BRS BJP Merge Speculations | బీఆరెస్ పక్కలో ‘విలీన’ బల్లెం! ముగ్గురు ముఖ్య నేతలకు కాల పరీక్ష!
బీజేపీలో బీఆరెస్ విలీనం అవుతుందా? ఇది మొన్నటి దాకా కాంగ్రెస్ ఆరోపణ. ప్రయత్నాలు జరిగాయని ధృవీకరించిన కవిత.. తన వద్దకే విలీనం ప్రతిపాదన తెచ్చారని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ సంచలన ఆరోపణ.. సొంత ఇంటి నుంచే వచ్చిన ఆరోపణ.. రమేశ్ సంచలన ప్రకటనల నేపథ్యంలో బీఆరెస్ క్షేత్రస్థాయి వర్గాల్లో తీవ్ర గందరగోళం, కలవరం నెలకొన్నది. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయన్న చర్చలకు అంతు ఉండటం లేదు.

BRS BJP Merge Speculations | విధాత ప్రత్యేక ప్రతినిధి: రజతోత్సవాలు జరుపుకొంటున్న రాజకీయ, ఉద్యమ పార్టీ బీఆరెస్.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ‘విశ్వాస’ పరీక్ష ఎదుర్కొంటోంది. నిన్నమొన్నటి వరకు ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ బట్టకాల్చి మీదేస్తోందిలే? అని కొట్టిపారేసిన ‘బీజేపీతో విలీన అంశం’ పార్టీకి పక్కలో బల్లెంలా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అధికారానికి దూరమై, ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన కేడర్ స్థాయి వరకు చేరిన ఈ పార్టీ ‘విలీన’ అంశం.. తీవ్ర కలవరం సృష్టిస్తోంది. ఈ పరిణామాలు పార్టీ అధిష్ఠానంపై విశ్వాసం సన్నగిల్లేస్థితికి చేరిందనే చర్చ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో సాగుతుంటే.. పార్టీ బలానికి గొడ్డలిపెట్టుగా మారుతోందనే ఆందోళన ఉద్యమకాలం నాటి నాయకుల్లో వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో ఏ మలుపు తీసుకుంటుందోననే ఆవేదన కనిపిస్తోంది.
ఎన్నికలు ముందు నుంచి..
రాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారం చెలాయించిన బీఆరెస్ అధినేత మూడవసారి పీఠంపై కన్నేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంతోపాటు, కేంద్రంలో చక్రం తిప్పాలని భావించి టీఆర్ఎస్‌ను బీఆరెస్‌గా మార్చారు. దాదాపు ఎనిమిదేళ్ళు కేంద్రంలోని బీజేపీతో అంటకాగిన కేసీఆర్.. తర్వాత ఆ పార్టీని, ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ కయ్యానికి కాలు దువ్వారు. ఈ క్రమంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్ఠానం అంచనాలు తలకిందులు చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎదుర్కొన్న పార్లమెంటు ఎన్నికల్లో 19 స్థానాల్లో ఒక్కటంటే ఒక్క స్థానాన్ని దక్కించుకోకపోగా, తమకు పెట్టని కోటల భావించే మెదక్ స్థానాన్ని సైతం బీజేపీకి సమర్పించుకోవడం రాజకీయ వర్గాలనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి లోనుచేసింది. మెదక్ స్థానంతో పాటు అనూహ్యంగా బీజేపీ ఎనిమిది స్థానాలు దక్కించుకున్నది. అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఎంపీలు గెలువడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అప్పుడే కొత్త చర్చకు దారితీసింది.
బీజేపీతో లోపాయికారి ఒప్పందం?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమ పాలనలో జరిగిన ఇబ్బందులపై ఆ పార్టీ వేధింపులకు పాల్పడుతోందనే అంచనా ఒక వైపు, అప్పటికే కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితురాలిగా ఉండటంతో ముందు జాగ్రత్తగా బీఆర్ఎస్ ‘అధినేతలు’ బీజేపీతో లోపాయకారి ఒప్పందానికి వచ్చారనే ప్రచారం ప్రారంభమైంది. నిప్పులేనిదే పొగరాదన్నట్లు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు దీనికి తగ్గట్లుగా ఉండటంతో ఆరోపణలకు బలం చేకూరింది. ఇదే సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తాము ఆశించిన స్థాయి స్థానాలు దక్కించుకోకపోవడానికి బీజేపీకి బీఆరెస్ చేసిన ‘అవయవదాన’మే కారణమంటూ విమర్శలు గుప్పించింది. బీఆరెస్ తమ స్వార్ధ ప్రయోజనాల కోసం బీజేపీతో కుమ్మక్కయిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కవిత అరెస్టు, బీఆరెస్ నేతలు ఢిల్లీలో మకాం వేయడం తదితర వాటితో ఈ ప్రచారం జోరందుకున్నది. చీకట్లో కేటీఆర్, హరీశ్‌రావు బీజేపీ ముఖ్యనేతలను కలుస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ఈ దశ వరకు కాంగ్రెస్ ఆరోపణలుగానే ఉన్నాయి.
కవిత ఎపిసోడ్‌తో బాక్సు బద్దలు
అట్టహాసంగా, కోల్పోయిన ప్రతిష్ఠను, పలుకుబడిని నిలబెట్టుకునేందుకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని లక్షలాది మందిని తరలించి ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ 25 సంవత్సరాల పండుగ చేసుకున్న విషయం తెలిసిందే. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు నిర్వహించిన ఈ సభతో కేసీఆర్ కుటుంబంలో విభేదాలకు పాదులు పడ్డాయనే అభిప్రాయాలు తదుపరి పరిణామాలను గమనించిన విశ్లేషకులు వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు నుంచి బెయిల్‌పై కవిత విడుదలై వచ్చి రెస్టు తీసుకుంటున్నారు. ఈ దశలో జరిగిన సభలో బీఆరెస్‌లో కేసీఆర్ వారసుడిగా కేటీఆర్‌ను విస్పష్టంగా ప్రొజెక్ట్ చేశారు. దీంతో హరీశ్‌రావు, కవిత పైకి గంభీరంగా కనిపించినప్పటికీ.. వారి వర్గాల్లో కలవరం ప్రారంభమైందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత ‘లెటర్’ రూపంలో పేల్చిన బాంబు లీక్ కావడం సంచలనంగా మారింది. ఈ లీక్‌పై స్వయంగా కవిత తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ను తప్ప తాను మరొకరిని నాయకునిగా గుర్తించబోనని తేల్చిచెప్పారు. ఇదే సందర్భంలో తాను జైలులో ఉండగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదన చేశారంటూ కాంగ్రెస్ ఇంతకాలంగా చెబుతూ వచ్చిన బాంబు వత్తిని ముట్టించారు. అప్పటి వరకు కాసింత అనుమానాలున్నప్పటికీ కేసీఆర్ కుటుంబం నుంచే ఈ ఆరోపణ పేలడంతో బీఆరెస్ అధిష్ఠానంలో కలవరం షురూ అయ్యింది. ఈ ఆరోపణలను పరోక్ష పద్ధతిలో కొట్టిపారేసే ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ దీన్ని చర్చకు పెడుతూ వచ్చింది. ఈ అంశం తెరమరుగా కాకముందే కొద్ది రోజులకు మరో బాంబు పేలింది.
సీఎం రమేశ్ సవాల్‌తో కుండబద్దలు
కంచ గచ్చిబౌలి భూముల అంశంలో కోట్ల కుంభకోణం వెనుక బీజేపీ ఎంపీ ఉన్నారని కేటీఆర్ ఆరోపిస్తూ వచ్చారు. ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1600 కోట్ల విలువైన రోడ్డు పనులు కేటాయించారని కేటీఆర్ ఆరోపించారు. దీనిపై సీఎం రమేశ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కవిత జైలులో ఉన్నపుడు బీఆరెస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు బీజేపీ పెద్దలు అమిత్‌షాతో మాట్లాడాలని కోరుతూ తన ఇంటికి వచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. కావాలంటే కేటీఆర్ తన ఇంటికి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ సైతం ఇస్తానని చెప్పారు. దీనిపై బీఆరెస్ ఎదురుదాడి చేయడంతో మంత్రి బండి సంజయ్ జోక్యం చేసుకున్నారు. సీఎం రమేశ్ సవాల్‌కు కేటీఆర్ సిద్ధం కావాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని బీఆరెస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తదితరులు కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. సీఎం రమేశ్ అవకాశవాదంటూ విమర్శించారు.
బీఆర్ఎస్‌లో పెరిగిన కలవరం
కాంగ్రెస్ ఆరోపణలకు ఊతమిస్తూ కవిత విమర్శలు చేయడం తదుపరి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఏకంగా తన వద్ద ఆధారాలున్నాయంటూ సవాల్ చేయడంతో బీఆరెస్ అధిష్ఠానానికి విశ్వాస పరీక్ష ప్రారంభమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కింది స్థాయి క్యాడర్‌లో అనుమానాలు పెరుగుతున్నాయి. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. పార్టీలో ప్రస్తుతం కవితను పక్కనపెడితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కాల పరీక్షను ఎదుర్కొంటున్నారన్న చర్చలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. సరైన సమాధానం చెప్పకుండా తిరిగి తెలంగాణ సెంటిమెంట్ పేరుతో, అధికార కాంగ్రెస్‌పై విమర్శల పేరుతో అసలు సంగతిని పక్కదోవపట్టిస్తున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ ప్రభావం రానున్న రోజుల్లో ఎన్నికలపైన్నే కాకుండా పార్టీ నిర్మాణంపైనా కనిపిస్తుందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఉద్యమ సమయంలో సైతం కేసీఆర్ అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రస్తుతం ముప్పేట దాడి ఎదురుకావడం ఇబ్బందిగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా స్వయంగా ఇంటి ఆడబిడ్డే విలీనం ప్రతిపాదనల అంశాన్ని బహిరంగంగా చెప్పడంతో దాన్ని సూటిగా కొట్టిపారేయలేని స్థితిలో బీఆరెస్ అధినాయకత్వం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రెడిబిలిటీ సమస్యకు తోడు ఇప్పటికే విద్యుత్ అవకతవకలపై వేసిన కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి చేరింది. తాజాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక అందింది. మరోవైపు ఈ కార్ రేస్ కేసు కొనసాగుతోంది. ఈ స్థితిలో అటు అవినీతి, అక్రమాలు, కేసులు వెంటాడుతుండగా ఇప్పుడు పార్టీ ఉనికికి, అధిష్ఠానం విశ్వసనీయతకే పరీక్ష ఎదురవుతున్నదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై పార్టీ విధానం చర్చనీయాంశంగా మారింది.
గూడు మార్చిన గువ్వల
బీజేపీలో బీఆరెస్ విలీనం చర్చ నేపథ్యంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కారు దిగి కమలం గూటికి చేరడం నూతన పరిణామంగా చెప్చవచ్చు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేసిందని బీఆరెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. గువ్వల కేసీఆర్‌కు నమ్మకస్తుడనే పేరు ఉంది. కొనుగోళ్ల ఎపిసోడ్‌లో కీలకంగా వ్యవహరించిన గువ్వల బాలరాజు.. అదే బీజేపీలోకి వెళ్లడం పార్టీ నాయకత్వానికి షాక్ వంటి పరిణామంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. పైగా.. బీజేపీలో బీఆరెస్ విలీనమయ్యే అవకాశం ఉన్నందున తాను ముందు జాగ్రత్తగా ఆ పార్టీలో చేరి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నానని చెప్పడం గమనార్హం. గువ్వలతో ఆగకుండా మరికొందరు కూడా పార్టీని వీడే అవకాశం ఉండనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలను బీఆర్ఎస్ హైకమాండ్ ఎలా ఎదుర్కొంటుందనే చర్చ రాజకీయ వర్గాలతో పాటు గులాబీ పార్టీలోనూ జోరుగా సాగుతున్నది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్‌లోని బీటీ బ్యాచ్ ఆ పార్టీకి అండగా ఉంటుందా? అవకాశవాదంతో వ్యవహరిస్తుందా? అనే అనుమానాలు ముసురుకుంటున్నాయి.