- రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే ‘ ప్లీనరీ’ పరిమితం
- జగిత్యాల సభ కారణంగా మరో సభకు చాన్స్ లేదు
- 27న తెలంగాణ భవన్‌లో రాష్ట్రస్థాయి సమావేశం
- ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండావిష్కరణ
- రాష్ట్ర స్థాయి సమావేశంలో నిర్మాణంపై చర్చిస్తారా?
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి ఎండ దెబ్బ తగిలింది. ఈ కారణంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న ప్లీనరి పేరుతో బహిరంగ సభ లేదా భారీ సమావేశాన్ని నిర్వహించే స్థానంలో రాష్ట్ర కార్యవర్గానికే పరిమితమవుతోంది. ఈ నెల 20న తాటిపర్తి జీవన్ రెడ్డి చేరిక పేరుతో జగిత్యాలలో భారీ సభ జరిపిన నేపథ్యంలో 27న నిర్వహించాల్సిన ప్లీనరీని పరిమిత సంఖ్యలో అంటే రాష్ట్ర కార్యవర్గం సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది కూడా అనుమానంగా ఉందంటున్నారు. అయితే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నందున కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు.
తాజాగా ఎండ తీవ్రత పెరిగిన కారణంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆదివారం ప్రకటించారు. జీవన్ రెడ్డి చేరిక సందర్భాన్ని రాజకీయ పురోగమనానికి ఉపయోగించుకునే ఎత్తుగడతో జగిత్యాల కేంద్రంగా భారీ సభ నిర్వహించారు. ఆ సమయంలోనే 27న మరో భారీ సభ, సమావేశం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. అదే నిజమైంది. పార్టీ ఆవిర్భవించి 25 యేళ్ళు పూర్తయిన నేపథ్యంలో గత ఏడాది సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా ఎలకతుర్తి వేదికగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా జనాన్ని సమీకరించి పెద్ద సభను నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవాన్నే తెలంగాణకు పరిమితం చేయగా మే 6వ తేదీన వరంగల్లో రైతాంగ సమస్యలపై భారీ సభ నిర్వహిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ భారీ సభ నిర్వహించి రైతు డిక్లరేషన్ ప్రకటించిన స్థలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభ నిర్వహిస్తారంటూ ప్రచారం సాగుతోంది. అయితే.. ఆవిర్భావ సభ నిర్వహించేందుకే వెనుకంజ వేసిన పార్టీ నాయకత్వం వరంగల్‌లో సభ జరుపుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీ నిర్మాణంపై అధిష్ఠానం నిర్లక్ష్యం
బీఆర్ఎస్ లో కింది స్థాయి నిర్మాణాన్ని అధినాయకత్వం మొదటి నుంచీ పెద్దగా పట్టించుకోలేదు. దశాబ్దాలుగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాయకులు, కేడర్ ఎంతో మంది ఉన్నప్పటికీ వారికి పార్టీ పదవులు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాతనైనా దీనిపై కేంద్రీకరిస్తారని భావించినా.. మూడేళ్లుగా అది కూడా అతీగతీ లేదు. ఈసారి ప్లీనరీని రంగారెడ్డి జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తారనే ప్రచారం కూడా సాగింది. దీనికి భిన్నంగా ఈసారి పరిమిత స్థాయిలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలోనైనా పార్టీ సభ్యత్వం, నిర్మాణం, నూతన కమిటీల ఏర్పాటుపై చర్చిస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి పార్టీని నిర్మాణాత్మకంగా పటిష్టం చేస్తామంటూ అన్ని రకాల కమిటీలను నియమిస్తామంటూ ఇటీవల ప్రకటించారు. కానీ, రెండు అంశాలను పార్టీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. తాజాగా కేసీఆర్ కుమార్తె కవిత కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. బీఆరెస్‌ను ప్రత్యేకంగా కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. ఈ సమయంలో కమిటీలను ఏర్పాటు చేసి, పార్టీని పటిష్ఠంగా మార్చుకోవడం ఒక మార్గం. కమిటీలు ఏర్పాటు చేస్తే మార్చుకుంటారా? కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత అవి కవిత పక్షం వహిస్తాయని అనుమానించి మళ్లీ వాయిదా మంత్రం జపిస్తారా? అనేది వేచి చూడాల్సింది.
గ్రామ గ్రామాన జెండా ఎగురవేయాలి: కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 27న సోమవారం ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ శ్రేణులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు (ఏప్రిల్ 27న) తెలంగాణ భవన్‌లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. ఇటీవల జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో, ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని, ఆహ్వానం ఉన్న వారు మాత్రమే హాజరుకావాలని, మిగిలిన నాయకులు, కార్యకర్తలు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ కోరారు.
