రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పంతాలకు, పట్టింపులకు పోకుండా వెంటనే మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావుడి మాండ్ చేశారు
విధాత, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పంతాలకు, పట్టింపులకు పోకుండా వెంటనే మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావుడి మాండ్ చేశారు. ఆదివారం ఆషాఢం బోనాల సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహంకాళి దేవాలయంలో బోనం ఎత్తుకుని, ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లులేక పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాజకీయాలను పక్కన పెట్టి రైతుల సంక్షేమం దృష్ట్యా సాగునీటి సమస్యలను పరిష్కరించాలన్నారు. గతంలో బీఆరెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి కష్టం రాకుండా ఆదుకుందని చెప్పుకొచ్చారు. అలాగే ఆలయ కమిటీ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని ప్రశంసించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితి నెలకొందని, మహంకాళి అమ్మ దయతో మంచి వర్షాలు పడాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.