Warangal | ఏసీబీ ముసుగులో వసూళ్లూ.. ముఠా అరెస్టు
ఏసీబీ అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడిన ఐదుగురు సభ్యుల నకిలీ ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 13 సెల్ ఫోన్లు నగదు స్వాధీనం చేసుకున్నారు.
విధాత, వరంగల్ ప్రతినిధి:
ఏసీబీ అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడిన ఐదుగురు సభ్యుల నకిలీ ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ప్రధాన నిందితులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాచంపల్లి శ్రీనివాస్ అలియాస్ మంగళ శ్రీను అలియాస్ వాసు, కర్ణాటకకు చెందిన నవీన్, మంగళ రవీందర్, మురళి, ప్రసన్న ఉన్నారు. మిగత వాళ్లు సూర్యప్రకాశ్, తాటిమర్రి వేణు, కొత్తకోట రమణ పరారీలో ఉన్నారు.
వారి నుంచి 13 సెల్ ఫోన్లు కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సోమవారం మీడియాకు వివరించారు. సీపీ వివరాల ప్రకారం అక్టోబర్ నెలలో వరంగల్ జిల్లా రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న తుమ్మల జయపాల్ రెడ్డికి రాచంపల్లి శ్రీనివాస్ తాను ఏసీబీ డీఎస్పీ అని బెదిరించి రూ. 10 లక్షలను వివిధ మార్గాల్లో దోచుకున్నాడు. వచ్చిన ఈ డబ్బుతో గోవా, బెంగుళూరు వంటి ప్రాంతాలకు వెళ్ళి జల్సాలు చేసి ఖర్చు పెట్టేవాడు. ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ అలియాస్ మంగళ శ్రీను పై 78 కేసులు ఉన్నాయని చెప్పారు. జైలు నుండి విడుదలైన తర్వాత కూడా సులభంగా డబ్బులు సంపాదించాలని ఏసీబీ, పోలీస్ అధికారుల అవతారం ఎత్తి ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram