీయ చట్టాలంటే ఏమాత్రం భయం లేని దేశంలో ధరణి సర్వర్లను ఏర్పాటు చేశారన్నారు. పెద్ద ఎత్తున భూ అక్రమాలను ప్రోత్సహించడం, ప్రైవేటు సంస్థలకు రైతుల డేటా అప్పగించడం, భూములు తారుమారు చేయడం, ప్రభుత్వ భూములను ప్రైవేటుపరం చేయడం వంటి సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి చట్టాన్ని తీసుకువస్తున్నామని ప్రకటించారు. అవకతవకపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని ప్రకటించారు.

2024లో ధరణి వెబ్ పోర్ట‌ల్ బాధ్యతలను ఎన్ఐసీకి అప్పగిస్తూ

ఆ ప్రకారంగానే ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అందరినీ సంప్రదించాకే, అఖిలపక్ష భేటీ తరువాత నూతన భూభారతి చట్టం తీసుకువస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 2024 అక్టోబర్ నెలలో ధరణి వెబ్ పోర్ట‌ల్ బాధ్యతలను ఎన్ఐసీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శాశ్వత పరిష్కారం చూపిస్తామని, సామాన్యులకు ఇబ్బందులు లేకుండా భూ భారతి వెబ్ పోర్ట‌ల్ తీసుకువస్తున్నామని ప్రకటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా లోపాలను సరిచేయించడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.

ధరణి, భూ భారతి వెబ్ పోర్ట‌ల్‌లో లొసుగులను గమనించి..

తాజాగా ధరణి, భూ భారతి వెబ్ పోర్ట‌ల్‌లో లొసుగులను గమనించిన మీ సేవా ఏజెంట్లు రిజిస్ట్రేషన్ ఛార్జీల సొమ్మును జేబులో వేసుకున్న కేసులో వరంగల్ పోలీసులు 15 మందిని అరెస్టు చేయగా, మొత్తం 24 మందిపై కేసులు పెట్టారు. మోసాలు జరుగుతున్నట్లు జనగామ పోలీసు స్టేషన్ లో ఈ నెల 7వ తేదీన కేసు నమోదు అయ్యింది. మీ సేవా కేంద్రాలు, ఆన్ లైన్ సెంటర్లను నిర్వహించే వ్యక్తులు ఒక ముఠా గా ఏర్పడి మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండికొట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. ప్రభుత్వ ఖజానాలో జమ కావాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జీ, స్టాంప్ డ్యూటీలో 90 శాతం తమ ఖాతాల్లోకి ఏజెంట్లు మళ్లించుకున్నారు. కేవలం పదిశాతం మాత్రమే ప్రభుత్వ ఖాజానా కు చెల్లించారు.
ధరణి వెబ్ పోర్టల్ రాక ముందు వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లేవారు. సబ్ రిజిస్ట్రార్ లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు కొనుగోలుదారుడు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ సక్రమంగా చెల్లించాడా లేదా అనేది తనిఖీ చేసేవాడు. అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్థారణకు వచ్చిన తరువాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి, ముగించేవాడు. వీళ్ల నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారాలను తొలగించి మండల తహశీల్దార్లకు కేసీఆర్ ప్రభుత్వం అప్పగించింది.

ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్ల ఆదాయం గండి

అయితే తమ దందాలకు అడ్డుగా ఉన్న ఈ విధానాన్ని కేసీఆర్ ప్రభుత్వం చాలా ముందు చూపుతో ధరణిలో తొలగించింది. ఫలితంగా తహశీల్దార్లు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను తనిఖీ చేసే అధికారం లేకుండా పోయింది. దీని వల్ల వేల ఎకరాల ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములు పరాధీనం అయ్యాయి. ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్ల ఆదాయం గండి పడింది. గత ఐదారు సంవత్సరాలుగా ఆడిట్ కూడా జరగడం లేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక విధానం తెస్తున్నామని చెప్పి డొల్ల భూ భారతి పోర్టల్ తీసుకువచ్చారు. పేరు మార్చారు తప్పితే అందులో లోపాలను సరిచేయకపోవడం మీ సేవా ఏజెంట్లు, ఆన్ లైన్ సెంటర్లకు కలిసి వచ్చింది. ఇలాంటి మరికొన్ని సమస్యలను పరిష్కరించేందుకు మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని ఒక అధికారి వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్ఐసీ నిపుణులు పనిచేస్తున్నారని ఆయన వివరించారు.