తెలంగాణ నూత‌న సీఎస్ జ‌యేశ్‌ రంజన్‌? కలిసొచ్చే అవకాశాలు ఇవే!

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామ‌కృష్ణారావును ఎంపిక చేయ‌ని ప‌క్షంలో రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారుడిగా నియ‌మించ‌నున్నారని సమాచారం. నాలుగు నెల‌ల కోసం రామ‌కృష్ణారావును నియ‌మించుకునే బ‌దులు మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్ ఐఏఎస్‌ అధికారుల పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయని అత్యంత విశ్వసనీయంగా తెలుస్తున్నది.

తెలంగాణ నూత‌న సీఎస్ జ‌యేశ్‌ రంజన్‌? కలిసొచ్చే అవకాశాలు ఇవే!
  • స‌ల‌హాదారుడుగా రామ‌కృష్ణారావు!
  • ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎస్‌గా వికాస్ రాజ్‌?
  • ప‌ద‌వి ఎంపిక‌లో బీసీ, ఎస్సీ ఫార్ములా
  • ఎస్సీ, బీసీలకు ఇచ్చామని చెప్పుకొనే చాన్స్‌
  • రామకృష్ణారావు రిటైర్‌మెంట్‌కు ఆరు నెలలే వ్యవధి
  • ఇదే ఆయనకు ప్రతికూల అంశం
  • పెట్టుబడుల సాధనలో అందెవేసిన చెయ్యి.. జయేశ్‌
  • అదే ఆయనకు కలిసొచ్చే అవకాశమా?
  • నెలాఖరుకు శాంతికుమారి రిటైర్మెంట్‌
  • కొత్త సీఎస్‌ ఎంపికపై జోరుగా చర్చలు

విధాత‌, హైద‌రాబాద్ (ఏప్రిల్ 18)
తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ( Chief Secretary) ఎంపిక‌లో స‌మీక‌ర‌ణ‌లు మార‌తున్నాయి. నిన్నటి వ‌ర‌కు విన్పించిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి పేరు స్థానంలో మ‌రో ఇద్ద‌రి పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. నూత‌న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నియామ‌కంలో సామాజిక స‌మీక‌ర‌ణ‌లు, అధిక కాలం స‌ర్వీసు అంశాలను కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌దని సమాచారం. ఈ నేప‌థ్యంలో ఎక్కువ కాలం స‌ర్వీసు ఉన్న ఇద్ద‌రు అధికారుల పేర్ల‌లో ఒక‌రిని సెలెక్ట్ చేయ‌నున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

నెలాఖరుకు శాంతికుమారి రిటైర్మెంట్‌
ప్ర‌స్తుత ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఏ శాంతికుమారి (1989 బ్యాచ్‌) ఈ నెలాఖ‌రుకు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఆమె స్థానంలో నూత‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నియామ‌కం కోసం గ‌త నెల రోజులుగా క‌స‌ర‌త్తు జ‌రుగుతున్న‌ది. ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్న కే రామ‌కృష్ణారావు (1991 బ్యాచ్‌) పేరు దాదాపు ఖ‌రారయ్యిందని గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఆర్థిక శాఖ‌లో విశేష‌మైన అనుభ‌వం ఉన్న ఆయ‌న‌ను నియ‌మించాల‌ని ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డి సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యం తీసుకున్నారని, ఈ నెలాఖ‌రుకు శాంతికుమారి నుంచి ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకోనున్నార‌ని స‌చివాల‌య వ‌ర్గాలు అనుకుంటూ వచ్చాయి. ఈ తరుణంలో ఊహించ‌ని విధంగా రెండు పేర్లు తెర‌మీద‌కి వ‌చ్చాయని తెలిసింది. రామ‌కృష్ణారావు స‌ర్వీసు ఆగ‌స్టు 2025 కు పూర్త‌వుతుంది. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించినా నాలుగు నెల‌ల‌కు మించి కొన‌సాగే ప‌రిస్థితి లేదు. ఒక‌వేళ మ‌రో మూడు నెల‌ల పాటు స‌ర్వీసు కొన‌సాగించాల‌ని అనుకుంటే కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి పొందాల్సి ఉంటుంది. రామకృష్ణారావు స‌ర్వీసు పొడిగింపు కోసం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసినా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారా? అనే సంశ‌యం కూడా ఉంది. ఒక‌వేళ పొడిగింపు లేన‌ట్ల‌యితే ఆగస్టు నెలాఖ‌రుకు రిటైర్ కావాల్సి ఉండ‌టం ఆయనకు పెద్ద మైనస్‌గా మారిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒక‌వేళ రామ‌కృష్ణారావును ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎంపిక చేయ‌ని ప‌క్షంలో రాష్ట్ర‌ ప్ర‌భుత్వ (Telangana Govt) ప్ర‌ధాన స‌ల‌హాదారుడిగా నియ‌మించ‌నున్నారని సమాచారం. నాలుగు నెల‌ల కోసం రామ‌కృష్ణారావును నియ‌మించుకునే బ‌దులు మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్ ఐఏఎస్‌ అధికారుల పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయని తెలుస్తున్నది. అందులో ఒక‌రు జ‌యేశ్‌ రంజ‌న్‌  (Jayesh Ranjan IAS) కాగా మ‌రొక‌రు వికాస్ రాజ్‌. వీరిద్ద‌రూ 1992 బ్యాచ్ అధికారులే కావడం గ‌మ‌నార్హం. జ‌యేశ్‌ 2027 సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు స‌ర్వీసులో ఉంటారు. వికాస్ రాజ్ 2028 మార్చి నెలాఖ‌రుకు కొనసాగుతారు. జ‌యేశ్‌.. ప్రస్తుతం తెలంగాణ ప్ర‌భుత్వ‌ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అండ్ కమ్యునికేష‌న్ శాఖకు, వికాస్ రాజ్ ట్రాన్స్ పోర్ట్‌, రోడ్లు, భ‌వ‌నాల శాఖకు ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఇద్ద‌రూ బీహార్ రాష్ట్రానికి చెందిన అధికారులే కావ‌డం గ‌మ‌నార్హం

క‌లిసొస్తున్న కుల గ‌ణ‌న‌…
కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కుల గ‌ణ‌న కోసం పోరాడుతున్నారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణ‌లో కుల గ‌ణ‌న చేస్తామ‌ని చెప్పారు. రాహుల్ ప్ర‌క‌ట‌న మేర‌కు ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డి కుల గ‌ణ‌న నిర్వ‌హించి, బీసీ జానాభా లెక్క‌లు తేల్చారు. తెలంగాణ‌లో బీసీ కులాల శాతం 56.6 శాతంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుల గ‌ణ‌న వివ‌రాల‌ను బ‌హిర్గ‌తం చేయ‌డ‌మే కాకుండా రెండు రోజుల క్రితం క్యాబినెట్ మీటింగ్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. బీహార్‌కు చెందిన జ‌యేశ్‌ రంజ‌న్ బీసీ వ‌ర్గానికి చెందిన అధికారి కావ‌డం ఆయ‌న‌కు క‌లిసివ‌చ్చే అవ‌కాశంగా ఉందని విశ్వసనీయంగా తెలిసింది. వివాద ర‌హితుడు, ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీతో క‌లిసి ప‌నిచేసే మ‌న‌స్త‌త్వం ఉండ‌టం కూడా కార‌ణంగా చెబుతున్నారు. జయేశ్‌ రంజన్‌ పేరును ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, క‌ర్ణాట‌క రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌ సిఫార‌సు చేసిన‌ట్లు కాంగ్రెస్ వ‌ర్గాలు కూడా చ‌ర్చించుకుంటున్నాయి. తెలంగాణకు పెట్టుబ‌డులు, ఆదాయం స‌మ‌కూర్చ‌డంలో ఆయ‌న‌కు విశేష అనుభ‌వం ఉంద‌ని, స‌ర్వీసు కూడా రెండున్న‌ర ఏళ్ల వ‌ర‌కు ఉన్నందున ఆయ‌న పేరును ప్ర‌తిపాదించార‌న్నారని సచివాలయంలో సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. గ‌త ద‌శాబ్ధ‌కాలం నుంచీ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ‌ల కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్నందున ఆయ‌న వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గుచూపుతున్న‌ట్లు తెలిసింది. రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ఆదాయం పెద్ద స‌మ‌స్య‌గా మారిన ప‌రిస్థితుల నేప‌థ్యం కూడా క‌లిసివ‌చ్చే అంశంగా చెప్ప‌వ‌చ్చని అంటున్నారు. అయితే.. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో కే తార‌క రామారావుతో ఆయన సన్నిహితంగా మెలిగారనే అపవాదు ఉన్నది. ఇదేమైనా మైనస్‌గా మారుతుందా? అనే అనుమానాన్ని కూడా సదరు అధికారి వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ వికాస్ రాజ్ కు..
బీహార్‌కు చెందిన మ‌రో అధికారి వికాస్ రాజ్ పేరు కూడా కాంగ్రెస్ నాయ‌కత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌దని సమాచారం. షెడ్యూల్డ్‌ కులాల‌కు చెందిన వికాస్ రాజ్.. మొన్న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి (సీఈవో)గా విధులు నిర్వ‌ర్తించారు. ఆ త‌రువాత ఆయ‌న‌కు ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే జ‌యేశ్‌రంజన్‌కు ఉన్నంత‌గా చాకచ‌క్యం లక్ష‌ణాలు వికాస్ రాజ్‌కు లేవని అంటున్నారు. పెట్టుబ‌డులు, ఆదాయం తీసుకువ‌చ్చే శ‌క్తియుక్తులు లేవని చెబుతున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌నను ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించే సూచ‌న‌లు కన్పిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. 2028 సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ నెల‌లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జ‌యేశ్‌ ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత వికాస్ రాజ్‌ను నియ‌మిస్తే.. 2028 మార్చి వ‌ర‌కు కొన‌సాగుతారు. మ‌రో ఆరు నెల‌ల పాటు కొన‌సాగిస్తే సెప్టెంబ‌ర్ 2028లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే అవ‌కాశం ఉంటుంది. ఎస్సీ వ‌ర్గానికి చెందిన అధికారిని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించామ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి చెప్పుకొనే అవకాశం కూడా కలుగుతుంది. ఒకవేళ వికాస్ రాజ్ స‌ర్వీసును కేంద్ర ప్రభుత్వం ఆరు నెల‌లు పొడిగించ‌న‌ట్ల‌యితే.. బ‌ద్నాం చేసే ఆయుధం కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ల‌భిస్తుంది. ఒక‌రి త‌రువాత మ‌రొక‌రిని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించ‌డం మూలంగా బీసీ, ఎస్సీ వ‌ర్గాల‌కు చేరువ కావ‌చ్చ‌ని, బీజేపీని రాజ‌కీయంగా దెబ్బ‌కొట్ట‌వ‌చ్చ‌నే వ్యూహంగా కాంగ్రెస్ అధిష్ఠానం పెద్ద‌లు ఉన్నారని తెలుస్తున్నది.