తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా వేస్తా
కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న మాకుటుంబ సభ్యులపై అసత్య ప్రచారం చేస్తున్నాడని బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

♦ మా కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారం
♦ బీఆరెస్ కార్యకర్తలపై బెదిరింపులు ఆపండి
♦ బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న మాకుటుంబ సభ్యులపై అసత్య ప్రచారం చేస్తున్నాడని బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. సోమవారం పల్లా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఓడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు.
మా కుటుంబ సభ్యులపై తీన్మార్ మల్లన్న అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు పల్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. తన భార్య నీలిమ ఇంటర్ లో రాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచి, 1992లోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించినట్లు చెప్పారు. 2015లో డివిజనల్ ఇంజనీర్ గా ప్రమోషన్ వచ్చిందన్నారు. 6 నెలలు డిప్యూటేషన్ పై సచివాలయంలో పని చేశారని, 2020 నవంబర్ 19న వీఆర్ఎస్ తీసుకున్నట్లు చెప్పారు. వామపక్ష విద్యార్థి సంఘం నాయకురాలిగా కూడా ఆమె పని చేశారన్నారు. అనురాగ్ విద్యాసంస్థల్లో ప్రతి నెలా 5వ తేదీన జీతాలు ఇస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం దొంగతనంగా ఉద్యోగం ఇచ్చినట్లు తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనపైన తీన్మార్ మల్లన్న రెండు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారని, ప్రజావాణిలో తీన్మార్ మల్లన్నపై ప్రజలు ఫిర్యాదులు చేశారని తెలిపారు. ప్రభుత్వం తీన్మార్ మల్లన్నపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ విద్యాసంస్థలకు వచ్చి తీన్మార్ మల్లన్న సోదరుడు బెదిరిస్తున్నట్లు పల్లా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మల్లన్న మాట్లాడుతున్నాడని, జనగామలో తనపైన ఓడిపోయిన అభ్యర్థి ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నాడన్నారు. మా యూనివర్సిటీకి ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి బెదిరిస్తున్నట్లు చెప్పారు.