పాముల రారాజు…కింగ్ కోబ్రా విశ్వరూపం

కింగ్ కోబ్రా విశ్వరూపం వైరల్‌గా మారింది. 12 అడుగులకు పైగా పొడవైన గిరినాగు వీడియో వైరల్ కాగా, ఏపీలో ప్రపంచంలోనే తొలి కింగ్ కోబ్రా అభయారణ్యానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

ప్రకృతిలో పాముల జాతులలో బలమైన సర్ప జాతులు ఎన్ని ఉన్నా..వాటన్నింటికి రారాజుగా కింగ్ కోబ్రానే భావిస్తుంటారు. తాజాగా ఓ భారీ కింగ్ కోబ్రా వీడియో చూస్తే నిజంగా పాములకు బాస్ కింగ్ కోబ్రానే అనిపించడం ఖాయం. భారతీయ స్నేక్ క్యాచర్ మున్నా ఒక అటవీ గడ్డి ప్రాంతంలో 12 అడుగుల కంటే పొడవైన అతి పెద్ద కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. దాని పొడవును అంచనా వేసేందుకు కోబ్రా కదలికలను జాగ్రత్తగా నియంత్రిస్తూ పైకి ఎత్తి ప్రదర్శిస్తున్న వీడియోను అతను షేర్ చేశారు. భారతదేశంలో నాగులను పూజించే నాగపంచమి పండుగ రోజు సోమవారం సందర్భంగా ఈ వీడియోను ఫైనల్ బాస్ క్యాప్షన్ తో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది.

నిజంగానే కింగ్ కోబ్రా ఫైనల్ బాస్‌

అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా(గిరి నాగులు, రాచనాగులు)లు సహజంగా మనుషుల ఆవాసాలకు దూరంగా ఉంటాయి. పర్యావరణ సమతుల్యత కాపాడటంలో కీలకంగా వ్యవహరించే కింగ్ కోబ్రాలు పలు సర్పజాతులను ఆహారంగా తింటూ మనుగడ సాగిస్తుంటాయి. వాటిపై దాడికి ప్రయత్నిస్తేగాని అవి మనుషులపై దాడి చేయవు. ఒక్కసారి అది కాటువేసిందా ఇక అంతే సంగతులు అన్నట్లుగా ఉంటుంది మనుషుల పరిస్థితి. అంతరించిపోతున్న పాముజాతులలో ఇప్పుడు కింగ్ కోబ్రా కూడా చేరిపోయింది.

బుస కొడుతూ…పడగ విప్పే గిరినాగు

కింగ్ కోబ్రా(గిరినాగు)ను శాస్త్రీయంగా దీనిని ఓఫియోఫాగస్ అని పిలుస్తారు. నలుపు, తెలుపు చారలు…14నుంచి 20 అడుగుల పొడవు…పెద్దగా బుస కొడుతూ సంచరిస్తున్న గిరినాగులు కనిపిస్తే చాలు మనుషులు గజ్జున వణుకుతుంటారు. 20 అడుగుల పొడవు, 10కిలోల బరువు ఉన్న గిరినాగు పడగను నాలుగు అడుగుల ఎత్తులో విప్పుతుంది. పడగవిప్పి బుసకొడుతున్న గిరినాగును చూస్తే చాలు పై ప్రాణాలు పైనే పోతాయి.అత్యంత విషపూరితమైన ఈ గిరినాగు కాటువేస్తే చాలు అంతే సంగతులు. 15 నుంచి 20 ఏళ్ల పాటు జీవించే గిరినాగును కింగ్ కోబ్రా, రాచనాగు అని కూడా పిలుస్తుంటారు. కింగ్ కోబ్రా కాటు వేస్తే 10 నిమిషాల్లోనే ప్రాణాలు పోయే ప్రమాదముందని అటవీశాఖ వన్యప్రాణి నిపుణుడు ఎ. శంకరన్ వెల్లడించారు. సాధారణంగా మనిషి కనిపిస్తే చాలు గిరినాగులు భయపడి పారిపోతుంటాయి.

జీవ వైవిద్య పరిరక్షణలో లో కీలకం..

మనుషుల ప్రాణాలు తీస్తున్న నాగుపాములు, కట్లపాములు, పొడ పాములు వంటి విషపూరిత పాములను తింటూ జీవవైవిధ్యాన్ని కాపాడటమేకాకుండా మనుషులకు మేలు చేస్తున్న గిరినాగులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని మూర్తి చెప్పారు. మనుషులను ఎక్కువగా కాటేస్తుంటాయి. కానీ ఈ పాములను తినే గిరినాగు మనుషులకు మేలు చేస్తుంటాయని వన్యప్రాణి నిపుణులు,ఈస్ట్రన్ ఘాట్ వైల్డ్ లైఫ్ సోసైటీ మూర్తి కంఠిమహంతి చెప్పారు.

నాగు..గిరి నాగులలో ఏది ప్రమాదకరమో..?

నాగు పాము ఎక్కువగా జనావాసాల్లో , పంట పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.గిరి నాగు అడవుల్లో ఉంటుంది. నాగు పాము బంగారు వర్ణంలో ఉంటే, గిరి నాగు మాత్రం నలుపు రంగులో ఉంటుంది. ఇక నాగు పామును ఇండియన్ కోబ్రా, గిరి నాగును కింగ్ కోబ్రా అంటారు. ఈ రెండు పాముజాతులు కూడా ఎలపిడే అనే కుటుంబానికి చెందినే. గిరి నాగు ఎక్కువగా అడవుల్లో దక్షిణ, తూర్పు ఆసియా అడవులలో ఎక్కువగా కనిపిస్తుంది. నాగు పాము మాత్రం ఎక్కువగా ఇండియాలోనే కనిపిస్తుంది. అన్ని పాముల్లో కెళ్లా గిరి నాగు చాలా పొడవు, బరువుతో ఉంటుంది.

ఈ రెండింటిలో ఎక్కువగా నాగు పాము మాత్రమే చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. నాగు పాము కంటే గిరినాగు విషమే తక్కువ విషపూరితమైనది. నాగు పాము విషం ఎల్ డీ 50 విలువ 0.56 మిల్లీ గ్రాములు. ఈ పాము ఒక్క కాటుతో 10 మందిని చంపుతుంది. ఇక కింగ్ కోబ్రా అన్ని పాముల కంటే చాలా పొడవైనది. కానీ దీని విషం నాగుపాము విషంతో పోల్చితే తక్కువ విషపూరితంగా ఉంటుంది. ఎల్ డీ 50 విలువ 1.28 మిల్లీ గ్రాముల విషాన్ని కలిగి ఉంటుందని నిపుణుల కథనం. ఇతర విషపూరిత పాములతో పోలిస్తే దీని విషం గాఢత తక్కువగా ఉన్నప్పటికీ, అది విడుదల చేసే పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల ఇది చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. ఒకే కాటుతో ఈ పాము 500 మిల్లీగ్రాముల వరకు విషాన్ని విడుదల చేయగలదు. ఈ విషం 20 మంది మనుషులను లేదా ఒక పెద్ద ఏనుగును కూడా కొన్ని గంటల్లో చంపడానికి సరిపోతుందట.

గుడ్లు పెట్టడంతో గిరినాగుదే పైచేయి..

సంతానం విషయంలో కూడా నాగు పాము కంటే గిరి నాగు మాత్రమే ఎక్కువగా గుడ్లు పెడుతుంది. అంతే కాకుండా వాటిని కాపాడటం, తన పిల్లలను రక్షించుకోవడంలో కూడా గిరినాగు చాలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందంట. ఇది ఎక్కువగా ఆకులతో గూడు కడుతుంది. అంతే కాకుండా గిరి నాగు దాదాపు 20 నుంచి 40పైన గుడ్లు పెడుతుంది. గుడ్లను పొదుగుతూ నెల రోజులకు పైగా ఆహారం లేకుండా ఉంటోంది.21వరోజున గిరినాగు పిల్లలు బయటకు వచ్చాక తల్లి నాగు వెళ్లిపోతుంది.గిరినాగులు వేసవికాలంలో జతకట్టి జూన్ చివరి వారంలో గుడ్లు పెడుతుంటాయి. ఇక నాగు పాము 10 నుంచి 30 గుడ్లు పెడుతుంది. ఇది ఎక్కువ పుట్టల్లో , ఎర్రటి హోల్స్‌ల్లో గుడ్లు పెట్టి వాటిని రెండు నెలలు మాత్రమే కాపాడుతుంది.

ప్రపంచంలోనే తొలి కింగ్ కోబ్రా అభయారణ్యం ఏపీలో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈస్ట్రన్ ఘాట్ ప్రాంతాలు. పాపికొండల అభయారణ్యం గిరినాగులకు అడ్డాగా మారాయి.తమిళనాడు,కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాల్లో, తెలంగాణలోని కొత్తగూడెం అడవుల్లో గిరినాగులు సంచరిస్తుంటాయి. పాపికొండల్లోని జలతారు వాగు ప్రాంతంలో వీటి సంచారం ఎక్కువగా ఉంది. మార్చి నుంచి జులై నెలాఖరు వరకు అడవుల్లో జలవనరులు ఎండిపోయినపుడు గిరి నాగులు నీరు ఉన్న ప్రాంతాలను వెతుక్కుంటూ బయటకు వస్తుంటాయి. వాగులు, వంకలు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో గిరినాగులు ఎక్కువగా ఉంటాయి. తూర్పు కనుమలు, సరిహద్దు గ్రామాల్లో గిరినాగులు కనిపించడానికి కారణం ఇక్కడున్న పచ్చదనం, చల్లగా ఉండే భూములే కారణమని నిపుణులు చెబుతుంటారు.

ప్రపంచంలో అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైన గిరినాగు పాము జాతి సంరక్షణకు ఏపీ ప్రభుత్వం అభయారణ్యం ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమలలో 2,400 హెక్టార్ల విస్తీర్ణంలో కింగ్ కోబ్రా అభయారణ్యం ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కింగ్ కోబ్రా అభయారణ్యం కాబోతుంది. శంకరం రిజర్వ్ ల్యాండ్ (కాశిపురం బీట్, జీనబాదు రేంజ్, పాడేరు డివిజన్) లలో ఈ అభయారణ్యాన్ని ప్రతిపాదించారు. ఇప్పటికే ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోనిఅటవీ శాఖ (విశాఖపట్నం సర్కిల్), తూర్పు కనుమల వన్యప్రాణుల సంఘం (ఈజీడబ్ల్యుఎస్),స్థానిక గిరిజన సంఘాల సహకారంతో పాడేరు అటవీ విభాగంలో కింగ్ కోబ్రా గూడు కట్టే ఆవాసాల పరిరక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తుంటం విశేషం.

Latest News