Kavitha Exit Speculation | బీఆర్ఎస్‌కు కవిత దూరమవుతారా?
గత పదేళ్లుగా బీఆరెస్‌లో తన వంతు ఆధిపత్యం చెలాయించిన కవితకు అదంతా గతమేనా? కవితను దూరం పెట్టేందుకు కేటీఆర్ పక్కా ప్లానింగ్‌తో పావులు కదుపుతున్నారా? పార్టీ ఆమెను పక్కన పెడుతున్నదా? అధినేత సైతం కుమారుడికే మొగ్గు చూపుతున్నారా? కవిత క్రమక్రమంగా బీఆరెస్‌కు దూరమవుతారా? జాగృతికి అనుబంధ సంఘాల ఏర్పాటులో మర్మమేంటి?

Kavitha Exit Speculation | విధాత ప్రత్యేక ప్రతినిధి: వడ్డించేవారు మనవాళ్ళయితే చాలు… ఏ బంతిలో కూర్చున్నా చెల్లుతదనే సామెత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవితకు నూటికి నూరుపాళ్ళు వర్తించిన అంశానికి బీఆర్ఎస్‌లో కాలం చెల్లిందా? ఇంతకాలం సాఫీగా సాగిపోయిన కవిత పటాటోపానికి అన్న కేటీఆర్ రూపంలో అడ్డంకి ఎదురవుతున్నదా? అంటే అవుననే సమాధానాలే రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్నాయి. బీఆరెస్ ఆవిర్భవించి 25 వసంతాలు నిండిన సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్ గడ్డపై భారీ బహిరంగ సభను నిర్వహించారు. అందులో కేసీఆర్ చిత్రపటం, ఆయన రాజకీయ వారసుడిగా కేటీఆర్ ఫొటోను మాత్రమే పెట్టిన నేపథ్యంలో కవిత తన మనోగతాన్ని బహిరంగంగానే ప్రకటించారు. కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తేలేదంటూ పరోక్షంగా ప్రకటించి సంచలనానికి తెరతీశారు. అప్పటి నుంచి బీఆరెస్‌లో కవిత చుట్టూ అంతర్గత రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. కొన్ని విభేదాలు, బహిరంగంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఏమైనా కాల క్రమేణా కల్వకుంట్ల కవితకు, బీఆర్ఎస్‌కు మధ్య దూరం పెరుగుతున్నదనే అభిప్రాయానికి బలం చేకూరే పరిణామాలు గత మే నెల నుంచి వేగంగా సాగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి ఈ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగానే సాగింది. సాగుతూనే ఉన్నది కూడా. అయితే.. ఓ మీడియా ఇంటర్వ్యూలో కవిత ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. కవితను తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని హస్తం పార్టీ కూడా ప్రకటించింది. అదే సమయంలో ఇప్పటికిప్పుడు కారు దిగాల్సిన పరిస్థితి కూడా కవితకు లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ.. ఆమె ప్రాభవం పార్టీలో తగ్గిపోయినట్టు స్పష్టంగానే కనిపిస్తున్నదని అంటున్నారు.
బీఆర్ఎస్ లో కవిత గత వైభవమేనా?
తన తండ్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ @ బీఆరెస్‌లో లేటుగా వచ్చినా లేటెస్టుగా అన్నట్టు కవిత చేరిపోయారు. సాధారణంగా ఒక పార్టీ అంటే కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. కానీ, కవిత విషయంలో వడ్డించేది తన తండ్రి కావడంతో ఆమె ఏది చేసినా చెల్లిపోయిందని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తారు. ఎవరికీ లేని మినహాయింపులు ఆమెకు లభించాయి. ప్రతి పార్టీకి అనుబంధ సంఘాలు ఉంటాయి. బీఆరెస్‌కు కూడా విద్యార్ధి, యువజన, కార్మిక, రైతు తదితర అనేక అనుబంధ సంఘాలున్నాయి. కానీ, కవిత కలల కన్నబిడ్డగా పార్టీలో ఆమె రాకతో పాటే తెలంగాణ జాగృతిగా తెరపైకి వచ్చి కొనసాగుతోంది. జాగృతి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే తెలంగాణ సాంస్కృతిక పునర్జీవనం కోసం ఏర్పాటు చేశామని, బీఆరెస్ అనుబంధ సంఘమని వివరణ ఇస్తారు. గ్రామీణ తెలంగాణ సగటు మహిళకు సంబురంగా నిలిచిన బతుకమ్మ పండుగ అంతకు ముందు లేనట్లు.. కవితతోనే అది ప్రారంభమైనట్టు ప్రచారార్భాటం కల్పించారు. ఇక గతంలో ఎంపీగా కవితకు అవకాశం కల్పించారు. తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతే ఎమ్మెల్సీగా చట్టసభలకు పంపారు. ఎంపీ, ఎమ్మెల్సీ ఏదైనా నిన్నమొన్నటి పరిణామాల వరకు ఆమె ఎక్కడ పర్యటించినా బీఆర్ఎస్ పార్టీ జిల్లాల నాయకత్వమంతా పోటీలుపడి ఘన స్వాగతం పలికేవారు. అధికారంలో ఉన్నప్పుడైతే మంత్రులు కూడా ప్రొటోకాల్ విస్మరించి కవితకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ, ఇటీవల ఆకస్మికంగా పరిస్థితి మారింది. కొద్ది రోజులుగా కవిత ఏ జిల్లాలో పర్యటించినా బీఆరెస్ నాయకులు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధిష్ఠానం నుంచి అవసరమైన ఆదేశాలు రావడమే ఈ పరిణామానికి కారణమన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తున్నది. బీఆర్ఎస్‌లో కవిత వైభవం గతమనే వాదన వినిపిస్తున్నారు. కవితను కాదని అన్న కేటీఆర్ వైపే పార్టీ నేతలు మొగ్గు చూపుతున్నారా? అధినేత కేసీఆర్ సైతం బిడ్డ కంటే కుమారుని ప్రయోజనాలు కాపాడేందుకే సిద్ధమయ్యారా? అన్న చర్చలు జోరందుకున్నాయి.
కాల `క్రమేణా` కవిత దూరం
ఎమ్మెల్సీగా ఉంటూ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితురాలిగా జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత కవితకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి. లిక్కర్ స్కాంలో నిందితురాలిగా ఉండటంతో పార్టీకి చాలా నష్టం వాటిల్లిందనే అంతర్గత అంచనాతోనే కవితను ప్రధాన నాయకత్వం దూరం పెట్టిందని, అది భరించలేకే కవిత.. దేవుడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ బరస్ట్ అయ్యారని భావిస్తున్నారు. ఎల్కతుర్తిలో పార్టీ ఆవిర్భావ ఉత్సవాల తర్వాత ఆమె తండ్రికి రాసిన లేఖ లీక్ కావడం, ఆ లేఖలో కవిత అనేక అంశాలు లేవనెత్తడంతో పార్టీ ముఖ్యనాయకులు ఇరుకున పడ్డారు. మే నెలలో ఆమె ఆమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే మీడియా ముందు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. తన తండ్రి కేసీఆర్ దేవుడంటూనే ఆయన చుట్టు దెయ్యాలు చేరాయని తీవ్ర ఆరోపణ చేశారు. ఇదే సమయంలో బీఆరెస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నం జరిగిందని, దానిని తాను వ్యతిరేకించానంటూ ఏకంగా బాంబు పేల్చారు. పార్టీలో కేసీఆర్ తప్ప తనకు వేరొకరు నాయకుడుకాదంటూ పరోక్షంగా కేటీఆర్‌నుద్దేశించి కౌంటర్‌లు వేశారు. పార్టీని నడపడం చేతగావడంలేదనే విధంగా ఆరోపించారు. దీనిపై కేటీఆర్ డైరెక్టుగా స్పందించకున్నా అంతర్గతంగా కవితకు వ్యతిరేకంగా పకడ్బందీగా పావులు కదిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ క్రమంలోనే కేటీఆర్ ముందుగా హరీశ్‌రావుతో సంప్రదింపులు జరిపి తదుపరి కార్యాచరణ కొనసాగిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కవిత తన జాగృతి సంస్థను బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. అన్నిజిల్లాల్లో నిర్మాణంపై దృష్టిపెట్టారు. తెలంగాణ భవన్‌తో సంబంధం లేకుండా కొత్త ఆఫీస్ తెరిచి కార్యకలాపాల్లో వేగం పెంచారు. తాను గౌరవాధ్యక్షురాలుగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంపై దృష్టి పెట్టారు. జిల్లాల పర్యటనలు పెంచారు. బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ జాగృతి రాజకీయ కార్యాచరణను ఒక పార్టీ కార్యాచరణ స్థాయిలో నడిపిస్తున్నారు. స్వతంత్ర కార్యక్రమాలు కొనసాగిస్తూనే తనను బీఆఆరెస్ నుంచి ఎవరూ దూరం చేయలేరంటూ ప్రకటిస్తూ చర్చల వేడిని మరింత పెంచుతున్నారు. ఇదిలా ఉండగా తాను రాసిన లెటర్ లీక్ తర్వాత కేసీఆర్‌ను కలవడానికి చాలా కాలమే పట్టింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరైన సందర్భంగా భర్తతో కలిసి వెళ్ళినప్పటికీ ఆయనతో మాట్లాడలేదు. ఇటీవల యశోద హాస్పిటల్లో వైద్యపరీక్షల నిమిత్తం వచ్చిన సందర్భంగా మాత్రం తండ్రి కేసీఆర్‌ను పరామర్శించారు.
కవితకు చెక్ పెడుతున్నారా?
కవిత బీఆరెస్‌లో పట్టు సాధించకుండా ముఖ్యనాయకులు పావులు కదుపుతున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కవిత బాధ్యతలు నిర్వహించిన బొగ్గుగని కార్మికులతో తాజాగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో కేటీఆర్ సమావేశమయ్యారు. గౌరవాధ్యక్షురాలిగా ఉన్న కవితను కాదని ఇకపై కొప్పుల ఇన్‌చార్జ్‌గా ఉంటారని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాన్ని చూస్తే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో కవితక్ సంబంధాలను పార్టీ కట్ చేసిందనే అర్థం వస్తున్నది.
రచ్చ చేసిన మల్లన్న ఇష్యూ
ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కవితకు మధ్య నెలకొన్న గొడవ విషయంపై కూడా బీఆరెస్ ముఖ్యనాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు ఎవరూ స్పందించలేదు. కాంగ్రెస్ నాయకులు ఖండించారు తప్ప, బీఆరెస్ నేతలు నైతిక మద్ధతు కూడా ఇవ్వలేదు. కేవలం శాసనమండలి పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాత్రం ఖండించారు. కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. మల్లన్న వ్యాఖ్యలపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, లా అండ్ ఆర్డ్ ఐజీకి కవిత ఫిర్యాదు చేశారు. ఆ రోజున కేటీఆర్ సోషల్ మీడియాలో ఇతర విషయాలపై స్పందించినా… కవిత ఇష్యూను టచ్ చేయకపోవడం గమనార్హం. మల్లన్న వ్యాఖ్యలపై పార్టీ స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత గురువారం వ్యాఖ్యానించడం గమనార్హం.
బీసీ రిజర్వేషన్లపై ఎవరిదారి వారిదే
తాజాగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చేందుకు సిద్ధమైన నేపథ్యంలో బీఆరెస్‌కు భిన్నంగా కవిత తన వైఖరిని ప్రకటించడం గమనార్హం. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆరెస్ వైఖరి తప్పని, ఎప్పటికైనా బీఆరెస్ తన దారిలోకి రాక తప్పదని వ్యాఖ్యానించారు. తద్వారా ఒక కీలకమైన అంశంలో పార్టీ నిర్ణయాన్ని ఆమె బహిరంగంగానే తప్పుబట్టారు. బీఆరెస్ తన బాటలోకి రావాలని కవిత అంటున్నారంటే.. ఇప్పుడు ఆమె బీఆరెస్‌లో ఉన్నట్టా? లేనట్టా? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ అధిష్ఠానం తన పట్ల అనుసరిస్తున్న వైఖరిని ముందే గ్రహించి తన స్వతంత్ర కార్యక్రమాన్ని వేగం చేసినట్లు భావిస్తున్నారు. కవిత కూడా అదునుకోసం ఎదురుచూస్తున్నారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఆమెపై చర్యలు తీసుకుంటే రాజకీయంగా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేటీఆర్, కవిత మధ్య విభేదాల వార్తలను కాంగ్రెస్ బ్రహ్మాండంగా వాడుకుంటున్నది. ఈ నేపథ్యంలో బీఆరెస్‌లో రానున్న రోజుల్లో జరిగే పరిణామాలపై సహజంగానే తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చలు చోటు చేసుకుంటున్నాయి. భవిష్యత్తులో కవిత అడుగులు ఎటువైపు పడుతాయోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది.