Loksabha Elections 2024 | ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తాం : కేటీఆర్‌

పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ కేడర్ అద్భుత పనితీరు కనబరిచిందని, పార్టీ అధినేత కేసీఆర్ పోరుబాట బ‌స్సు యాత్ర‌తో గులాబీ సైన్యంలో గుండెల నిండా ఆత్మ‌విశ్వాసంతో పార్లమెంటు ఎన్నికల్లో పోరాడిందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Loksabha Elections 2024 | ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తాం : కేటీఆర్‌

కేసీఆర్ బస్సుయాత్రతో పుంజుకున్న బీఆరెస్‌
బీజేపీ గెలుపు కోసం సీఎం రేవంత్‌రెడ్డి సహకారం
కేంద్రంలో హంగ్ ఖాయం
ప్రాంతీయ పార్టీలదే నిర్ణయాత్మక పాత్ర
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

విధాత : పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ కేడర్ అద్భుత పనితీరు కనబరిచిందని, పార్టీ అధినేత కేసీఆర్ పోరుబాట బ‌స్సు యాత్ర‌తో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా గులాబీ సైన్యంలో గుండెల నిండా ఆత్మ‌విశ్వాసంతో పార్లమెంటు ఎన్నికల్లో పోరాడిందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కార్యకర్తల కష్టం వృధా కాదని, పార్లమెంటు ఎన్నికల్లో మంచి సంఖ్యలో బీఆరెస్ గెలవబోతుందన్నారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ప‌రాభ‌వం పాలైన‌ప్ప‌టికీ, ర‌క‌ర‌కాల కుట్ర‌లు, కేసుల రాజకీయాలను ఎదుర్కోని, పార్టీలో నుంచి నాయకులను గుంజుకుపోయినప్పటికి గ్రామ‌గ్రామ‌నా, ప్ర‌తి ప‌ట్ట‌ణంలో మొక్క‌వోని దీక్ష‌తో క్షేత్ర స్థాయిలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బ‌లంగా బీఆరెస్ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారన్నారు. పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా ప్ర‌త్య‌ర్థుల దుష్ర్ప‌చారాలు, విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టడంలో విజయవంతమైందన్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చేప‌ట్టిన కేసీఆర్ బ‌స్సు యాత్ర రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఒక మ‌లుపు తిప్పిందన్నారు.

ఏ జిల్లాకు పోయినా, నియోజ‌క‌వ‌ర్గం, ప‌ట్ట‌ణం పోయినా కేసీఆర్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారని తెలిపారు. ఎన్నికల్లో బీఆరెస్ తిరిగి బలం పుంజుకుందన్నారు. గులాబీ సైనికులు రెండు జాతీయ పార్టీల‌కు ముచ్చెట‌మ‌లు ప‌ట్టించారని, కేసీఆర్ పోరు బాట‌కు జ‌నం నుంచి వ‌చ్చిన స్పంద‌న‌తో కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం జోష్ వ‌చ్చిందన్నారు. 17 రోజుల బ‌స్సు యాత్ర‌తో జాతీయ పార్టీల నాయ‌క‌త్వాలు దిగివ‌చ్చి తమ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఈనాడైనా ఏనాడైనా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి బీఆరెస్ మాత్రమే శ్రీరామ రక్ష అని ప్రజలు అర్ధం చేసుకున్నారన్నారు. రెండు జాతీయ పార్టీలు పరస్పర విమర్శలు, సన్నాయి నొక్కులు తప్ప రాష్ట్రానికి వారి చేసేదేమి లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థుల గెలుపు కోసం కేడర్ చేసిన కృషి స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుత విజయాలకు పునాది కాబోతుందన్నారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలు

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలు అన్నట్లుగా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహారించాయని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకే కిషన్‌రెడ్డి కంటే సీఎం రేవంత్‌రెడ్డి ఆరేడు స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి ఎక్కువగా కష్టపడి సహకరించారన్నారు. ఐదు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం టైమ్ పాస్ రాజకీయాలు చేసిందని, కొన్ని రోజులు మేడిగడ్డ అని, మరికొన్ని రోజులు శ్వేతపత్రాలని, ఇంకొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని టైం పాస్ చేసి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేసిందన్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని, కేంద్రంలో ఈసారి హంగ్ ఖాయమన్నారు. ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా ఎన్డీఏ, ఇండియా కూటమిలలో లేని ప్రాంతీయ పార్టీలే ఈ దఫా కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నాయని, బీఆరెస్ ఇందులో కీలక భూమిక పోషించబోతుందన్నారు.