‘ఆవులించిన’ అనకొండ… ఇది చూశాక మీకు ఆవులింత రావడం ఖాయం
ప్రపంచంలో అతిపెద్ద సర్పజాతి అనకొండ. ఇది తనకంటే పెద్ద జీవిని సైతం అమాంతం మింగేయగలదు. అందుకు దాని దవడల నిర్మాణం కీలకంగా ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నది.
మనుషులకు ఆవులింతలు వస్తాయి. ఆ సమయంలో నోరంతా తెరిచి.. విస్తారంగా గాలి పీల్చుకుని.. మళ్లీ వదులుతుంటారు. కొన్ని జంతువుల్లోనూ ఇది కనిపిస్తుంటుంది. మరైతే పాములు కూడా ఆవలిస్తాయా? సర్పజాతుల్లోనే అత్యంత భారీ పాము అయిన అనకొండ ఆవులిస్తుందా? ఈ వీడియో చూస్తే అవుననే అనిపిస్తుంది. ఈ మేరకు ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో ఒక భారీ గ్రీన్ అనకొండ.. తన నోటిని అసాధారణ స్థాయిలో పదే పదే తెరవడం నెటిజన్లలో ఆసక్తి రేపింది. పచ్చటి చెట్ల మధ్య అనకొండ నోరు తెరిచిన సమయంలో దాని నోటి లోపలి భాగం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దవడల కదలికలు సైతం అద్భుతంగా దర్శనమిస్తాయి. ఈ వీడియోను చూసిన అనేక మంది.. అనకొండ ఇంత పెద్దగా నోరు తెరుస్తుందా? అంటూ ముక్కన వేలేసుకుంటున్నారు. కొందరైతే అనకొండ ఆవులించిందేమోనని సెటైర్‌లు వేస్తున్నారు.
అసలు అనకొండ ఇంత పెద్దగా నోరు ఎలా తెరువగలదు?
ఈ వీడియోకు శాస్త్రీయ వివరణ కూడా జోడించారు. అనకొండలు తనకు మించిన పరిమాణం కలిగిన ప్రాణులను సైతం అమాంతం స్వాహా చేయగలవు. దీనికి కారణం.. దాని ప్రత్యేకమైన దవడ నిర్మాణం. సాధారణంగా మనుషులకు, జంతువులకు దవడలు ఒకే ఎముకగా పనిచేస్తాయి. కానీ.. పాముల విషయంలో పూర్తి భిన్నంగా ఉంటుంది. సర్ప జాతులకు కింది దవడ రెండు భాగాలుగా విడిపోయి ఉంటుంది. రెండు భాగాలు కలుపుతూ ‘విస్తరించగల’ లిగమెంట్స్ ఉంటాయి. అందువల్లే అనకొండ లేదా ఇతర సర్పజాతులు తమకంటే పెద్ద ప్రాణాలను మింగే సమయంలో ఆహారం పరిమాణానికి అనుగుణంగా దవడలు అవసరమైన మేరకు సాగుతాయి.
ఈ అనకొండలు ఆకలైనప్పుడు మాత్రమే వేటాడుతాయి. ఆకలి తీరిన తర్వాత నెలల తరబడి, కొన్నిసార్లు కొన్నేళ్లపాటు మళ్లీ వేటాడవట. ప్రధానంగా దక్షిణ అమెరికా అడవుల్లో కనిపిస్తుంటాయి. ఇది 9 మీటర్ల వరకూ అంటే.. సుమారు 30 అడుగుల పొడవు వరకూ పెరుగుతుంది. శరీరం చుట్టుకొలత గరిష్ఠస్థాయిలో 30 సెంటీమీటర్ల వరకూ ఉంటుంది. 250 కేజీల వరకూ బరువు ఉంటుంది.
విషరహితాలైన అనకొండలు.. వివిధ ప్రాణులను చుట్టేసి.. వాటిని ఊపిరి సలపనీయకుండా బిగదీసి చంపుతాయి. తర్వాత ఆ మొత్తం ప్రాణిని మెల్లగా స్వాహా చేస్తుంది. ఇలా తిన్న జంతువు జీర్ణం కావడానికి కొన్ని వారాల సమయం తీసుకుంటుంది. మొసళ్ల జాతికి చెందిన కైమాన్‌లను సైతం ఇవి తింటాయి. మనుషులపై అనకొండలు దాడి చేసిన ఘటనలు అత్యంత అరుదు. అయితే.. అనకొండ సినిమాలో దాని భారీ రూపాన్ని మరింతగా పెంచేసి చూపడంతో ఈ జాతి సర్పంపై భయం నెలకొంది.
అనకొండలు సెమీ ఆక్వాటిక్ జీవులు. ఎక్కువ సమయం నీటిలోనే ఉంటాయి. నదీపరివాహక ప్రాంతాల్లోని పచ్చికబయళ్లు, నీటి చలమలు, మెల్లగా పారే వాగులు వీటి ఆవాసాలు. అటవీ ప్రాంతాల్లో సహజ వాతావరణంలో పదేళ్ల వరకూ బతుకుతాయి.
అనకొండల ప్రత్యేకత ఇదే..
అనకొండలు తమ దవడలను స్వతంత్రంగా కదలించగలవు. ఈ ప్రత్యేక లక్షణం కారణంగానే అవి మొసళ్ల వంటి భారీ ప్రాణులను సైతం వేటాడగలవు. ఆహారాన్ని మింగేసిన తర్వాత దవడలు సహజ స్థితికి వచ్చేందుకు అనకొండలు ప్రత్యేకండా వాటిని కదిలిస్తాయి. కింది వీడియోలో కనిపించిన ‘ఆవలింత’ తరహా కదలికలు ఈ ప్రక్రియలో భాగమే. అంటే.. ఇది పాముల శరీర నిర్మాణానికి చెందిన ఒక సహజ లక్షణం. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మో.. ఎంత బలమైన నోటి కండరాలో.. అని వ్యాఖ్యానించారు. అనకొండకు కోరలు లేవా? అని ఒకరు సందేహం వ్యక్తం చేస్తే.. ఇది చూశాక నాకు ఆవలింత వచ్చింది.. అని మరొకరు స్పందించారు. ఇది చూశాక మీకు కూడా ఆవలింత వచ్చిందా?
Anaconda realigning its jaw after eating a meal pic.twitter.com/4iQYgSNRvo
— Sinaptica (@wwwsinaptica) April 4, 2026
Read Also |
Laddu Box | లక్షతో ‘లడ్డు’ బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!
IRCTC Sapta Jyotirlinga Tour | రూ.17వేల్లోనే సప్త జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఆధ్యాత్మిక టూర్!
Viral News | అమ్మో.. ఇంత శాడిస్టులా! పక్కింటోళ్లకు దెయ్యాల కథలు వినిపిస్తూ టార్చర్!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram