Telangana Minister | అమాత్యుడికి అడ్డం తిరిగిన సేవకులు!
దసరా పండుగ సందర్భంగా తృణమో, ఫణమో ఇనాంగా ఇవ్వాలని కోరిన సేవకులపై ఓ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారట.. పండుగ నాటి ఈ వ్యవహారాన్ని సేవకులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.

- నన్నే అడ్డుకుంటారా? అంటూ హుంకరింపు!
- ఇంకా మరవని దసరా పండుగనాటి ఘటన
(విధాత ప్రత్యేకం)
Telangana Minister | ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన శాఖను నిర్వర్తిస్తున్న అమాత్యుడు. ఆయనపై చాలా విమర్శలే వస్తుంటాయి. అయితే.. ఇది మాత్రం కొంచెం భిన్నంగా ఉన్నది. తెలంగాణలో సాధారణంగా దసరా, దీపావళి పండుగలకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఈ పండుగలను ప్రజలు సంబురంగా, వైభవంగా జరుపుకొంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు బహుమానాలు, నజరానాలు అందుతాయి. రాష్ట్ర సచివాలయంలోని అమాత్యులు మొదలు కిందిస్థాయి ఉద్యోగులు, సేవకులకు మిఠాయిలతో పాటు నగదు కూడా ఇచ్చే ఆనవాయితీ దశాబ్ధాలుగా వస్తున్నది. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత కిందిస్థాయిలో పని చేసేవారికి విలువ లేకుండా పోయింది. పై స్థాయి వారికే తృణమో ఫణమో ఇచ్చి వెళ్ళిపోయేవారు. ఒకవేళ ఇచ్చినా సంబురపడే విధంగా ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని నలుగురు కలిసిన చోట చర్చించుకోవడం కన్పిస్తున్నది.
గతేడాది దసరా పండుగకు ముందు అమాత్యులతో పాటు చీఫ్ సెక్రటరీ, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, అధికారులకు వచ్చిపోయేవారి నుంచి పండుగ మిఠాయిలు, గిఫ్ట్‌ల వంటి బహుమానాలు అందాయని చెబుతున్నారు. కిందిస్థాయి సేవకులలో కొందరికి మిఠాయిలు అందాయి. అయితే కీలక శాఖ నిర్వహించే అమాత్యుడి దగ్గర పనిచేసే సేవకులకు కనీసం మిఠాయిలు కూడా దక్కలేదని సమాచారం. దసరా పండుగకు ముందు రోజు సదరు అమాత్యుడు తన నివాసం నుంచి బయల్దేరేందుకు కారు వద్దకు వచ్చారట. ఈ లోపు సేవకులు ఆయన వద్దకు వచ్చి, పండుగ పూట తమకు ఎంతో కొంత ఇవ్వాలని విన్నవించుకున్నారట! ఆయన ససేమిరా అనడంతో చివరకు కారుకు అడ్డంగా నిలుచున్నారని తెలుస్తున్నది. ఈ ఘటనతో హతాశుడైన ఆయన.. నన్నే అడ్డుకుంటారా? తప్పుకొంటారా? లేక పోలీసులను పిలవనా? అంటూ ఫైర్ అవడంతో ఎందుకొచ్చిన గోలలే అనుకుని సేవకులు పక్కకు జరిగారని సమాచారం. నెలలు గడుస్తున్నా ఈ ఘటనను సచివాలయం ఉద్యోగులు మరిచిపోలేక, మళ్లీ మళ్ళీ చర్చించుకోవడం విశేషం.