వరంగల్ పశ్చిమ ప్రజలకు రుణపడి ఉంటా.. విజయోత్సవ ర్యాలిలో ఎమ్మెల్యే నాయిని

ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు మీకు రుణపడి ఉంటానని, ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు

వరంగల్ పశ్చిమ ప్రజలకు రుణపడి ఉంటా.. విజయోత్సవ ర్యాలిలో ఎమ్మెల్యే నాయిని

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు మీకు రుణపడి ఉంటానని, ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ శాసన సభ్యులుగా నాయిని రాజేందర్ రెడ్డి శాసన సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్ట మొదటి సారిగా హన్మకొండకు వచ్చిన సందర్భంగా ఆదివారం డిజీల్ కాలనీ లో ప్రజలు నాయిని రాజేందర్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, మీకు అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు.


నా గెలుపుకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని ఇచ్చారని, ఇప్పుడు ప్రజల రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు. ఆరు గ్యారెంటీలలో రెండింటిని అమలులోకి తెచ్చారని గుర్తు చేశారు. ఇందులో మొదటిది మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు తెచ్చిన పథకం అని వివరించారు. ప్రజలను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించి పది లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసుకునేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మిగతా నాలుగు గ్యారంటీలను కూడా త్వరలోనే ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తుందన్నారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు.