Akbaruddin | పైలట్ ప్రాజెక్టుకు పాతబస్తీనే ఎందుకు .. బడ్జెట్ చర్చలో అక్బరుద్ధిన్ నిలదీత

విద్యుత్తు బిల్లుల వసూలు ప్రైవేటీకరణలో భాగంగాం అదానీ కంపనీకి ఇవ్వడానికి పైలెట్ ప్రాజెక్టు కింద పాతబస్తీనే ఎందుకు సెలెక్ట్ చేశారని, కొడంగల్‌లో లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా శ్రీదర్ బాబు నియోజకవర్గాల్లో పెట్టొచ్చు కదా

Akbaruddin | పైలట్ ప్రాజెక్టుకు పాతబస్తీనే ఎందుకు .. బడ్జెట్ చర్చలో అక్బరుద్ధిన్ నిలదీత

మెట్రో రైలు ఇస్తామని బీఆరెస్ మోసం చేసిందని ఆగ్రహం
పాతబస్తీకి మెట్రో రైలు సేవలు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ

విధాత, హైదరాబాద్ : విద్యుత్తు బిల్లుల వసూలు ప్రైవేటీకరణలో భాగంగాం అదానీ కంపనీకి ఇవ్వడానికి పైలెట్ ప్రాజెక్టు కింద పాతబస్తీనే ఎందుకు సెలెక్ట్ చేశారని, కొడంగల్‌లో లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా శ్రీదర్ బాబు నియోజకవర్గాల్లో పెట్టొచ్చు కదా? అని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని నిలదీశారు. బడ్జెట్‌పై చర్చలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి హామీలు ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. అప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్న, ఏమైనా సరే ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయాల్సిందేనన్నారు. గత ప్రభుత్వం పాతబస్తీలో మెట్రోను
విస్మరించిందన్నారు. పాతబస్తీ కూడా హైదరాబాద్ లోని భాగమేనన్నారు. పాతబస్తీ ప్రాంతానికి మెట్రో రైలును విస్తరించాలని డిమాండ్ చేశారు. తమతో తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్న కేటీఆర్ ఇగో మెట్రో రైలు తెస్తున్నాం.. తెస్తున్నాం అంటూ కాలయాపన చేశారే తప్పా ఏనాడూ ముందడుగు వేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌ మెట్రో కావాలని తానే డిమాండ్ చేసినట్లు గుర్తుచేశారు. దీని కోసం ఆనాడు ముఖ్యమంత్రితో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు తెలిపారు. చివరకు పోరాడి తీసుకొచ్చామని.. కానీ నా ప్రాంతంలోనే ఇప్పుడు మెట్రో సేవలు లేవని,. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదన్నారు.

పాతబస్తీకి మెట్రో రైలు తెస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

పాత బస్తీలో మెట్రో నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, ఈ మేరకు నిర్మాణ సంస్థ ఎల్‌ఆండ్‌టీతో చర్చలు జరుపుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. గత బీఆరెస్‌ ప్రభుత్వం ఓల్డ్ సిటీని మోసం చేసిందని.. పాతబస్తీకి మెట్రో తీసుకురావడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. హైటెక్ సిటీ నుండి ఎయిర్ పోర్టుకు మొత్తం 32 కిలో మీటర్ల మెట్రో నిర్మాణానికి గత ప్రభుత్వం టెండర్లు పిలించిందని.. కేవలం సిరాస్తి సంస్థలకు మేలు చేసేందుకే ఆ మార్గంలో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఎయిర్ పోర్టుకు నుంచి రోడ్లు ఉన్నాయని.. మెట్రో అవసరం లేని మార్గాల్లో నిర్మాణానికి టెండర్లు పిలిచారని గత బీఆరెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మా ప్రభుత్వం ప్రజల అవసరం, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎల్బీ నగర్ నుండి ఎయిర్ పోర్టు వరకు మెట్రో నిర్మించనుందని స్పష్టం చేశారు. పాతబస్తీ ప్రజలకు మేలు కలిగేలా చాంద్రాయణగుట్ట మీదుగా మెట్రో నిర్మాణం చేపడుతామని తెలిపారు. రాష్ట్రంలో రెండో దశ మెట్రో నిర్మాణానికి నిధులు కోరితే కేంద్రం రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. రెండో దశలో 78 కి.మీ మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదిక సమర్పించామన్నారు. నాలుగేళ్లలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు పూర్తి చేసే బాధ్యత తమదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం సహకరించకున్నా సరే పాతబస్తీ, ఎయిర్ పోర్టు మెట్రోను 2029కల్లాయ ఖచ్చితంగా నిర్మించి తీరుతామని తేల్చి చెప్పారు. మా దృష్టిలో పాతబస్తీ ఓల్డ్ సిటీ కాదని.. ఒరిజినల్ సిటీ అని అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలను ప్రచారంలో వినియోగించారని అమిత్ షా, కిషన్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందే కాంగ్రెస్ అని, మాకు బీజేపీతో లోపాయికారి స్నేహం లేదన్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా మోదీ దేశానికి ప్రధానమంత్రి… ఆయన రాష్ట్రాలన్నింటికి పెద్దన్నలాంటి వారన్నారు. గుజరాత్, బీహార్‌లా తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఆయన్ను కోరామని, వివక్ష చూపకుండా పెద్దన్నలా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ మాటలు నేను ఎక్కడో చెవిలో చెప్పలేదని, ఆదిలాబాద్ సభలో అందరి ముందే చెప్పానని, రాజకీయ ప్రయోజనం కోసం కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోదీని పెద్దన్నలా వ్యవహరించాలని కోరానన్నారు. మేమం ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని మాటలతో కాలయపన చేయం. పాతబస్తీపై మాకు ఎలాంటి వివక్ష లేదన్నారు. విద్యుత్తు బిల్లుల అంశంలో వివాదం అక్కరలేదన్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ బీ ఫామ్ పై కొడంగల్ నియోజవర్గం నుండి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని వ్యాఖ్యానించారు. చీఫ్ ఎన్నికల ఏజెంట్ గా ఉండి అక్బరుద్దీన్‌ గెలుపు కోసం కృషి చేస్తాననన్నారు. అక్బరుద్దీన్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి అసెంబ్లీలో నా పక్కనే కూర్చొబెట్టుకుంటానని రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్పందించిన అక్బరుద్ధిన్ తాను మజ్లిస్‌ పార్టీలో సంతోషంగానే ఉన్నానని, పార్టీ మారే ప్రసక్తే లేదని. చివరి శ్వాస వరకు మజ్లిస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.