ADULTERATED TODDY | తాటిచెట్లే లేవు.. కానీ.. ఫుల్లుగా కల్లు!.. హైదరాబాద్‌లో కల్లు దుకాణాల మూత?

హైదరాబాద్ పరిధిలో కల్తీ కల్లు తాగి 10 మంది మరణించిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కల్లు దుకాణాలు మూసివేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక్కడ 454 కల్లు దుకాణాలున్నాయి. కో ఆపరేటివ్ సొసైటీల పరిధిలో 53 దుకాణాలున్నాయి. సికింద్రాబాద్ పరిధిలో 31 సంఘాలుంటే 52 దుకాణాలు, రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి పరిధిలో 77 సంఘాలుంటే 79 దుకాణాలున్నాయి.

ADULTERATED TODDY | తాటిచెట్లే లేవు.. కానీ.. ఫుల్లుగా కల్లు!.. హైదరాబాద్‌లో కల్లు దుకాణాల మూత?

ADULTERATED TODDY | హైదరాబాద్‌, జూలై 23 (విధాత): హైదరాబాద్ పరిధిలో తాటి, ఈత చెట్లు ఎక్కడున్నాయో ఎవరికీ కనిపించవు. కానీ.. కల్లు మాత్రం ఫుల్లుగా వస్తున్నది. రావడమే కాదు.. కొందరికి అది వ్యసనంగా మారిపోయి.. ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తున్నది. చుట్టుపక్కల జిల్లాల నుంచి తెస్తున్నారనుకున్నా.. అక్కడ కూడా చెప్పుకోతగిన స్థాయిలో చెట్లు లేవని గౌడ సంఘాల నాయకులు చెబుతున్నారు. అక్కడ దొరికే కల్లు.. స్థానిక వినియోగానికి కూడా సరిపోవడం లేదని అంటున్నారు. మరి డ్రమ్ముల కొద్దీ కల్లు ఎక్కడి నుంచి వస్తున్నది? అనే ప్రశ్న వేసుకుంటే.. కల్తీ కల్లే సరఫరా అవుతున్నదనే సమాధానం వస్తున్నది. ఆ కల్తీ కల్లుకు అలవాటుపడి.. ఇటీవల కూకట్‌పల్లిలో పది మంది బడుగు జీవులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆసుపత్రి పాలయ్యారు. కల్తీ కల్లు కారణంగానే ఈ మరణాలు చోటు చేసుకున్నాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

హైదరాబాద్ లో 148 కల్లు దుకాణాలు

హైదరాబాద్ నగరంలో మచ్చుకైనా ఒక్క తాటి చెట్టు లేదు. కానీ, ఏకంగా 148 కల్లు దుకాణాలున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1.89 లక్షల తాటి, ఈత చెట్లున్నాయని గీత కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు. ఇక్కడ 478 కల్లు డిపోలకు ఎక్సైజ్ శాఖాధికారులు అనుమతిచ్చారు. 2014 తర్వాత హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు ఓపెన్ అయ్యాయి. ఈ దుకాణాలకు హైదరాబాద్ సమీపంలోని జిల్లాల నుంచి కల్లు సరఫరా అవుతోందని చెబుతున్నా.. ఎక్కువ భాగం కృత్రిమంగా తయారు చేసిన కల్లే వస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ లో కల్లు దుకాణాలకు నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కల్లు సరఫరా అయ్యేది. రాను రాను గీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగించేవారు తగ్గిపోయారు. గీత కార్మికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. అప్పటిదాకా పొలం గట్ల మీద, మధ్యలో కనిపించిన తాటి, ఈత చెట్లు.. రియల్‌ ఎస్టేట్‌ కారణంగా చదునుగా మారిన నేలతో మాయమైపోయాయి. గతంలో ఒక గ్రామంలో గతంలో 100 కుటుంబాలు గీత వృత్తిపై ఆధారపడి బతికిన పరిస్థితి ఉంటే. ఇప్పుడు ఆ సంఖ్య 10 నుంచి 20కి పడిపోయిందని గీత కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. మారిన పరిస్థితులు, ఈ వృత్తిలోకి రావడానికి కొత్త తరం ఆసక్తి చూపకపోవడంతో పాటు సామాజిక, ఆర్ధిక అంశాలు కూడా కల్లు గీసే పరిస్థితి లేకపోవడానికి కారణంగా చూపుతున్నారు. గతంలో హైదరాబాద్‌కు సమీపంలోని సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ మండలాల నుంచి కల్లు సరఫరా అయ్యేది. ఒక్కో గ్రామం నుంచి రెండు నుంచి మూడు లారీల్లో పీపాల ద్వారా కల్లు సరఫరా చేసేవారు. ఒక్కో గీత కార్మికుడు సాధారణంగా 20 నుంచి 25 సీసాలు పట్టే కుండ కల్లును పంపేవారు. ఒక్క కుండకు అప్పట్లో రూ.10 నుంచి రూ. 15 రూపాయాలు చెల్లించేవారు. ఇలా కల్లు రావడం ఇప్పుడు చాలా తగ్గింది. అంటే కల్లు దుకాణాల్లోని కల్లు ఎక్కువగా కృత్రిమంగా తయారు చేసిందేనని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

దళారుల చేతిలో కల్లు కాంపౌండ్లు

హైదరాబాద్‌లోని కల్లు దుకాణాలు నిజమైన గీత కార్మికుల చేతుల్లో కాకుండా దళారుల చేతుల్లో ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగితాల్లో గీత కార్మికులు లేదా సొసైటీల పేరుతో ఉన్నా పెత్తనం మాత్రం దళారులదేనని అంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తాటి, ఈత చెట్లు లేకున్నా కల్లు విక్రయాలు జరుగుతుండటం గమనార్హం. కృత్రిమంగా తయారు చేసిన కల్లుకు అలవాటు పడిన జనం అదే కల్లు కోసం దుకాణాలకు వస్తుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేసిన ఐపీఎస్ అధికారి ఒకరు ఆర్టీఐ చట్టం కింద జిల్లాల్లో ఎన్ని ఈత, తాటి చెట్లున్నాయో సమాచారం కావాలని అప్లికేషన్ పెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన ట్రాన్స్ ఫర్ అయ్యారు.

తగ్గిపోతున్న తాటి, ఈత చెట్లు

రాష్ట్రంలో 77.78 లక్షల ఈత, తాటి చెట్లు ఉన్నాయని ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 15,36,361 తాటి, 4,08, 552 ఈత చెట్లున్నాయి. 13,13, 266 తాటి చెట్లతో ఉమ్మడి మెదక్ జిల్లా రెండో స్థానంలో ఉంది. నల్గొండలో అత్యధికంగా 7,33,253 ఈత, 2,49,680 తాటి చెట్లున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా 4,064 తాడి సహకార సంఘాలు (టీసీఎస్) ఉన్నాయి. వీటి పరిధిలో 4,697 కల్లు తయారీ కేంద్రాలున్నాయి. వీటిలో 1,95,391 మంది సభ్యులున్నారు. తాటి చెట్లు ఎక్కి కల్లుతీసి ఆ చెట్టుకిందనే విక్రయించుకోవడానికి ప్రభుత్వం ట్రీ ఫర్ ట్రేడ్ లైసెన్సులు ఇస్తుంది. ఈ లైసెన్సులు పొందినవాళ్లు రాష్ట్రంలో 29,272 మంది ఉన్నారు. ఈ లైసెన్సు పొందినవారు 3,541 దుకాణాలను నడుపుతున్నారు. ఆయా గ్రామాల్లో కల్లు గీయడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు లైసెన్స్ ఇస్తారు. చెట్టు ఎక్కి కల్లు గీయడాన్ని స్వయంగా పర్యవేక్షించిన తర్వాత ఎక్సైజ్ అధికారులు లైసెన్సులు జారీ చేస్తారు. అంతేకాదు చెట్లకు నెంబర్లు కూడా కేటాయించేవారు. ప్రతి ఏటా దసరా సమయంలో ఆయా గ్రామాల్లో చెట్ల కేటాయింపు ఉంటుంది. గ్రామంలో ఉన్న మొత్తం చెట్లు.. ఆ గ్రామంలో ఉన్న గీత కార్మికుల ఆధారంగా చెట్లను పంచుతారు. అయితే గతంలో మాదిరిగా గ్రామాల్లో చెట్లు లేవు. గీత కార్మికులు కూడా లేవు. ఈ వృత్తిని చేసేందుకు ముందుకు వచ్చే వారు కూడా తక్కువగా ఉన్నారు. 2023-24 గీత కార్మికులకు 53 లక్షల తాటి, ఈత చెట్లున్నాయి. 2024-25 50 లక్షలకు పడిపోయింది. చెట్టును బట్టి, గీత కార్మికుడు చెట్టును గీసే పద్దతి ఆధారంగా కల్లు ఉత్పత్తి అవుతోంది.

హైదరాబాద్ లో కల్లు దుకాణాలు ఎందుకు మూతపడ్డాయి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ లో కల్లు దుకాణాలు ఉండేవి. 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు దుకాణాలను మూసివేసింది. ఎక్సైజ్ శాఖ 2004 పాలసీ ప్రకారం 50 కి.మీ పరిధిలో తాటి, ఈత చెట్లు ఉన్న ప్రాంతంలో 50 కి.మీ మేరకు కల్లు దుకాణాలకు అనుమతివ్వాలని నిర్ణయించారు. హైదరాబాద్ చుట్టుపక్కల తాటి, ఈత చెట్లు లేకపోవడంతో కల్లు దుకాణాలను మూసివేశారు. దీనిపై హైదరాబాద్ లో కల్లు విక్రయించేవారంతా హైకోర్టులో పిటిషన్ (18181/2004) దాఖలు చేశారు. క్లోరల్ హైడ్రేట్, డైజోఫాం వంటి రసాయనాలు కలిపి కల్తీ కల్లు తయారు చేస్తున్నారని.. దీని వల్ల ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలుగుతోందని అప్పట్లో ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించింది. 2002 నుంచి 2004 వరకు 98 మంది చనిపోయారని కూడా న్యాయస్థానానికి తెలిపింది. ఈ కారణంగానే హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను మూసివేశామని ప్రభుత్వం వివరించింది. హైకోర్టు ప్రభుత్వ వాదనను సమర్ధించింది. దీంతో 2004 నుంచి 2014 వరకు హైదరాబాద్ లో కల్లు దుకాణాలు మూతపడ్డాయి.

తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరుచుకున్న కల్లు దుకాణాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తెరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 24 జారీ చేసింది. దీనిపై కొందరు ఎక్సైజ్ శాఖను ఆర్టీఐ చట్టం ద్వారా వివరాలు అడిగారు. కల్లు దుకాణాలు తెరవాలనేది ప్రభుత్వ నిర్ణయమని.. తమ ప్రమేయం లేదని ఎక్సైజ్ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కల్తీ కల్లును ఆపాలని హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో (7/2024)పిల్ వేసింది. దీనిపై ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖకు హైకోర్టు నోటీసులు పంపింది.

కల్లు దుకాణాలు మూసేస్తారా?

హైదరాబాద్ పరిధిలో కల్తీ కల్లు తాగి 10 మంది మరణించిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కల్లు దుకాణాలు మూసివేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక్కడ 454 కల్లు దుకాణాలున్నాయి. కో ఆపరేటివ్ సొసైటీల పరిధిలో 53 దుకాణాలున్నాయి. సికింద్రాబాద్ పరిధిలో 31 సంఘాలుంటే 52 దుకాణాలు, రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి పరిధిలో 77 సంఘాలుంటే 79 దుకాణాలున్నాయి. సరూర్ నగర్ పరిధిలో 158 సంఘాలుంటే 158 దుకాణాలు, శంషాబాద్ పరిధిలో 60 సంఘాల కింద 62 దుకాణాలున్నాయి. 390 సంఘాల పరిధిలో 453 దుకాణాల్లో కల్లు విక్రయాలు సాగుతున్నాయి. హైదరాబాద్ 6, సికింద్రాబాద్ 6, రంగారెడ్డి 21 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 33 దుకాణాలు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోందనే ప్రచారం సాగుతోంది.