Word of The Year 67 | వర్డ్ ఆఫ్ ది ఇయర్ 67.. స్కూళ్లు ఎందుకు దీన్ని బ్యాన్ చేస్తున్నాయి?
67ను డిక్షనరీ డాట్‌కామ్ ఈ ఏడాది పదంగా ప్రకటించింది. దీని అర్థం ఏమిటి? ఎవరు వాడుతున్నారు? ఎందుకు వాడుతారు?
Word of The Year 67 | ఎవరూ పుట్టించకపోతే పదాలు ఎలా పుడతాయి? వేసేయండి ఓ వీరతాడు.. అంటాడు మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుడు! ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో, కృత్రిమ మేథ కాలంలో కొత్త కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి పదమే 67. నిజానికి దీనిని సిక్స్ సెవెన్ అని పలుకుతున్నారు. అయితే.. కొన్ని పశ్చిమదేశాల్లో ఈ పదాన్ని స్కూళ్లలో వినియోగించడాన్ని నిషేధించారంటే.. ఈ పదంలో చాలా విషయం ఉన్నట్టేగా! నెటిజన్ భాషలు వర్ధిల్లుతున్న నేపథ్యంలో ‘సిక్ సెవెన్’ పదాన్ని డిక్షనరీ డాట్‌కామ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2025గా ప్రకటించింది. విచిత్రం ఏమిటేంటే దీనికి అర్థం అంటూ లేదు. టిక్‌టాక్ రీల్స్‌లో పుట్టుకొచ్చిన ఈ పదాన్ని జెన్ జీ ఎక్కువగా వినియోగిస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో తెగ వాడుకలో ఉన్న ఈ పదం తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నది. కొన్ని స్కూళ్లలో దీనిని నిషేధించారు. అల్గోరిథంలు, మీమ్‌ల యుగంలో భాష పరివర్తనాన్ని ఇది సూచిస్తున్నది.
సిక్స్ సెవెన్ అంటే అర్థం ఏంటి? కచ్చితంగా, సూటిగా చెప్పాలంటే.. దీనికి అర్థం ఎవరికీ తెలియదు. అదే అసలు సంగతి. మరి ఈ పదం ఇంత విస్తృంగా ఎలా ప్రాచుర్యం పొందింది? ఇప్పుడు చూద్దాం. జెన్ జీ, యువ నెటిజన్లలో సిక్స్ సెవెన్ ఎక్కువగా వాడుకలో ఉంది. సో–సో, మేబీ దిస్, మేబీ దట్.. అనే పదాలకు సమానార్థంలో దీనిని వాడుతున్నారు. రెండు చేతులు పైకి ఎత్తి రెండు చూపుడు వేళ్లు, బొటన వేళ్లను మధ్యలోకి కదుపుతూ చేసే గెశ్చర్‌తో ఈ పదాన్ని జోడించి వాడుతున్నారు. ఎవరికైనా సరదాగా లేదా సెటైరిక్ రిప్లైలు ఇచ్చే సమయంలో ఈ గెశ్చర్ వాడుకలో ఉన్న విషయం తెలిసిందే. ఉదాహరణతో చెప్పాలంటే.. ఒక టీనేజర్‌ను ‘ఈ రోజు స్కూలు సంగతేంటి? అని అడిగితే.. మీకు ‘సిక్స్ సెవెన్’ అని సమాధానం వస్తుంది. ఇదొక కొత్త ఆన్‌లైన్ వర్నాక్యులర్ భాషగా తయారైంది.
నిజానికి ఈ పదం వాడకం రాపర్ స్క్రిల్లా రాసి పాడిన డూట్‌డూట్ (67)తో మొదలైంది. ఈ పాట ఈ ఏడాది ప్రారంభంలో టిక్ టాక్‌ను ఒక ఊపు ఊపేసింది. ఈ ట్రాక్‌ను వాడి పెద్ద సంఖ్యలో మీమ్స్ వచ్చాయి. ఇక అక్కడి నుంచి సిక్స్ సెవెన్ విస్ఫోటం మొదలైంది. అయితే.. అమెరికాలోని కొన్ని స్కూళ్లలో సిక్స్ సెవెన్ పదం వాడటాన్ని నిషేధిస్తున్నారు. ఇదొక ప్రమాదకరమైన అలగా భాష (స్లాంగ్)గా చెబుతున్నారు. క్లాస్ రూమ్‌లలో ఎవరో ఒకరు సిక్స్ అని అనగానే.. మిగిలినవారంతా సెవెన్.. అంటూ కేకలు వేస్తున్నారట. ఇది క్లాస్‌ను డిస్ట్రబ్ చేసేదిలా ఉందంటూ చాలా స్కూళ్లు ఈ పదాన్ని నిషేధించాయి. కొన్ని స్కూళ్లలో ఈ పదం వాడినవారిపై పెనాల్టీలు కూడా విధిస్తున్నారు. తాను 20 ఏళ్లుగా పాఠాలు చెబుతున్నానని, ఎన్నో రకాల స్లాంగ్‌లు విన్నాను కానీ.. ఇలాంటి వెర్రి పదాన్ని ఎప్పుడూ వినలేదని మిషిగాన్‌కు చెందిన స్కూలు టీచర్ ఆండ్రియా లాప్‌లాండర్ చెప్పారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram