Vijayashanthi : విజయశాంతికి హోం శాఖ? లేదంటే విద్యాశాఖ? కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చలు!
రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రుల దూకుడుకు పగ్గాలు వేసేందుకు విజయశాంతితో పాటు మరికొందరికి అవకాశం కల్పించాలని అధిష్ఠానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందంటున్నారు. అది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందనేది స్పష్టంగా తెలియనప్పటీ స్థానిక ఎన్నికల ముందు లేదా తరువాత ఖచ్చితంగా అమలవుతుందని కాంగ్రెస్ నాయకుడొకరు పేర్కొన్నారు.

- క్యాబినెట్ బెర్త్ ఖాయమంటున్న కాంగ్రెస్ వర్గాలు
- సీఎం వద్దే హోం, మునిసిపల్, విద్యా శాఖలు
- భట్టి, ఉత్తమ్ వద్ద కూడా అదనపు శాఖలు
- వాటిలో ఒకటి రాములమ్మకు దక్కే చాన్స్!
- రాజకీయవర్గాల్లో జోరుగా చర్చలు
Vijayashanthi : ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ముందు అనూహ్యంగా తెరమీదకు వచ్చిన సినీనటి ఎం విజయశాంతి మరో రెండు రోజుల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికకాబోతున్నారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభీష్టానికి వ్యతిరేకంగా విజయశాంతి ఢిల్లీలోని అధిష్ఠానం ఆశీస్సులతో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారనే చర్చ నడుస్తున్నది. అయితే విజయశాంతి పెద్దల సభలో అడుగుపెట్టడంతోనే ఆగుతారా? లేక మంత్రివర్గంలోకి సైతం ప్రవేశిస్తారా? అన్న కొత్త చర్చ ఊపందుకున్నది. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అనేది రేవంత్ రెడ్డికి సరిపోలుతుందేమో. కొద్ది రోజుల క్రితం ఒక నాయకుడు విజయశాంతి అంశాన్ని రేవంత్ ముందు ప్రతిపాదించగా, ఆమెను రాజ్యసభకు పంపిస్తానని, ఇక్కడ మాత్రం ఉండనివ్వనని చెప్పారంట! ఆమె మనస్తత్వం ఏ క్షణంలో ఎలా ఉంటుందో చెప్పలేమని, వేగడం కూడా కష్టమని వ్యాఖ్యానించారని విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలో పార్టీ పెద్దలు ఏమి ఆలోచించారో ఏమో తెలియదు కానీ.. అనూహ్యంగా ఆమె పేరు తెరమీదకు రావడం, నామినేషన్ వేయడం కూడా జరిగిపోయాయి. ఈమె స్థానంలో తన స్నేహితుడు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయించుకోవాలని ప్రయత్నించినప్పటికీ సీఎం సఫలం కాలేకపోయారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా విజయశాంతి అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేసే రోజు పక్కనే మాజీ ఎంపీ మధుయాష్కి ఉండటం రేవంత్ వర్గీయులకు మింగుడుపడటం లేదట! మధు యాష్కీకి నేరుగా ఢిల్లీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి.
మంత్రి పదవి ఖాయం?
స్థానిక ఎన్నికలకు ముందు లేదా తరువాత జరిగే మంత్రివర్గ విస్తరణలో విజయశాంతికి బెర్త్ దక్కడం ఖాయమంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన మునిసిపల్, విద్య, హోం శాఖలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆయనే ఈ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. విస్తరణ ఎప్పుడంటే అదిగో ఇదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్నది. మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వద్ద కీలకమైన శాఖలు అదనంగా ఉన్నాయి. వీరిద్దరి శాఖల్లో కోత వేయాలని సహచర మంత్రులు ఢిల్లీకి ఫిర్యాదులు పంపుతునే ఉన్నారు. విజయశాంతి నామినేషన్ వేసిన మరుక్షణం నుంచే హోం మంత్రి అవుతారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకున్నది. రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రుల దూకుడుకు పగ్గాలు వేసేందుకు విజయశాంతితో పాటు మరికొందరికి అవకాశం కల్పించాలని అధిష్ఠానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందంటున్నారు. అది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందనేది స్పష్టంగా తెలియనప్పటీ స్థానిక ఎన్నికల ముందు లేదా తరువాత ఖచ్చితంగా అమలవుతుందని కాంగ్రెస్ నాయకుడొకరు పేర్కొన్నారు. హోంమంత్రి అవుతారా? లేక విద్యాశాఖ నిర్వహిస్తారా? అనేది మున్ముందు తెలియనున్నది. విస్తరణ జరగకపోవడానికి కారణం కూడా ఉంది. బీఆర్ఎస్ నుంచి చేరిన వారిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. ఎప్పటిలోగా అనర్హత వేటు వేస్తారో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఇటీవలే నోటీసు పంపించి మార్చి మూడో వారానికి కేసు వాయిదా వేసింది.
మీనాక్షి, విజయశాంతి ఒకేసారి ఎంపీలు
మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మీనాక్షి నటరాజన్ పార్లమెంటు సభ్యురాలిగా 2009-2014 వరకు ప్రాతినిధ్యం వహించారు. మీనాక్షి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్నారు. విజయశాంతి కూడా 2009-2014 మధ్య మెదక్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా పనిచేశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఉందని, ఆ కారణంతోనే ఆమెను ఎమ్మెల్సీగా మీనాక్షి ఢిల్లీ పెద్దలకు సిఫారసు చేసి ఉండవచ్చని అంటున్నారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయశాంతి గురించి పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆమె కూడా గుంభనంగా అంటూ అదను చూసి తన సత్తా నిరూపించుకుందని అభిమానులు చెబుతున్నారు.