Titanoboa Prehistoric Serpent | టైటానోబోవా! 45 అడుగుల పొడవు.. 2,500 పౌండ్ల బరువున్న పామును చూశారా?
అరు కోట్ల సంవత్సరాల క్రితం సంగతి ఇది! దక్షిణ అమెరికాలోని దట్టమైన అడవులు! భయానకమైన ఉక్కపోత! అక్కడ మహా హంతక వేటగాడు ఉద్భవించాడు! అప్పటికి డైనోసార్లు అంతరించిపోయాయి! వాటి స్థానంలో వచ్చిన కొత్త వేటగాడు. ఆ అడవిని రూల్ చేశాడు! ఆ వేటగాడి పేరే.. టైటానోబోవా! 45 అడుగుల పొడవు! దాదాపు 11 వందల కిలోల బరువు! ఆహారం కంటబడితే క్షణంలో స్వాహా! అది జంతువు కావొచ్చు! భయానక మొసలి కావొచ్చు! ఏదైనా ఆ వేటగాడి ముందు బలాదూర్! ఆ మహా వేటగాడి ఆనవాళ్లు.. 2009 వరకూ ఎవరూ కనిపెట్టలేకపోయారు! ఆ తర్వాత చరిత్ర పూర్వపు జీవితం, పర్యావరణానికి సంబంధించిన అంచనాలు మారిపోయాయి. మరుగునపడిన భారీ కాయాల చరిత్ర బయటకు వచ్చింది!

Titanoboa Prehistoric Serpent | మీరు అతిపెద్ద పామును చూశారా? నిజంగా కాకపోయినా వీడియోల్లోనైనా చూశారా? కోబ్రాలు అయితే 14 అడుగుల వరకూ పెరుగుతాయి. కొండచిలువలు మరో ఐదు అడుగులు ఎక్స్ట్ర్ పెరుగుతాయి. కానీ.. ఏకంగా 45 నుంచి 50 అడుగుల పొడువు ఉంటుంది.. టైటానోబోవా! సింపుల్‌గా చెప్పాలంటే మీరెక్కే సిటీ బస్సు అంత పొడవు.. ఒక ఆయిల్ డ్రమ్ అంత చుట్టుకొలతతో ఉండేది. అది ఇప్పటి కాలపు ఒక చిన్నకారును చుట్టుముట్టిందంటే.. ఆ కారు కనిపించదు! ఈ భూప్రపంచంపై డైనోసార్లు అంతరించిపోయిన తర్వాత ధరిత్రిపై పాకులాడిన భయానక సర్పం! టైటానోబోవాకు ఉన్న మితిమీరిన శక్తి కారణంగా అది మొసళ్లను, భారీ చేపలను సైతం అలవోకగా భోం చేసేసేది. అదే ఆ కాలపు మహా వేటగాడిగా దాన్ని నిలిపింది. అనకొండ.. హారర్ సినిమా గుర్తుకొస్తున్నదా? దీని శిలాజ ఆనవాళ్లు ప్రస్తుత కొలంబియాలో కనుగొన్నారు. అప్పటిదాకా భారీ సర్పాలు ఉన్నాయని భావించినా.. 2009 తర్వాతే అది నిజమేనని తేలింది.
2009లో కొలంబియాలోని సెరెజోన్ బొగ్గు గనుల్లో ఈ భారీ సర్పం శిలాజాలను శాస్త్రవేత్తలు గుర్తించడంతో టైటానోబోవా వెలుగులోకి వచ్చింది. దాని ఎముకల వ్యవస్థ ఇప్పటికాలపు ఏ జీవితోనూ సరిపోలలేదు. ఇప్పటిలాగా నాటి అడవులు సరైన వాతావరణ పరిస్థితులను కలిగి ఉండేవి కావు. అత్యంత వేడి, తేమ కారణంగా సరీసృపాలు ఊహించనంత స్థాయిలో పెరిగిపోయాయి. ఇదే పరిస్థితుల్లో టైటానోబోవా సైతం భారీ కాయంతో ఈ అడవుల్లో తిరుగాడింది. ఇప్పటి పాములు వేటలో ఎక్కువగా తమ విషంపై అధారపడేవి. కానీ.. టైటానోబోవా మాత్రం ఈనాటి కొండచిలువ ఎలా జీవులను అమాంతం మింగేస్తుందో.. అలా మిగేసేది. తన ఆహారాన్ని దొరకపట్టుకుని, తన భారీ కాయంతో దానిని చుట్టేసి.. ప్రాణం పోయేలా చేసేది. ఆ తర్వాత అమాంతం మింగేసేది. అన్ని పాములకు మాదిరిగానే దాని దవడలు ఎంత కావాలంటే అంత స్థాయిలో తెరుచుకునేవి. ఇక దాని బలంతో భారీ మొసళ్లు, భారీకాయంలో ఉండే తాబేళ్లు, భారీ చేపలు వంటివాటిని అవలీలగా తినేసేది. కావాలంటే.. 45 అడుగుల పాము.. మీకు సమీపం నుంచి పాకుతూ వెళుతూ తనకు కనిపించిన ఆహారాన్ని అమాంతం నోట్లోకి లాగేసుకున్న దృశ్యాన్ని ఊహించుకోండి! ఒళ్లు జలదరిస్తుంది కదా!
ఇప్పటి వరకూ ఈ భూమిపై జీవించిన, జీవిస్తూ ఉన్న అన్ని పాముల కంటే టైటానోబోవా అతి భారీ సర్పం. అతి భారీ సర్పంగా చెప్పే గ్రీన్ అనకొండ.. సుమారు 20 నుంచి 30 అడుగుల వరకూ మాత్రమే పెరుగుతుంది. సుమారుగా 250 కిలోలల లోపు బరువు తూగుతుంది. అంటే.. టైటానోబోవా బరువులో గ్రీన్ అనకొండ కంటే దాదాపు ఐదింతలు భారీకాయం. టైటానోబోవాలు పాలియోసిన్ యుగంలో జీవించాయి. అంటే.. డైనోసార్లను అంతం చేసిన భారీ ఆస్టరాయిడ్ ఢీకొన్న తర్వాత భూమి అప్పుడప్పుడే కోలుకుంటున్న యుగం. డైనోసార్ల వంటి భారీ సరీసృపాలు అంతరించిపోవడంతో ఆ స్థానంలో టైటానోబోవాలు సదరు చిత్తడి నేలల్లో రాజ్యమేలాయి. అప్పట్లో దక్షిణ అమెరికా దట్టమైన అరణ్యాలు కొత్త జాతుల చెట్లు, చేపలు, క్షీరదాలతో నిండి ఉండేవి. ఆహార గొలుసులో టైటానోబోవా టాప్‌లో ఉంటూ డైనోసార్ల అనంతర కాలంలో కీలక పాత్ర పోషించింది. ఇది భయానక సినిమాల్లో జీవిగా భావించినా.. శాస్త్రవేత్తలకు మాత్రం ఇది ఈ ధరిత్ర వాతావరణ చరిత్రను, మాస్ ఎక్స్‌టింక్షన్ తర్వాత జీవుల పుట్టుక గురించి తెలుసుకునేందుకు అద్భుత వనరు!