Revanth Reddy Attend Madhava Reddy Mother Ceremony | ఎమ్మెల్యే దొంతిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దశదిన కర్మకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై పరామర్శించారు. మాధవరెడ్డి, రేవంత్ రెడ్డి ఆలింగనం చేసుకోవడం సయోధ్యకు సూచనగా భావిస్తున్నారు. అయితే, జిల్లా మంత్రి కొండా సురేఖ సీఎం పర్యటనకు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.

విధాత, వరంగల్ ప్రతినిధి: ఎట్టకేలకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సయోధ్య కుదిరింది. తన పొడ అంటేనే గిట్టని మాధవరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పరామర్శించారు. దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మరణించగా, బుధవారం దశదిన కర్మ నేపథ్యంలో సీఎం ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. కాంతమ్మకు నివాళులు అర్పించి దొంతిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి, రేవంత్ రెడ్డి పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కొద్ది నిమిషాలు అక్కడే గడిపి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిపాడ్కు సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి కేయూ రోడ్డులోని పీజేఆర్ గార్డెన్ కు చేరుకుని కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, నర్సంపేట నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేవంత్ రాక సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు, ఈలలతో హోరెత్తించారు. అందరినీ ఉత్సాహపరుస్తూ అభివాదం చేస్తూ రేవంత్ ముందుకు సాగారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అందరూ వచ్చినా …మంత్రి సురేఖ డుమ్మా
సీఎం పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ మాత్రం సీఎం పర్యటనకు, ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. సీఎం వచ్చినా మంత్రి కొండా హాజరుకాకపోవడం తీవ్ర చర్చనులేవనెత్తింది. సీఎం రేవంత్ రెడ్డికి హెలిపాడ్ వద్ద మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బలరామ్ నాయక్, కడియం కావ్య, విప్ రామచంద్రు నాయక్, వేం నరేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి,నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, యశస్విని రెడ్డి. సీపీ సన్ప్రీత్ సింగ్,హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, ఇతర అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి స్వర్ణ, పుల్లా పద్మావతి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఇదిలా ఉండగా దొంతిని పరామర్శించిన వారిలో మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.