When Will Gold Prices Drop ? | బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి?
ప్రపంచ అనిశ్చితి, యుద్ధాల కారణంగా బంగారం ధరలు జెట్ స్పీడ్‌తో పెరుగుతున్నాయి. డాలర్ బలపడి, వడ్డీ రేట్లు పెరిగితేనే ధరలు తగ్గే అవకాశం ఉంది.

బంగారం ధరలు జెట్ స్పీడ్ స్పీడ్ తో పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదికి గోల్డ్ ధరలు కనీసం 40 నుంచి 50 శాతం పెరిగాయి. ఐదేళ్ల కాలంలోనే 10 గ్రాముల ధర రూ. 1 లక్ష రూపాయాలు దాటింది. ప్రపంచంలోని పలు దేశాల్లో నెలకొన్న ఆర్ధిక పరిస్థితులు , పలు దేశాల మధ్య యుద్ధం, అనిశ్చిత పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. అయితే అసలు బంగారం ధరలు తగ్గుతాయా? అసలు ధరలు తగ్గే పరిస్థితి ఉందా? ఎప్పటివరకు ధరలు తగ్గుతాయి? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. బంగారం ధరలు తగ్గడానికి ఏ కారణాలు దోహదం చేస్తాయో చూద్దాం..
భారీగా పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అక్టోబర్ 21 నాటికి బంగారం ధరలు రూ. 1,32,770కు చేరాయి. 1999లో 10 గ్రాముల బంగారం ధర రూ. 2వేలుగా ఉంది. కానీ, 2020 నాటికి బంగారం అది రూ. 50 వేలకు చేరింది. 2018లో రూ. 31,39,108 గా ఉన్న10 గ్రాముల బంగారం ధర 2024 నాటికి రూ. 78,245కు చేరింది. 2025 జనవరి నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 2025 ఏప్రిల్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02, 170కి చేరింది. ఏప్రిల్ నుంచి ధరల పెరగడమే కానీ, తగ్గడం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.1,17, 550కి ధరలు చేరాయి. అక్టోబర్ లో రూ.1,20వేల నుంచి రూ. 1,32 వేలకు చేరాయి. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. 1999 నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు మాత్రమే బంగారం ధరలు తగ్గాయి. 2013లో 4.50 శాతం, 2014లో 7.9 శాతం, 2015లో 6.65 శాతం,. 2021లో 4.21 శాతం బంగారం ధరలు తగ్గాయి. ధరలు పెరిగినంత స్థాయిలో తగ్గలేదనేది వాస్తవం.
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో గందరగోళ పరిస్థితులున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్రపంచ దేశాల్లోని స్టాక్ మార్కెట్లపై పడుతున్నాయి. దీంతో సురక్షితమైన పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ , హమాస్ మధ్య యుద్ధం, పలు దేశాలపై ట్రంప్ టారిఫ్ పెంపు వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. డీ డాలర్ వంటి అంశాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. విదేశీ మారక నిల్వల్లో ఎక్కువగా డాలర్లకు చాలా దేశాలు ప్రాధాన్యత ఇస్తాయి. అయితే ట్రంప్ విధానాల నేపథ్యంలో పలు దేశాలు ఈ విషయమై పునరాలోచన చేస్తున్నాయి. ఈ పరిణామం కూడ బంగారం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. అంతేకాదు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు అంటే మన దేశంలోని ఆర్బీఐ లాంటి బ్యాంకులు కూడా బంగారం కొనుగోలు కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ప్రపంచంలో పలు దేశాల్లో ప్రజలుర 2 నుంచి 3 శాతం బంగారం రూపంలో దాచుకుంటారు. ఇండియాలో మాత్రం ఇది 16 శాతం వరకు ఉంది. డాలర్ బలహీనపడినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. డాలర్ బలపడినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి.
బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి?
ఈ ఏడాది డాలర్ ఇండెక్స్ 9 శాతానికి పైగా పడిపోయింది. ఈ ఏడాది మే చివరి నుంచి 100 మార్క్ కంటే తక్కువగా ఉంది. ఇది బంగారం ధరల పెరుగుదలకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డాలర్ 100 మార్క్ కంటే ఎక్కువగా స్థిరంగా ఉంటే బంగారం ధరలు పడిపోయే అవకాశం ఉంది. అమెరికాలో ఫెడ్ విధానంలో మార్పులు అంటే వడ్డీరేట్లలో మార్పులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తోందనే ప్రచారం కూడా ఉంది. ఇది కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతోంది. దీని ప్రభావం కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధ వాతావరణం కొంత చల్లబడింది. ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచంలోని పలు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించగలిగితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. మరో వైపు చైనాపై ట్రంప్ మరోసారి సుంకాలు పెంచుతామని ప్రకటించారు. మరోవైపు ఇండియాపై కూడా ట్యాక్స్ పెంచుతామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామాలన్నీ కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.