మహేష్ కుమార్ గౌడ్ బీసీ సీఎం వ్యాఖ్యల మర్మమేమిటో?

బీసీ సీఎం వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మహేశ్ కుమార్ గౌడ్.. కాంగ్రెస్‌లో కొత్త చర్చలకు తెర, రేవంత్ రెడ్డిపై రాజకీయ ఒత్తిడి?

మహేష్ కుమార్ గౌడ్ బీసీ సీఎం వ్యాఖ్యల మర్మమేమిటో?

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి పదవి అంశంపై తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి భవిష్యత్తులో బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని మహేశ్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. గాంధీభవన్ లో బీసీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారని మహేష్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. అట్టడుగు వర్గాలకు ఉన్నత పదవులు కల్పించడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని, రాబోయే రోజుల్లో సామాజిక తెలంగాణ నిర్మాణంలో బీసీల పాత్ర కీలకమని వివరించారు. స్థానిక సంస్థల నుండి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు బీసీలకు పెద్దపీట వేస్తామని ఆయన కేడర్‌కు స్పష్టం చేశారు.

బీసీ సీఎం ప్రకటన చేసే దమ్ము ఆ పార్టీలకు లేదు

అలాగే తమ పార్టీల నుంచి బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావులకు చెప్పే దమ్ముందా? అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీ వ్యతిరేక పార్టీలు అని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రాజకీయంగా, విద్య, ఉద్యోగ పరంగా 42 శాతం డిక్లరేషన్ ప్రకటించి చట్టం చేసిందని గుర్తు చేశారు. ఆ బిల్లులు పార్లమెంటులో ఎందుకు పెండింగ్ లో ఉన్నాయో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ గతంలో బీసీ రిజర్వేషన్లను 23శాతానికి కుదించిందని విమర్శించారు.

మహేశ్ గౌడ్ వ్యాఖ్యలతో బీసీ సీఎం రచ్చ

టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చేసిన బీసీ సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో .. ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాల్లో రచ్చ రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పదేళ్ల వరకు(రెండు టర్మ్ లు) నేనే సీఎంగా ఉంటానంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహేశ్ గౌడ్ చెప్పిన బీసీ సీఎం.. పదేళ్ల తర్వాత వస్తారా ? లేక అంతకు ముందే వస్తారా? అన్న చర్చ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. త్వరలో టీపీసీసీ చీఫ్ పదవి నుంచి మహేశ్ కుమార్ గౌడ్ ను తప్పిస్తారన్న చర్చ సాగుతున్న తరుణంలో ఆయన బీసీ సీఎం నినాదం ఎత్తుకోవడం వెనుక మతలబు ఏమై ఉంటుందన్న చర్చోపచర్చలు సాగుతున్నాయి. మహేశ్ కుమార్ గౌడ్ చేసిన బీసీ సీఎం వ్యాఖ్యలు…ఓ రకంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే విధంగా ఉన్నాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఆరు లైన్లు…డబుల్ డెక్కర్ తో విజయవాడ – హైదరాబాద్ : మంత్రి వెంకట్ రెడ్డి
ఆ చెత్త డంప్ ప్రాంతం నా గుండెకాయ: మాజీ మంత్రి మల్లారెడ్డి