BRS X Cogress | బీఆర్ఎస్ X కాంగ్రెస్ ప్రతి సవాళ్ల ప్రహసనం!

BRS X Cogress | బీఆర్ఎస్ X కాంగ్రెస్ ప్రతి సవాళ్ల ప్రహసనం!

BRS X Cogress | హైదరాబాద్‌ జూలై 9 (విధాత): చాలా ఊళ్లలో వీధిల్లో కొన్ని కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. నా మీద చెయ్యేస్తే నీ సంగతి చూస్తానంటాడు ఒకడు! నేను వేసేదేంటి? నువ్వు నామీద చేయివేయి.. నీ అంతు తేల్చేస్తానంటాడు మరొకడు! వాడు సంగతీ చూడడు.. వీడు అంతూ తేల్చడు! రాజకీయాలకు వస్తే.. దమ్ముంటే ఏ వేదికపైనా చర్చకు సిద్ధం అంటూ రాజకీయ నాయకులు ప్రకటించిన సందర్భాలు చాలా మందికి తెలిసిందే. ఇక్కడెక్కడా సవాలు విసిరినవాళ్లు ఉండరు.. స్వీకరించేవారూ ఉండరు! స్వీకరించినా అంతూపొంతూ లేని షరతులు! దాంతో సమస్య తెగదు.. చర్చ సాగదు! సరిగ్గా ఇలానే తయారయ్యాయి తెలంగాణలో సవాళ్లు, ప్రతిసవాళ్లు! అందుకు తాజా నిదర్శనంగా నిలుస్తున్నది మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో చోటు చేసుకున్న హైడ్రామా! ప్రహసనం!

ప్రెస్‌క్లబ్‌కు కేటీఆర్‌

సీఎం రేవంత్‌ రెడ్డి సవాలు స్వీకరించి, తాను ప్రెస్‌క్లబ్‌ వేదికగా చర్చించేందుకు వచ్చానంటూ మాజీ మంత్రి, బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంగళవారం హల్‌చల్‌ చేశారు. చర్చకు సిద్ధమా? అని సవాలు విసిరిన రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి పారిపోయారంటూ సెటైర్‌లు వేశారు. అయితే.. సీఎం రేవంత్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాలు విసిరితే దానికి బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించడమేంటనేది కాంగ్రెస్‌ వర్గాలు వేస్తున్న ప్రశ్న. రేవంత్‌ రెడ్డి చెప్పిందేంటి? నీకు అర్థమైంది ఏంటి? అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఈ ఉదంతంపై కౌంటర్‌ వేశారు. ఇతర కాంగ్రెస్‌ నాయకులు సైతం ఇదే మాట చెప్పారు.

అసలు ఏం జరిగింది?

జూలై 4న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు కారణమయ్యాయి. తెలంగాణలో రైతు రాజ్యం రావడానికి కారణం ఎవరో చర్చకు సిద్దమని రేవంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, ఎక్కడైనా చర్చకు సిద్దమని ప్రకటించారు. ఈ చర్చకు మోదీ వస్తారో, కిషన్‌రెడ్డి వస్తారో, కేసీఆర్ వస్తారో రావాలని సవాల్ విసిరారు. అయితే రేవంత్‌తో చర్చకు కేసీఆర్‌ అవసరం లేదన్న మాజీ మంత్రి కేటీఆర్‌ తాను చర్చకు వస్తానని ప్రతి సవాలు విసిరారు. కొండారెడ్డిపల్లి, కొడంగల్, చింతమడక, గజ్వేల్ ఎక్కడైనా చర్చకు సిద్దమన్నారు. తన సవాల్ పై 72 గంటలలోపు స్పందించకపోతే జూలై 8న సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో చర్చకు సిద్దమని చెప్పారు. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. అసెంబ్లీలో అన్ని విషయాలపై ఆన్‌రికార్డ్‌ చర్చకు సిద్ధమా? ఎదురు ప్రశ్నించింది. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయించాలంటూ కేసీఆర్‌తో ప్రభుత్వానికి లేఖ రాయించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్‌కు సలహా ఇచ్చారు. అసెంబ్లీలో అన్ని విషయాలపై చర్చకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.

సోమాజీగూడ ప్రెస్ క్లబ్ కు కేటీఆర్

తన సవాల్‌కు అనుగుణంగా కేటీఆర్ మంగళవారం ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌కు వెళ్లారు. సీఎం రేవంత్ సవాల్‌ను స్వీకరించి ప్రెస్ క్లబ్‌కు వచ్చానని చెప్పారు. సవాల్ విసిరి తప్పించుకుపోవడం రేవంత్ సంప్రదాయమని సెటైర్లు వేశారు. సవాల్ చేసి ఢీల్లీకి పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. అయితే.. సీఎం ముందే ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసి కూడా కేటీఆర్‌ ప్రెస్‌క్లబ్‌కు రావడం గమనిస్తే.. ఇది కచ్చితంగా పొలిటికల్‌ డ్రామానే తేలిపోతున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

రాజకీయమే లక్ష్యంగా సవాళ్లు

మొత్తంగా ఒకరిపై ఒకరు రాజకీయంగా పైచేయి సాధించేందుకే బీఆరెస్‌, కాంగ్రెస్‌ ఈ సవాళ్ల ప్రహసనానికి తెరతీసినట్టు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి చర్చలకు ముందు ఒక భూమిక ఏర్పాటు చేసుకోవాలని, మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని, చర్చించే అంశాలు, ఎవరెవరు చర్చిస్తారు? ఎక్కడ చర్చించాలి? అనే అంశాలు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అమెరికా వంటి కొన్ని ఇతర దేశాల్లో ప్రత్యర్థుల మధ్య రాజకీయ ముఖాముఖి చర్చలు చూశాం కానీ.. భారతదేశంలో అటువంటి ఉదాహరణల కోసం వెతకాల్సిందేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. డేట్లు, టైం, ప్లేస్ చెప్పి అక్కడికి వెళ్తున్నామని పార్టీలు, నాయకులు ప్రకటించడం… అక్కడికి వెళ్లకుండానే పోలీసులు వారిని అడ్డుకోవడం లేదా ఇతరత్రా కారణాలతో అది అర్ధంతరంగా నిలిచిపోవడమో అవుతున్నది. సవాళ్లు చేసిన పార్టీ , నాయకులు కానీ, సవాళ్లు స్వీకరించిన పార్టీ లేదా, నాయకుల్లో ఎవరో ఒకరు మాత్రమే సవాల్ చేసిన ప్లేస్ కు వెళ్తుంటారు. కొన్ని ఘటనల్లో ఇరువర్గాల్లో సవాల్ చేసిన ప్రదేశాలకు ఒకవైపు నుంచి వెళ్లిన సందర్భాలు కూడా ఉండవు. టెన్షన్ ఉందని, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు ముందు జాగ్రత్తల్లో భాగంగా ఇరువర్గాలను హౌస్ అరెస్టులతో సవాళ్లు చేసిన పార్టీలు లేదా నాయకులు ఇంటికే పరిమితమైన సందర్భాలు ఎక్కువ. నిజానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసి కూడా నేను వచ్చాను.. ముఖ్యమంత్రి ఎక్కడ? అని ప్రశ్నిస్తే ఉపయోగం ఏమీ ఉండదని, అది కేవలం ఆ రోజు మీడియాకు చేతినిండా పని కల్పించడానికే తప్ప ఎందుకూ పనికిరాదని విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీలో చర్చించినపక్షంలో అంతా రికార్డ్‌ అవుతుందనేది కాంగ్రెస్‌ నాయకుల వాదన. అయితే.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీకే రావడం లేదు. కనీసం బీఆరెస్‌ నాయకులైనా అసెంబ్లీలో చర్చించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తున్నది. దీనిపై మాత్రం బీఆరెస్‌ వర్గాలు తేల్చడం లేదు. మొత్తంగా ఈ సవాళ్లు చిట్టచివరకు ప్రహసనంగానే ముగిసిపోతున్నాయి. మంగళవారం నాటి ప్రెస్‌ క్లబ్‌ ఉదంతం కూడా ఇందులో భాగమే.