కొండా సురేఖకు బిగుసుకుంటున్న ఉచ్చు – ఫిర్యాదు చేసిన వరంగల్ ఎమ్మెల్యేలు
Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలిపై వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదుల దండయాత్ర మొదలుపెట్టారు. సురేఖ నోటి దురుసుతనం, అన్ని నియోజకవర్గాలపై పెత్తనానికి ప్రయత్నాలు చేయడం వారిని చాలా ఇబ్బంది పెడుతోంది. సహించలేని శాసనసభ్యులు ఫిర్యాదుల బాటపట్టారు.
మంత్రి కొండా సురేఖ పై వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు(Warangal MLAs) దాడి మొదలుపెట్టారు. గత రాత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి(Deepa das munshi)తో భేటీ అయిన వారు మంత్రి తీరుపై తీవ్ర ఆవేశం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరీ మూర్ఖురాలిగా ప్రవర్తిస్తోందని అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితం టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్(Mahesh kumar goud) ని కలిశారు. అన్ని నియోజకవర్గాల్లో కొండా సురేఖ వర్గం అటు పార్టీకి, ఇటె ఎమ్మెల్యేలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తోందని వారు ఫిర్యాదు చేసారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని వారు హై కమాండ్(High Command) ను కోరారు. మంత్రి కొండా సురేఖ వైఖరితో పార్టీకి నష్టం జరుగుతుందని ఫిర్యాదులో ఏడుగురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, సీతక్క, కడియం శ్రీహరి, యశస్విని ఇంకా మురళీనాయక్ ఈ విషయంలో అధిష్టానాన్ని సంప్రదించారు. ఇప్పటికే సమంత, కేటీఆర్(Samantha, KTR) విషయంలో పీకలలోతు ఇరుక్కుపోయిన సురేఖ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేయడంతో పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే చర్చ కూడా నడుస్తోంది. గీసుకొండ పోలీస్‌స్టేషన్‌లో సిఐ కుర్చీలో కూర్చోవడం కూడా(Sat in CI chair) వివాదాస్పదం అయింది. మంత్రి స్థాయి వ్యక్తికి ఆ మాత్రం తెలియకపోవడం విడ్డూరంగా ఉందని సోషల్‌మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించే, ఎమ్మెల్యేలంతా పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారని అర్థమవుతుంది. నాగార్జున కుటుంబంతో ఇప్పటికే ప్రియాంకా గాంధీ మాట్లాడినట్లుగా, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా వచ్చిన వార్తల నేపథ్యంలో, వరంగల్ ఎమ్మెల్యేలు, మంత్రి కొండా సురేఖ మధ్య సమన్వయలేమిని పార్టీ నాయకత్వం ఎలా సరిదిద్దుతుంది అనేది వేచి చూడాల్సిందే.
టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో ముగిసిన వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల భేటీ తర్వాత వరంగల్ నేతల మధ్య నెలకొంటున్న సమస్యలపై ఆయన స్పందించారు. కొంతమంది కార్యకర్తల అత్యుత్సాహం వల్లనే నేతల మధ్య అభిప్రాయభేదాలు వస్తున్నాయన్న గౌడ్, కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి, తమ కార్యకర్తలు, శాసనసభ్యులు, సీనియర్ నాయకులు బెరుకు లేకుండా మాట్లాడే స్వాతంత్ర్యం ఎప్పుడూ ఉంటుందని, ఈ విషయాన్ని పార్టీ సరిచేస్తుందని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram