Tourist places | హైదరాబాద్ సమీపంలోని ఈ మూడు టూరిస్టు ప్రదేశాల గురించి మీకు తెలుసా..?
Tourist places : ఒకప్పుడు సంపద చాలా తక్కువగా ఉండేది. దాంతో సామాన్యులు టూర్‌లు అనే ఆలోచనే చేసేవాళ్లు కాదు. కేవలం సంపద ఎక్కువ ఉన్న వాళ్లు మాత్రమే టూర్లతో ఎంజాయ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అందరి దగ్గరా పైసా కనబడుతోంది. కాబట్టి సామన్యులు కూడా టూర్‌లకు వెనుకాడటం లేదు. దాంతో టూరిస్టు ప్రదేశాలు పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. హైదరాబాద్‌కు సమీపంలో మూడు ముఖ్యమైన టూరిస్ట్ ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Tourist places : ఒకప్పుడు సంపద చాలా తక్కువగా ఉండేది. దాంతో సామాన్యులు టూర్‌లు అనే ఆలోచనే చేసేవాళ్లు కాదు. కేవలం సంపద ఎక్కువ ఉన్న వాళ్లు మాత్రమే టూర్లతో ఎంజాయ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అందరి దగ్గరా పైసా కనబడుతోంది. కాబట్టి సామన్యులు కూడా టూర్‌లకు వెనుకాడటం లేదు. దాంతో టూరిస్టు ప్రదేశాలు పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. హైదరాబాద్‌కు సమీపంలో మూడు ముఖ్యమైన టూరిస్ట్ ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకప్పుడు హైదరాబాదీలు వారం మొత్తం బాధ్యతలు, ఉద్యోగాలతో బిజీబిజీగా గడిపి.. వారాంతపు సెలవు నాడు ఇండ్లకే పరిమితమయ్యేవారు. హాయిగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఎంజాయ్ చేసేవారు. అంతేతప్ప టూర్‌ల మీద అంతగా ఆసక్తి చూపేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాదీలు టూర్ ప్లాన్ చేస్తున్నారు. చూడదగ్గ ప్రదేశాల కోసం వెతుకుతున్నారు. ఎక్కువగా ప్రాచుర్యం లేని ప్రదేశాల గురించి కూడా అన్వేషించి వారాంతంలో అక్కడ వాలిపోతున్నారు. ఒక్కరోజులో చూసి రాగలిగే హైదరాబాద్ సమీపంలోని టూరిస్ట్ ప్రదేశాల్లో లోయర్ మానేరు డ్యామ్, ఈగల పెంట, కొంగల జలపాతం ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.
1. లోయర్ మానేరు డ్యామ్
ఈ డ్యామ్‌ను కరీంనగర్ జిల్లా అలుగనూరు గ్రామంలో మానేరు నదికి అడ్డంగా నిర్మించారు. ఈ డ్యామ్ హైదరాబాద్ మహానగరానికి కేవలం 162 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నది. మానేరు నది గోదావరి నదికి ఉపనది. మానేరుపై నిర్మించిన ఈ డ్యామ్ పర్యాటకులకు కావాల్సినంత కనువిందు చేస్తుంది. సాయంత్రం వేళల్లో మానేరు నదీ తీరంలో గడిపే నగరవాసులను ప్రకృతి అందాలు పరవశింపజేస్తాయి. పైగా రిజర్వాయర్‌లో బోటింగ్‌కు వెళ్లేవారికి చల్లని పిల్లగాలి గిలిగింతలు పెడుతుంది.
2. ఈగల పెంట
స్నేహితులతోగానీ, కుటుంబసభ్యులతోగానీ వీకెండ్ స్పెండ్ చేయడానికి ఈగలపెంట ఒక చక్కని టూరిస్ట్ ప్లేస్. హైదరాబాద్ నగరానికి 190 కిలోమీటర్ల దూరంలో ఈ ఈగలపెంట ఉన్నది. శ్రీశైలం వెళ్లే దారిలో నల్లమల అడవుల్లో ఉంటుంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం ఇది. ఈగలపెంటకు వెళ్లేదారిలోని పచ్చని అడవులను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఇక ఈగలపెంటలోని హరిత రిసార్ట్స్ నుంచి ముగ్ద మనోహరమైన ప్రకృతి అందాలను వీక్షించడం మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. ఈ ప్రాంతంలో ప్రధానమైన పర్యాటక ఆకర్షణ ఇదే. అంతేగాక ఈ టూర్‌కు వెళ్లినవారు ఫర్హాబాద్‌లోని జంగిల్ సఫారీ, మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్, ఆక్టోపస్ వ్యూ పాయింట్‌ను అస్సలు మిస్ కావొద్దు.
3. కొంగల జలపాతం
ఈ కొంగల జలపాతం హైదరాబాద్ నగరానికి 275 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్నది. వరంగల్ నగరం నుంచి అక్కడికి రెండు గంటల ప్రయాణం. వారమంతా విధులు నిర్వహించడంతో కలిగిన విసుగును పారదోలి పునరుత్తేజం నింపడానికి ఈ కొంగల జలపాతం ఒక చక్కని పర్యాటక ప్రాంతం. రహదారికి ఇరువైపుల పచ్చని అడవితో ప్రకృతి రమణీయత పర్యాటకులను పులకరింపజేస్తుంది. స్వచ్ఛమైన పచ్చని చెట్ల నడుమ అత్యంత స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీల్చుకోవచ్చు. దట్టమైన పచ్చని చెట్లతో నిండిన ఎత్తయిన కొండల నుంచి జాలువారే ఈ కొంగల జలపాతం తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశం.