Snake Farming | పాము పేరు చెప్పగానే మనం గజగజ వణికిపోతాం.. కానీ చైనాకు చెందిన ఓ యువతి మాత్రం ఆ పాములనే తన ఆదాయ మార్గంగా మార్చుకుంది. తన తండ్రి బాటలోనే వెళ్లి.. దాదాపు 60 వేలకు పైగా విష సర్పాలను పెంచుతూ కోట్లు సంపాదిస్తోంది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్టు కథనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్వీ ప్రావిన్స్‌లోని గుయిలిన్ ప్రాంతానికి చెందిన చిన్ (31) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు పూర్తయ్యాక రెండు సంవత్సరాల పాటు సిటీలోనే ఉంది. కానీ ఆ తర్వాత తన స్వగ్రామానికి వెళ్లింది. అక్కడ తన తండ్రి చేస్తున్న పాముల పెంపక కేంద్రంలో చేరి తన ఫ్యామిలీ బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది.
ఈ బిజినెస్‌లో ఉన్న ప్రమాదాల గురించి తెలిసిన చిన్ తండ్రి ఆమెను ఇందులోకి రావడానికి ఒప్పుకోలేదు. కానీ ఒక్కడే పాముల బిజినెస్‌ను చూసుకోవడం సాధ్యం కాకపోవడంతో ఆమెను సహాయకురాలిగా పనిచేసేందుకు ఒప్పుకున్నాడు. కానీ కష్టపడి పనిచేసి, ఇప్పుడు మొత్తం బిజినెస్‌ను చూసుకునే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం చిన్ సొంతంగా సుమారు 60 వేల విషసర్పాలతో కూడిన ఫామ్‌ను నిర్వహిస్తుంది. వాటిలో అత్యంత ప్రమాదకరమైన ఫైవ్ స్టెప్ స్నేక్స్ 50 వేల వరకు ఉండటం గమనార్హం. మరో 10 వేల కోబ్రాలు ఉన్నాయి. వీటన్నింటినీ ప్రత్యేక శ్రద్ధతో పెంచాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫైవ్ స్టెప్ పాములకు ప్రత్యేకంగా ఆహారం సిద్ధం చేసి తినిపించాల్సి ఉంటుందని చిన్ తెలిపింది.
అయితే ఈ బిజినెస్ చాలా ప్రమాదకరమైనదే అయినప్పటికీ.. తనకు భయం పెద్దగా లేదని చిన్ తెలిపింది. చిన్నతనం నుంచి ఇదే వాతావరణంలో పెరగడం వల్ల ఈ బిజినెస్‌పై భయం పెద్దగా లేదని చెప్పింది. ఈ ఫామ్ ద్వారా సంప్రదాయ చైనా వైద్యంలో ఉపయోగించే అనేక ఉత్పత్తులను చిన్ సరఫరా చేస్తోంది. ఎండబెట్టిన పాము పిత్తాశయాలు, పాము నూనెను సాధారణంగా చైనా సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తుంటారు. అందుకే వాటిని చిన్ విక్రయిస్తుంది.
అలాగే పాము విషాన్ని కూడా అమ్ముతుంది. ఫైవ్ స్టెప్ పాముల నుంచి నెలకు రెండుసార్లు విషాన్ని సేకరిస్తారు. నాణ్యతను బట్టి ఒక్క గ్రాము విషయం ధర 40 నుంచి 200 యువాన్ల వరకు ఉంటుంది. పాము మాంసం ఒక్కటి 200 నుంచి 300 యువాన్ల వరకు ఉంటుంది. పెద్ద పాములు అయితే 1000 యువాన్ల వరకు ధర పలుకుతుంది. ఖర్చులు, ఉద్యోగుల జీతాలు తీసేస్తే ఈ ఫ్యామిలీ బిజినెస్ ద్వారా ఏడాదికి 10 లక్షల యువాన్లకు పైగా సంపాదిస్తున్నానని చిన్ వెల్లడించింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1.35 కోట్లు అన్నమాట.
కేవలం పాముల ఫామ్ నిర్వహించడమే కాకుండా.. పాముల పెంపకంపై సోషల్‌మీడియాలోనూ చిన్ అవగాహన కల్పిస్తోంది. “ది గర్ల్ హూ కలెక్ట్స్ స్నేక్ వెనం” పేరుతో సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తోంది. ప్రస్తుతం చిన్‌కు 22 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అందులో పాముల పెంపకం, పాము కాటుకు సంబంధించిన అనుభవాలను కూడా పంచుకుంటోంది. ఫైవ్ స్టెప్ పాము కాటు చాలా తీవ్ర నొప్పిని కలిగిస్తుందని ఆమె తెలిపింది. ఒక్కసారి ఆ నొప్పిని అనుభవిస్తే జీవితాంతం గుర్తుండిపోతుందని పేర్కొంది. చేతిపై కాటేసినా నొప్పి మొత్తం శరీరానికి వ్యాపిస్తుందని.. ఆ నొప్పిని భరించడం కంటే కాటేసిన చేతిని నరికేసుకోవడం బెటర్ అని అనిపిస్తుందని వివరించింది. ప్రస్తుతం చిన్ చేస్తున్న ఫ్యామిలీ బిజినెస్ సోషల్‌మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది. ప్రమాదకరమైన పనిని ధైర్యంగా చేస్తున్నందుకు ఆమెను పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
