Telangana Jagruti political classes | కల్వకుంట్ల గురుకులం! ఇక్కడ అన్నీ నేర్పించబడును!

♦ వై.వి.ఎన్.రెడ్డి
Telangana Jagruti political classes | తెలంగాణ గడ్డ ఆది నుంచి విప్లవాలకు, పోరాటాలకు పురిటిగడ్డ. చైతన్యానికి ప్రతిక. ప్రశ్నించే వేదికగా ప్రసిద్ధి. ఎందరో వైతాళికులకు, మహానీయులైన కవులు, కళాకారులకు, రచయితలకు, నాయకులకు నెలవు. నిజాం నిరంకుశ పాలన విముక్తి లక్ష్యంగా తెలంగాణ సాగించిన సాయుధ పోరాటం విశ్వవిఖ్యాతం. ఆత్మగౌరవ పోరాటాలతో, బలిదానాలతో స్వరాష్ట్రం సాధించిన తెలంగాణ సమాజం ధీరత్వం అందరికీ విదితమే. అయితే ఆకస్మాత్తుగా తెలంగాణ సమాజంలో ప్రశ్నించే గళాలు కనుమరుగైపోయినాయా? ఇప్పుడెందుకు ఈ ప్రశ్న? నీళ్లు.. నిధులు.. ఉద్యోగాలన్న తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ అంశాలపైనే కాదు.. పరిపాలనలోనూ దేశానికి తమ పాలనే మోడల్ అని చెప్పుకునే కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబం.. తాజాగా తెలంగాణ యువతకు ప్రశ్నించడం నేర్పేందుకు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తామంటుంది. చైతన్యవంతమైన తెలంగాణ సమాజం పదేళ్ల కల్వకుంట్ల ఏలుబడిలో చైతన్యరహితమైందనుకున్నారో ఏమోగానీ.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ యువతకు ప్రశ్నించడంపై, రాజకీయాలపై శిక్షణ (Telangana Jagruti political classes) ఇస్తామని కల్వకుంట్ల కవిత చెబుతుండటం ఆసక్తి రేపుతున్నది. అంతకు మించి.. అసలు తెలంగాణ యువత (సమాజం) ప్రశ్నించే సోయి ఎప్పుడు మరిచిపోయిందన్నది ప్రశ్నగా ఎదురవుతున్నది.
వారి కంటే ముందు రాజకీయం, ప్రశ్నించడం లేవా!
సొంత పార్టీలో.. కుటుంబంలో తనను అణిచివేస్తున్నారని, పార్టీ అధినేత, తన తండ్రి చుట్టూ దెయ్యాలున్నాయని ఇటీవల పూనకాలు పట్టిన కవిత ఎపిసోడ్ కొన్ని రోజులు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. తండ్రి కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ, అన్న కేటీఆర్‌పై విమర్శలు ఎక్కుపెడుతూ సంధించిన లేఖాస్త్రం, సాగించిన విమర్శల పర్వంతో కవిత ‘తిరుగుబాటు శక్తి’ అని అంతా అనుకున్నారు. అంతలోనే కేసీఆర్, హరీశ్ రావులకు కాళేశ్వరం నోటీసులు.. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ విచారణ పర్వానికి వచ్చేసరికి కవిత ‘ప్రశ్నించే స్వరం’ సన్నాయి నొక్కులు మొదలెట్టింది. రాజకీయ ప్రత్యర్థులు తమ కుటుంబం మీదకు వస్తే ఐక్యంగా పోరాడుతామంటూ మళ్లీ కుటుంబ రాగమే వినిపించారు. తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ అనుబంధమేనంటూ పాతపాటే పాడారు. ఇలా ద్వంద్వ విధానాలు.. నాలుక మడత రాజకీయాలు సాగించిన కవిత.. తెలంగాణ యువతకు ఏ రాజకీయాలను? ఎలాంటి ప్రశ్నించే విధానాలను నేర్పుతారని రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న క్రమంలో నేను.. నా ముసలామె తప్ప తనకెవరూ లేరంటూ ఉద్యమసారథిగా ఉన్న కేసీఆర్ చెప్పేవారు. ఆ మాటలకు భిన్నంగా అమెరికా నుంచి ఆకస్మాత్తుగా ఉద్యమంలో జొరబడి.. బతుకమ్మ మాటున ఉద్యమకాలంలోనూ, ప్రభుత్వ హయాంలోనూ కవిత పోషించిన రాజకీయ పాత్ర తెలంగాణ సమాజానికి విదితమే. తనకంటే ముందు తెలంగాణ సమాజానికి బతుకమ్మ ఆట పాట తెలియదన్నంతగా ఆమె బతుకమ్మను హైజాక్ చేసేశారు. కొడుకు కేటీఆర్ సైతం ఉద్యమంలోకి దిగుమతి అయ్యారు. అప్పటిదాకా ఉద్యమంలో నంబర్ టూ స్థానంలో ఉన్న హరీశ్‌రావును పక్కకు నెట్టేసి.. ప్రభుత్వంలోనూ కీలకంగా ఎదిగారు. ఈ తరహా హైజాక్ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలపై కవిత శిక్షణ ఇస్తారా? అన్న సెటైర్లు పేలుతున్నాయి.
అధికారంలో మౌనరాగం.. ప్రతిపక్షంలో తిరుగుబాటు స్వరం
పదేళ్లుగా ఆమె పార్టీ.. కుటుంబమే తెలంగాణను ఏలింది. తొలి ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. ఎస్సీ, బీసీ, ఎస్టీలకు అధికారంలో, పార్టీలో సామాజిక న్యాయం దక్కలేదని పలువురు గుర్తు చేస్తున్నారు. ప్రగతి భవన్ గడీ పాలనను, కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ అనేక పోరాటాలు తెలంగాణ సమాజం చేసింది. వాటిని ఎక్కడికక్కడ అణిచివేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎందుకు జరిగింది? అని కవిత ప్రశ్నించడం నేర్పుతారా? ఆ సమ్మెను ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా అణచివేసిందో నేర్పిస్తారా? మున్సిపల్ కార్మికుల సమ్మె విషయంలో అనుసరించిన దమననీతిని వివరిస్తారా?ఆఖరుకు స్వరాష్ట్ర ఉద్యమానికి వేదికైన ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ను సైతం ఎత్తివేసింది. గ్రూప్ పరీక్షలలో అక్రమాలపై.. ప్రశ్న ప్రత్రాల లికేజీలకు వ్యతిరేకంగా, బదిలీల కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు.. న్యాయమైన పరిహార పునరావాసాల కోసం భూ నిర్వాసితులు చేసిన పోరాటాలన్నీ తెలంగాణ సమాజానికి సహజంగానే ఉన్న ప్రశ్నించే చైతన్యానికి ప్రతీకలుగా నిలిచాయని ప్రజాసంఘాలు గుర్తు చేస్తున్నాయి.
నాడు నిర్లక్ష్యం. నేడు పరిరక్షణ ఉద్యమాలు
యువ కవులు, రచయితలతో ఒక సమ్మేళనం ఏర్పాటు చేసిన కవిత.. తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య రంగాలను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. వాటి పరిరక్షణకు జాగృతి కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడే నిర్లక్ష్యానికి గురయ్యాయా? పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైనప్పుడు వారి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? కనీసం సినీ, సాహితీ రంగ ప్రముఖులను సత్కరించే అవార్డులు ఎందుకివ్వలేదన్న విషయాన్ని కవిత యాదికి తెచ్చుకోవాలని పలువురు ప్రముఖ సాహితీవేత్తలు అంటున్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ఉపకోటా కోసం ఉద్యమిస్తామంటున్న కవిత.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ మేరకు ఎందుకు డిమాండ్ చేయలేదు? అధికారం పోయాక గానీ బీసీ నినాదం ఎత్తుకోని కవిత.. తన తండ్రి అధికారంలో ఉన్న సమయంలో దీనిపై ఎందుకు ఒత్తిడి చేయలేదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టులపై ఆమె సానుభూతి కూడా పచ్చి అవకాశవాదమేనంటున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో మావోయిస్టుల అణిచివేత లేదు.. ఎన్‌కౌంటర్లు లేవు అన్నట్టు కవిత అమాయకంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు కెళ్లిన కవిత తెలంగాణ యువతకు నేర్పే రాజకీయ శిక్షణ ఏముంటుందంటూ కాంగ్రెస్ నేతలైతే బాహాటంగానే ఎద్దేవా చేస్తున్నారు.
రోల్ మోడల్.. డేంజర్ బెల్..!
బీఆర్ఎస్ పాలన దేశానికి రోల్ మోడల్! ఇది పదేపదే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత చెప్పే మాట. ‘అప్పులు అమాంతం పెరిగిపోయాయి. ధరణితో రైతుల భూములు దోపిడీకి గురయ్యాయి. దానిని అడ్డంపెట్టుకొని బీఆరెస్ ప్రజాప్రతినిధులు ఆస్తులు పెరిగాయి. కాళేశ్వరం కూలిపోయింది. ఫోన్‌లు ట్యాప్ చేశారు.. గొర్రెల పంపిణీలో అవినీతి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలలో అవినీతి సహా ఇప్పటికే అనేక అంశాలను కాగ్ సహా ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ విచారణ కమిటీలు ఎత్తి చూపాయి. ఇక కమిషన్లు కూడా అదే దిశగా అక్రమాల నిగ్గు తేల్చబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో వారి పాలన రోల్ మోడల్ అనడమేంటి? దానిపై తెలంగాణ యువత నేర్చుకోవాల్సిందేంటి? ప్రశ్నించాల్సింది ఎవరిని?’ అని ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకుడు అన్నారు.
మంచైతే కల్వకుంట్ల ఘనత.. చెడైతే ఇంజినీర్ల బాధ్యత
అధికారంలో ఉన్నప్పుడు సర్వం తానే అన్న అహంభావంతో వ్యవహరించి.. ప్రజా ఉద్యమాలను అణిచివేసిన కల్వకుంట్ల కుటుంబం ప్రతిపక్ష పాత్రలోకి పడిపోగానే ప్రజలు ప్రశ్నించాలి.. ఉద్యమించాలంటూ పల్లవి అందుకోవడం వారి రాజకీయ అవసరాలనే చాటుతుందంటున్నారు విశ్లేషకులు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు.. యూనివర్సిటీలు నిర్వీర్యమయ్యాయని, గురుకులాలు అద్దె భవనాలకే పరిమితమయ్యాయని, డబుల్ బెడ్ రూమ్‌లు కట్టక, కొత్త రేషన్ కార్డులు లేక పేదలు నానా అవస్థలు పడ్డారని అంటున్నారు. నిజానికి తెలంగాణ యువత ముందుగా ప్రశ్నించాల్సింది బీఆర్ఎస్ పదేళ్ల పాలన అంశాలనేనని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు.
గోప్యత వారికేనా?
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. చిట్టినాయుడు.. గజిని.. అపరిచితుడు వంటి పదాలు వాడుతుండటం తెలిసిందే. తనదాక వస్తేగాని తత్వం బోధపడదన్నట్లుగా ఇటీవల ఫార్ములా ఈ కారు రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేతల నుంచి తనపై విమర్శలు రాగానే కేటీఆర్ వల్లించిన నిబంధనలు ఆయన చెప్పే గజిని, అపరిచితుడి మాటలను తలపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఆయనకు లీగల్ నోటీసులు పంపిస్తానని కేటీఆర్ చిందులేశారు. మరి మూసీ ప్రక్షాళన పేరుతో ఢిల్లీకి వేల కోట్ల మూటలు రేవంత్ రెడ్డి పంపించాడని చేసిన ఆరోపణలను ఆధారాలు చూసుకునే చేస్తున్నారా? వాటికి నోటీసులివ్వాలంటే ఎన్ని బస్తాల కాగితాలు కావాలో ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ సెటైర్లు వేస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఇక ఫార్ములా కారు రేసులో తన ఫోన్లు, ల్యాప్ టాప్, ఐప్యాడ్ అప్పగించాలనే సరికి కేటీఆర్‌కు వ్యక్తిగత గోప్యతకు భంగం అనే అంశం గుర్తొచ్చిందని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే వ్యక్తిగత గోప్యత.. వారి పదేళ్ల పాలనలో యథేచ్ఛగా సాగిన ఫోన్ ట్యాపింగ్ బాధితులకు వర్తించదా? అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తుండటం కొసమెరుపు.