బిల్డర్ల సంచలన వ్యూహం! కొత్త సర్కార్ వచ్చిన తర్వాత ఒకేసారి బిల్డింగ్ అనుమతులు, ఓసీ తీసుకునే యోచన
ఇప్పుడు బిల్డింగ్ అనుమతుల కోసం చెల్లింపులు చేసుకోవాలి.. వచ్చే ప్రభుత్వంలో ఓసీ కోసం చెల్లింపులు చేసుకోవాలి. డబుల్ బాదుడు ఎందుకు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చే వరకూ ఎదురు చూస్తే పోలా? అనే వైఖరిలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్గాలు ఉన్నాయా?
విధాత, హైదరాబాద్ :
దాదాపు రెండున్నరేళ్లపాటు హైదరాబాద్, చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్తంభించే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దీని ప్రభావం ఇతర రంగాలపైనా చూపించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గత రెండున్నరేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం నేల చూపులు చూస్తున్నదనే వాదనలు ఉన్నాయి. ఈ అననుకూల వాతావరణం, ప్రభుత్వ కఠిన వైఖరి నేపథ్యంలో ఈ సర్కారు దిగిపోయిన తర్వాతే కొత్త అనుమతుల జోలికి వెళ్లాలని దాదాపు 90 శాతం రియల్టర్లు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆలోపు ఇప్పటికే అనుమతులు వచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తీసుకుని, మళ్లీ రెండున్నరేళ్లలో వాటికి ఓసీల కోసం.. ఇలా రెండు సార్లు ఆమ్యామ్యాలు చెల్లించే బదులు.. వచ్చే ప్రభుత్వంలోనే రెండింటి పనీ పూర్తి చేసుకుంటే మేలనే అభిప్రాయానికి వచ్చారనే చర్చ రియల్ ఎస్టేట్ వర్గాల్లో వినిపిస్తున్నది.
టీడీఆర్ పాట్లు
ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) నిబంధనలు కఠినతరం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. దానిపై రియల్టీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మార్చి నెల మూడో వారంలో కొంత వెనక్కి తగ్గుతూ సవరణ ఆదేశాలు జారీ చేసింది. 21 మీటర్ల ఎత్తు దాటిన వాటిని హైరైజ్ బిల్డింగులుగా గుర్తిస్తూ, పది అంతస్తుల నుంచి ఇరవై అంతస్తులలోపు నిర్మాణం చేసే వారు 3 శాతం బిల్టప్ ఏరియాలో, 20 అంతస్తులు దాటితే 5 శాతం టీడీఆర్ చెల్లించాలని సవరించింది. అది కూడా భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకునే సమయంలో 50 శాతం టీడీఆర్, ఆక్యుపెన్షీ సర్టిఫికేట్ (ఓసీ) తీసుకునేటప్పుడు మిగతా 50 శాతం టీడీఆర్ బకాయిలు చెల్లించాలని షరతు విధించారు.
ఇది మొత్తంగా ఏదో ఒక విధంగా జేబులు ఖాళీ చేసే పనే తప్ప.. ఊరట కల్పించింది ఏమీ లేదన్న అభిప్రాయాన్ని రియల్టర్లు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాక ముందు రాష్ట్రంలో అటు ప్రభుత్వానికి ఇటు రియల్టర్లకు ప్రయోజనం కలిగేలా టీడీఆర్ విధానం ఉండేదని, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తరువాతే ఈ రంగానికి ఇబ్బందులు మొదలయ్యాయని వ్యాఖ్యానిస్తున్నారు. హెచ్ఎండీఏ లేదా కార్పొరేషన్ల నుంచి అనుమతులు తీసుకుని హై రైజ్ భవనాలు నిర్మించేవారు. అనుమతి ప్రకారం 30 లేద 40 అంతస్తులు నిర్మించిన తర్వాత టీడీఆర్ సమర్పించి, అదనపు అంతస్తులు వేసుకునేవారు. టీడీఆర్‌కు ఎంత వెచ్చిస్తున్నాం? దాని ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది? అనే లెక్కలు వేసుకొని ముందుకు వెళ్లేవారు.
నాలుగైదు నెలల క్రితం టీడీఆర్ నిబంధనల్లో మార్పు తీసుకురావడంతో ఒక్కసారిగా రియల్టర్లు షాక్ తిన్నారు. పది అంతస్తుల దాటి నిర్మాణం చేసేవారు ముందుగా టీడీఆర్ సమర్పించిన తరువాతే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. ఇదేం నిబంధన? అంటూ రియల్టర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తాజాగా కొన్ని మార్పులు చేసి మరో జీవో జారీ చేశారు. ఇది కూడా ఏ విధంగానూ ఉపయోగకరంగా లేదని రియల్టర్లు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో రియల్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్‌లో ప్రచారం జరుగుతోంది.
అందుకే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మారే వరకు హైరైజ్ భవనాల అనుమతుల జోలికి వెళ్లకుండా మిన్నకుండిపోవడమే మేలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తున్నది. అనుమతుల కోసం ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు ఆమ్యామ్యాలు ముట్టచెప్పడం, నిర్మాణం పూర్తయిన తరువాత మళ్లీ కొత్త ప్రభుత్వం వద్దకు ఆక్యుపెన్షీ సర్టిఫికేట్, టీడీఆర్ కోసం మళ్లీ చెల్లింపులు చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు రెట్టింపు డబ్బులు అడిగే ప్రమాదముందని భయపడుతున్నారు. గత ప్రభుత్వంతో తమకేమీ సంబంధం లేదని, తమకు మాత్రం డబ్బు ఇవ్వాల్సిందేనని అంటే ఏం చేయలేమనే భయంతో ఉన్నారు. దీంతో రెండున్నర సంవత్సరాలు ఓపిక పడితే, కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత చూద్దాంలే అనే విధంగా రియల్టీ రంగం ఉన్నదనే చర్చలు వినిపిస్తున్నాయి.
గతంలో అనుమతించిన హైరైజ్ భవనాలకు పరిమితం…
2024 సంవత్సరంలో 64 హైరైజ్ భవనాలకు అనుమతులు ఇవ్వగా, 2025లో 103 హైరైజ్ భవనాలకు అనుమతులు మంజూరయ్యాయి. కోకాపేటలో 63 అంతస్తుల భవనానికి (215 మీటర్ల ఎత్తు) అనుమతులు ఇవ్వగా, 2029 లో ఈ ప్రాజెక్టు పూర్తి కానున్నది. తెల్లాపూర్‌లో 50 అంతస్తులు, కొల్లూరులో 39, బాచుపల్లిలో 35, కోకాపేటలో 23 అంతస్తుల ఎత్తులో నిర్మాణం చేసే వాటికి అనుమతులు లభించాయి. అందుబాటులో రోడ్డు, మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అనుమతులు జారీ చేసింది.
కొద్ది రోజుల క్రితం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను మూడు కార్పొరేషన్లుగా విభజించారు. విభజన తరువాత మూడు కార్పొరేషన్ల కమిషనర్లకు పది అంతస్తుల వరకు మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం కల్పించారు. పది అంతస్తులు దాటితే అనుమతుల కోసం హెచ్ఎండీఏను ఆశ్రయించాలని మున్సిపల్ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోకాపేట, తెల్లాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, నార్సింగ్, మేడ్చల్, ఉప్పల్, శామీర్ పేట, శంషాబాద్ ప్రాంతాలలో ఎక్కువగా హైరైజ్ భవనాలు వస్తున్నాయి.
Read Also |
రూ. 225 కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మాణ మాస్టర్ ప్లాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు …తెలంగాణలో సెలవు దినాలు!
Ramayana | ఓటీటీ మార్కెట్‌లో రామాయణ హవా.. వారణాసిని మించి మరీ.. ?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram