KTR : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్‌ నోటీసులు!

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

KTR : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్‌ నోటీసులు!

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని సిట్ పేర్కొంది. ఈ కేసులో తాజాగా మాజీ మంత్రి టి.హరీష్ రావును విచారించిన సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం..ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. అటు హరీష్ రావును కూడా మరోసారి సిట్ విచారణకు పిలవవచ్చని సమాచారం. ఇదే కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విచారించేందుకు నోటీసులు జారీ చేస్తారన్న ప్రచారం గట్టిగా వినిపిస్తుంది.

ఆరోపణలను తోసిపుచ్చిన కేటీఆర్

గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్రమంలో పలుమార్లు కేటీఆర్ పేరు వినిపించింది. సినీ హీరోయిన్లు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కేటీఆర్ ట్యాపింగ్ చేయించారని ఆయనపై ఆరోపణలు చెలరేగాయి. స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు సైతం ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ప్రమేయంపై ఆరోపణలు చేశారు. అయితే ఫార్ములా ఈ కారు రేసు కేసు మాదిరిగానే ఇదోక లొట్టపీసు కేసు అని, రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలలో భాగంగా సిట్ పేరుతో ఆడుతున్న డ్రామా అని ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను కేటీఆర్ కొట్టిపారేశారు. హరీష్ రావు ను సిట్ విచారణకు పిలిచిన సందర్భంలోనూ కేటీఆర్ ఇదే వాదనను వినిపించారు. ఇప్పుడు సిట్ తనను కూడా విచారణకు పిలిచిన నేపథ్యంలో కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

నిలదీస్తున్నందుకే మాకు నోటీసులు : హరీష్ రావు

ప్రభుత్వ అక్రమాలు, ఎన్నికల హామీలపై గట్టిగా నిలదీస్తున్నందుకే నాకు, కేటీఆర్ కు సిట్ విచారణ నోటీసులు జారీ చేసిందని మాజీ మంత్రి టి.హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే సిట్ నోటీసులు, విచారణ తంతులు అని హరీష్ రావు విమర్శించారు. ఎన్ని నోటీసులిచ్చినా, ఎన్ని కేసులు పెట్టిన మేం ప్రభుత్వాన్ని నిలదీస్తుంటామని, రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు భయపడబోమని, ఆయనను వదిలిపెట్టబోమని, వెంట పడుతామని హరీష్ రావు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

Viral Video : అంధ భక్తి నిర్వాకం..విమర్శల పాలైన గంగా పాలాభిషేకం
Mahesh Babu | శ్రీమ‌తికి సూప‌ర్ స్టార్ స్పెష‌ల్ విషెస్.. ఇలా చెబితే ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే…!