Medaram Traffic Collapse | కుప్పకూలిన మేడారం ట్రాఫిక్ నియంత్రణ.. 14 గంటలపాటు భక్తులకు నరకం
మేడారం జాతర ట్రాఫిక్ నియంత్రణ పూర్తిగా కుప్పకూలింది. మంత్రులు, అధికార యంత్రాంగం, పోలీసులు, ఆర్టీసీ, విధులు నిర్వహించే సిబ్బంది చేతులెత్తేయడంతో భక్తులు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు గంటలపాటు నరకయాతనను అనుభవిస్తున్నారు. మేడారం నుంచి వరంగల్ వరకు ప్రయాణం 14 గంటల సమయం పడుతోందంటే పరిస్థితి ఏ విధంగా దిగజారిందో అర్ధం చేసుకోచ్చు.
- కొంపముంచిన వీపీఐ ట్రీట్‌మెంట్
- ట్రాఫిక్ జామ్‌కు వారి వాహనాలే కారణం
- పోలీసులపైన్నే వీఐపీల ఆగ్రహావేశాలు
- నిర్వహణ ఆసాంతం సీరియస్‌నెస్
- రోడ్డుపైన పిల్లాపాపలు, వృద్ధుల ఇబ్బందులు
- చేతులెత్తేసిన పోలీసులు, యంత్రాంగం
- ఆర్టీసీ బస్టాండులో గంటలకొద్దీ నిరీక్షణ
- ఆర్భాటానికి, ఆచరణకు పూర్తి విరుద్ధ ఫలితం
- అక్కరుకురాని ఆధునిక టెక్నాలజీ వ్యవస్థ
- ఉన్నతాధికారుల నిర్లిప్తత, చేష్టలుడిగిన సిబ్బంది
- డొల్లగామారిన మంత్రుల ప్రకటన
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Medaram Traffic Collapse | మేడారమంటేనే లక్షలాది మంది సామాన్య భక్తులు తరలివచ్చే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జాతర. ఈ జాతర నిర్వహణలో అతికీలకమైన, అత్యంత ప్రధానమైన సందర్భం, సమయం శుక్రవారం మధ్యాహ్నం నుంచే పరిస్థితి అదుపుతప్పింది. శుక్రవారం ఉదయం నుంచి నెమ్మదిగా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోందని డెంజర్ బెల్స్ మోగాయి. అయినా అప్రమత్తంకానీ అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఫలితంగా శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయానికి పరిస్థితి అత్యంత తీవ్రమై రోడ్లపైన్నే వాహనాలు, బస్సులు నిలిచిపోయాయి. భక్తులు గంటల తరతరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని తల్లడిల్లారు. మేడారం నుంచి తాడ్వాయి. తాడ్వాయి నుంచి పస్రా వరకు పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. మేడారం బస్టాండులో భక్తుల బాధలు వర్ణనాతీతం. దీంతో భక్తులు తీవ్ర అసహనానికి లోనై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
ఆధునికత, ఏఐ అంతా ట్రాష్
కోట్ల రూపాయల నిధులు, హంగులూ, ఆర్భాటాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం, సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణ, కమాండ్ కంట్రోల్, డ్రోన్ టెక్నాలజీ, పదుల సంఖ్యలో ఐపీఎస్ యంగ్ డైనమిక్ ఆఫీసర్ల కేటాయింపు, వేల సంఖ్యలో విధుల నిర్వహణలో పోలీసుల మోహరింపు, నిరంతరం పెట్రోలింగ్ అంటూ ఎంత ఊదరగొట్టిన మంత్రులు, అధికారుల మాటలు ఒక్కరాత్రితో అంతా ట్రాష్ అని తేలిపోయింది. డీజీపీ నుంచి రాష్ట్ర పోలీసు అధికార యంత్రాగమంతా పర్యవేక్షణలు, టూర్లు నిర్వహించి హడావిడి చేశారు. తప్ప తీరా భక్తులు తిరిగి వచ్చే శుక్రవారం పూర్తి చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. కొందరు పోలీసు అధికారులు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ పూర్తిగా పరిస్థితి అదుపుతప్పిపోయి ఊస్తూ ఊరుకుని ఉండాల్సిన పరిస్థితి.
మేడారంలో తల్లడిల్లుతున్న భక్తులు
మేడారంలో ఆర్టీసీ బస్టాండులో బస్సుల కోసం వేచిచూస్తున్న వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. బస్సులు లేక, వచ్చిన బస్సుల్లో ఎక్కలేక, క్యూలైన్లలో గంటలకొద్దీ సమయం సామాన్లూ, సరంజామా, పిల్లాపాపలతో నిలబడినిలబడి తట్లుకోలేక కోపం, ఆవేదన, తిట్లు, శాపనార్ధాలతో తల్లడిల్లిపోయారు. మంచినీరు, మలమూత్రాలకు బయటకు వెళ్ళలేని దుస్థితిని అనుభవిస్తున్నారు .
సీరియస్ లేని యంత్రాంగం
పెద్ద ఎత్తున అధికారులు, సిబ్బందిని మోహరించినప్పటికీ వారిలో సీరియస్ నెస్ కొరవడడం ఫలితంగా జాతరలో ఈ దుస్థితి నెలకొంది. పాలనాయంత్రాంగం నుంచి కూడా సరైన పర్యవేక్షణ, గైడెన్స్ లేక పరిస్థితులకు వదిలివేయడంతో ఈ దయనీయపరిస్థితి నెలకొందంటున్నారు. కాస్తంత కూడా అప్రమత్తతలేకుండా వ్యవహరించడం వల్ల ట్రాఫిక్ నియంత్రణలో ఫెయిల్ అయినట్లు భావిస్తున్నారు. కాగితాలపై విధుల కేటాయింపూ, పర్యవేక్షన పేరుతో బాధ్యతలు కేటాయించినప్పటికీ ఫీల్డ్లో పర్యవేక్షణ, నియంత్రణ, లైజనింగ్ లేకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది.
డొల్లగా మారిన మంత్రుల మాటలు
మంత్రులు పొంగులేటి, సీతక్కలు పదేపదే చెప్పిన గొప్పలు మేడారం భక్తుల అవస్థలసాక్షిగా జంపన్నవాగులో కలిసిపోయాయి. శుక్ర, శనివారాల్లో మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. సర్కారు ఆర్భాటంగా చేసిన ప్రకటనలు ఫీల్డ్ లో ఉత్తి డొల్ల అంటు నిరూపించాయి. కోట్లాది రూపాయల ఖర్చు, హైటెక్ హంగులు, ఏఐ (ఏఐ) నిఘా అంటూ గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వ యంత్రాంగం ట్రాఫిక్ నియంత్రణలో ఘోరంగా విఫలమై చేతులెత్తేసింది. ప్రధాన రోడ్లన్నీ గంటల కొద్దీ ‘చక్రబంధం’గా మారిపోయాయి.
ట్రాఫిక్ జామ్ కు వీఐపీ వాహనాలే కారణం
- మేడారంలో తొలుత తాడ్వాయి నుంచి మేడారం మధ్య ట్రాఫిక్ శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
- ఇక రాత్రికి మేడారం నుంచి తాడ్వాయి వరకు ఉత్పన్నమైన జామ్ ఆ తర్వాత తాడ్వాయి నుంచి పస్రా వరకు విస్తరించింది.
- ఈ క్రమంలో పస్రా నుంచి ములుగు వరకు అక్కడక్కడ సమస్యలు పెరిగాయి.
- ఈ సమస్యకు ప్రధానంగా విఐపీల వాహనాలే కారణం.
- పస్రా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం వరకు కేవలం ఆర్టీసీ బస్సులతో పాటు విఐపీ, వివిఐపీ వాహనాలకు అనుమతి ఉంది.
- దీంతో ఆర్టీసీ బస్సులు అటూ ఇటూ రెండు వైపుల వెళుతున్న సమయంలో విఐపీ వాహనదారులు ఓవర్ టేక్ చేయడం వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
- ఆర్టీసీ బస్సులు నియమిత వేగంతో వెళుతున్న సమయంలో విఐపీ వాహనాలు ఎక్కువ వేగంతో వెళ్తే సమయంలో బస్సులను ఓవర్ టేక్ చేసే సందర్భంలో ఎదురుగా వచ్చే ఆర్టీసీ, విఐపీ వాహనాలు ఎదురుకావడంతో ‘ట్రాఫిక్ జామ్’కు కారణమయ్యాయి.
విఐపీ వాహనాలను నియంత్రించడంలో పోలీసులు చోద్యం చూస్తూ వచ్చారు. ఇందులో ప్రయాణిస్తున్న వారిని నియంత్రించడం సాధారణ పోలీసు అధికారుల వల్ల కాలేదు. ఎందుకంటే విఐపీ వాహనాల్లో ప్రయాణించే వారు ఉన్నతాధికారులు, ముఖ్యరాజకీయ నాయకులు కావడంతో చూస్తే ఊరుకున్నారు. దీనికి తోడు ఈవాహణదారులు సహజంగా ప్రదర్శించే దర్పం ఇక్కడ సమస్యగా మారింది. కొన్ని చోట్ల పోలీసులపైన్నే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యకు తోడు విఐపీ పాసుల నియంత్రలో విఫలం కావడం ప్రధాన కారణం. విఐపీ పాసుల స్టిక్కర్లు వేసుకొని ఇష్టానుసారంగా ఓవర్ టేక్లు చేయడంతో ట్రాఫిక్కు అడ్డంకులు నెలకొన్నాయి. పాసుల జారీలో నీతులు వల్లించిన మంత్రులు, అధికారులు విఐపీ పాసుల జారీలో విషయంలో మాత్రం విచ్చలవిడిగా వ్యవహరించారు. ఈ విఐపీల వాహనాలే ట్రాఫిక్నియంత్రణను కొంపముంచాయి. వారికి అతి ప్రధాన్యతనివ్వడం, పట్టించుకోకపోవడం వల్ల అసలే అటవీప్రాంతం రద్దీగా తగిన విధంగా లేని పస్రా నుంచి తాడ్వాయి, తాడ్వాయి నుంచి మేడారం వరకు ఉన్న రోడ్లు కాస్తా మరి ఇరుకుగా మారిపోయి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒకటి, అరా వాహనాలతో ప్రారంభమైన ఈ వాహనాల జాతర బారులు తీరడంతో పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణ పట్టుదప్పిపోయింది. నెలలుగా చేస్తున్న కసరత్తు పూర్తిగా కుప్పకూలి సామాన్యభక్తులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram