Telangana New CS : తెలంగాణ కొత్త చీఫ్ సెక్ర‌ట‌రీ ఆయ‌నేనా? స‌చివాల‌యంలో బిగ్ డిస్క‌ష‌న్‌!

ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త సీఎస్ ఎవరన్న చర్చ జోరందుకున్నది. ఈ రేసులో ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నా.. ఒకరి పేరు మాత్రం ఖాయమని సెక్రటేరియట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయన ఎవరంటే..

Telangana New CS : తెలంగాణ కొత్త చీఫ్ సెక్ర‌ట‌రీ ఆయ‌నేనా? స‌చివాల‌యంలో బిగ్ డిస్క‌ష‌న్‌!

Telangana New CS :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చీఫ్ సెక్రటరీ (CS) ఎవరన్న అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీకాలం ఏప్రిల్ నెలతో ముగిసిపోనుంది. 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శాంతికుమారి తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శి. 2023 జనవరి 11న తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు చేపట్టగా.. 2025 ఏప్రిల్ వరకు పదవిలో కొనసాగనున్నారు. శాంతికుమారి అనంతరం కొత్త సీఎస్ ఎవరన్నది ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పదవీకాలం మరికొంత కాలం పొడిగిస్తారా? లేక కొత్త వారిని ఆ పోస్టులో నియమిస్తారా? అన్నదానిపై అధికారవర్గాలతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీలోనూ అంతర్గత చర్చలు జోరుగా సాగుతున్నాయి.

అయితే కొత్త సీఎస్‌గా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న కే రామకృష్ణారావు వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తున్న‌ది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సైతం రామకృష్ణారావును కొత్త సీఎస్‌గా నియ‌మించేందుకు ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. కాగా రామకృష్ణారావుతో పాటు సీఎస్ రేసులో ప్రభుత్వ సమాచార-సాంకేతిక శాఖ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, పరిశ్రమల, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్ పేరు కూడా వినిపిస్తున్న‌ది. ఈయన 1992 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి. తన ఐఏఎస్ బ్యాచ్‌లో ఆల్-ఇండియా టాపర్‌గా నిలిచారు. తెలంగాణ రైజింగ్ పేరుతో పారిశ్రామిక పెట్టుబడుల సాధనపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఆయన పేరు కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం క‌న్సిడ‌ర్ చేయ‌వ‌చ్చ‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో టాక్ న‌డుస్తున్న‌ది. ఇప్పటికే కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు పేరును సీఎం రేవంత్ రెడ్డికి, క్యాబినెట్ సహచరులకు కూడా భట్టి ప్రతిపాదించారని.. కాంగ్రెస్ అధిష్ఠానం వద్ధ కూడా ఆయన పేరును భట్టి ప్రతిపాదించారని సమాచారం.

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ల‌న్నీ ఆయన చేతి మీదనే

రామకృష్ణారావు 1991 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) తెలంగాణ కేడర్ కు చెందినవారు. ఆయన కాన్పూర్, ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) నుంచి ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీలను పొందారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఆయన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) డైరెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశారు. డీజీగా ఆయన దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రధానంగా ఐటీ ఆధారంగా అనేక సంస్కరణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలలో కీలక బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ, ఆర్థిక, ప్రణాళిక విభాగాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే రామకృష్ణారావు రూపొందించినన్నిసార్లు రాష్ట్ర బడ్జెట్‌ను మరే ఇతర ఐఏఎస్‌ అధికారి రూపొందించలేదు. కొత్త రాష్ట్రం తెలంగాణలో 2014 ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుసగా బడ్జెట్ల రూపకల్పన, అమలులో భాగస్వామి అవుతున్నారు.

ఇప్పటివరకు ఆయన 12 బడ్జెట్లను రూపొందించారు. ఆయన నాయకత్వంలోనే రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన, అమలు జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలకు, కార్యక్రమాలకు అవసరమైన వనరులను సమీకరించారు. రాష్ట్రంలో వివిధ ఆర్థిక వ్యవస్థలను విజయవంతంగా ప్రవేశపెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక‌ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే కార్యక్రమంలో కీలక భూమిక పోషిస్తున్నారు. అదనంగా తెలంగాణ కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అన్ని విషయాలను పరిష్కరించే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ శాఖ బాధ్యతను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పూర్తి పట్టున్న రామకృష్ణారావు సీఎస్‌గా ఉంటే ప్రభుత్వానికి ఆర్థిక వనరుల సమీకరణలో కలిసివస్తుందని భట్టి భావిస్తున్నార‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తున్న‌ది. అయితే రామకృష్ణారావు పదవీ కాలం కూడా మరో 5నెలల్లో ముగిసిపోనున్నది. ఈ నేప‌థ్యంలో ఆయ‌నను సీఎస్‌గా ఎంపిక చేస్తారా? అన్న సందేహం కూడా వినిపిస్తున్న‌ది. పదవీకాలం పొడిగించే ఆలోచనతో రామకృష్ణారావును సీఎస్‌గా నియమించే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని సెక్ర‌టేరియ‌ట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

ఆర్థిక సంక్షోభాలను అధిగమించేందుకే..

2014లో రాష్ట్రం ఏర్పడే సమయానికి రూ.75,577 కోట్లుగా ఉన్న తెలంగాణ అప్పులు 10 సంవత్సరాలలో అనూహ్యంగా పెరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కల్లా రూ.6,71,751 కోట్లకు చేరుకున్నాయి. గడిచిన 15నెలల కాలంలో 1లక్ష 65వేల కోట్ల అప్పులు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకునే అప్పు ఈ నెలాఖరునాటికి రూ.70వేల కోట్లకు చేరుకోనుంది. బడ్జెట్ లో అంచనా వేసిన అప్పు కంటే కూడా ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది. నిజానికి ఈసారి బడ్జెట్ లో రూ.57.112కోట్ల రుణాలు తీసుకంటామన్న అంచనా వేసింది. కేంద్రం 49,255కోట్ల రుణాలకు అనుమతినిచ్చినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం అప్పులతో కలిపి రూ.70వేల కోట్లకు అప్పులు చేరనుండటం గమనార్హం. పాత రుణాల కిస్తీలు, వడ్డీలకే ప్రతినెల తాము రూ.6,500కోట్ల చెల్తిస్తున్నామని ఆర్థిక మంత్రి భట్టి వెల్లడించారు.

రాష్ట్ర రాబడులు, అప్పులు కలిపి ప్రతినెల రూ.18,500కోట్లు కాగా..వ్యయాలు రూ.22,500కోట్లు ఉంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంతటి ప్రతికూల ఆర్థిక పరిస్థితుల నేపధ్యంలో ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారెంటీలతో పాటు 420ఎన్నికల హామీలు అమలు చేయాలంటే బయటి నుంచి నిధులను సమకూర్చుకోకతప్పదు. మరోవైపు జీఎస్డీపీ పడిపోయింది. గడిచిన పదేండ్లలో తొలిసారి రాష్ట్ర వృద్ధి రేటు తగ్గింది. రోజురోజుకు జటిలమవుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతూ..ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు నిధుల సమీకరణకు ఆర్థిక విభాగంలో అనుభవజ్జుడైన రామకృష్ణారావు కొత్త సీఎస్ గా వస్తే బాగుంటుందని భట్టి వంటి కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నార‌ని స‌మాచారం.