- ఆంధ్రవాళ్లకు, ఇతర రాష్ట్రీయులకు పెద్ద పీట
- ప్రభుత్వంలోని కీలక పోస్టుల్లో వాళ్లే
- గతంలో కేసీఆర్ అదే పని.. ఇప్పుడు రేవంత్
- ఏపీ నీటివాటాపై ఆదిత్యనాథ్ దాస్ కృషి
- ఆయనే ఇప్పుడు తెలంగాణ నీటి సలహాదారు!
- ఐఅండ్‌పీఆర్ డైరెక్టర్‌గా ఏపీకి చెందిన శ్రీరామ్
- గతంలో మిట్టల్‌పై దుమ్మెత్తిన కాంగ్రెస్ నేతలు
- కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు కీలక పోస్టు
- శాంతి కుమారి విషయంలోనూ అదే తీరు
- తెలంగాణ సోయిలేని కేఎస్ శ్రీనివాస్‌రాజు
- రిటైర్డ్ తెలంగాణ ఐఏఎస్ అధికారులు ఇంటికి
- ఇతర రాష్ట్రాల అధికారులకు ఎక్స్టెన్షన్
- ఉద్యమ ట్యాగ్ లైన్లకు భిన్నంగా వ్యవహారాలు
- జీర్ణించుకోలేక పోతున్న తెలంగాణవాదులు
- తెలంగాణ అధికారులకు పెద్ద పోస్టులు వద్దా?
- మనోళ్లయితే తెలంగాణ ఆత్మతో పనిచేస్తారు కదా?
హైదరాబాద్, మే 27 (విధాత) :
Non Local officials | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అడుగులకు మడుగులొత్తే ఉన్నతాధికారులను ఇంకా కొనసాగించడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తామే దుమ్మెత్తిపోసిన ఐఏఎస్‌లను సాగనంపక పోవడం పక్కన పెడితే.. వారికే పెద్దపీటలు వేయడం తెలంగాణ సమాజం జీర్ణించుకోవడం లేదు. తెలంగాణ సోయి లేని, సొక్కం కాని వ్యక్తులకు ఎనలేని ప్రాధాన్యతనివ్వడాన్ని ఉద్యమకారులు అంగీకరించలేక పోతున్నారు. గత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూడా తన పదేళ్ల పాలనలో తెలంగాణయేతరులకు ఎర్రతివాచీ వేసి గౌరవించారు. అదే తీరును కొనసాగిస్తూ, ఆయన రీతిలో పాలన సాగిస్తున్నారనే అపఖ్యాతిని రేవంత్ రెడ్డి మూటగట్టుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవుల్లో కొనసాగుతూ, గౌరవ మర్యాదలు అందుకుంటున్న పేగుబంధం లేని పెద్దలు వీరే…
ఆదిత్యనాథ్ దాస్, ప్రధాన సలహాదారు, నీటి పారుదల శాఖ
బీహార్ రాష్ట్రానికి చెందిన ఆదిత్యనాథ్ దాస్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి 2012లో రిటైర్ అయ్యారు. దానికి ముందు ఏపీ సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా జలాల వాటాలపై గొడవలు నడుస్తున్నాయి. బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట రెండు రాష్ట్రాలూ తమ వాదనలు విన్పిస్తున్నాయి. గతేడాది జూన్ నెలలో ఆదిత్యనాథ్ దాస్‌ను నీటి పారుదల శాఖ సలహాదారుడిగా నియమిస్తూ రేవంత్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసేంత వరకు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశారు. ఆ దిశగా అధికారులతో పనిచేయించారు. తెలంగాణ నీటి వనరులను కొల్లగొట్టేందుకు జరిగిన ప్రయత్నాల్లో ఆయన హస్తం ఉందనే అభిప్రాయం తెలంగాణ నీటిపారుల శాఖ అధికారుల్లో బలంగా ఉన్నది. అధికారి తెలంగాణ ప్రజల కోసం ఎలా పనిచేస్తారనే ప్రశ్నలను పలువురు అధికారులు లేవనెత్తుతున్నారు. గోదావరి, కృష్ణా జలాల వాటాల విషయంలో మొన్నటి దాకా ఏపీకి అధికంగా దక్కాలని రాతపూర్వకంగా వాదనలు విన్పించిన అధికారి, ఇప్పుడెలా తెలంగాణ కోసం పనిచేస్తారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఏపీ ప్రభుత్వంలో ఆయనే సమర్థుడు, రేవంత్ రెడ్డి వచ్చిన తరువాత తెలంగాణలో కూడా సమర్థుడేనా అన్న వాదనలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో బడా కాంట్రాక్టర్‌గా పేరొందిన సీమాంధ్ర వ్యక్తికి ఆదిత్యనాథ్ దాస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. రేవంత్ సర్కార్‌లో ఆ కాంట్రాక్టర్ మునుపటిలా వెలుగు వెలగడానికి దాస్ ఆశీస్సులేనని నీటి పారుదల శాఖలో చర్చ జరుగుతోంది. ఆ బడా కాంట్రాక్టర్ విజ్ఞప్తి మేరకే దాస్‌ను నియమించారన్న మరో వాదన కూడా వినిపిస్తున్నది. జలాలపై రగడ జరుగుతున్న ఇలాంటి క్లిష్ట సమయంలో తెలంగాణ మట్టి వాసన ఉన్న నిపుణుడిని సాగునీటి రంగానికి నియమించుకుంటే బాగుండేదని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన విషయంలో పునరాలోచించుకుని, మరొకరిని ఎంపిక చేసుకుంటే మంచిదని అంటున్నారు.
కర్రి శ్రీరామ్, తెలంగాణ ఐ అండ్ పీఆర్ డైరెక్టర్
తెలంగాణ సమాచార పౌర సంబంధాలు (ఐఅండ్ పీఆర్) లో మీడియా అండ్ కమ్యునికేషన్ డైరెక్టర్‌గా రెండేళ్ల పదవీకాలానికి గాను గతేడాది ఆగస్టు నెలలో కర్రి శ్రీరామ్ నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన డెక్కన్ క్రానికల్ ఇంగ్లీషు దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం బిలాస్ పూర్ లో (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్) జన్మించినప్పటికీ ఆయన మూలాలు ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. విశాఖపట్నంలోని బీవీకే కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన శ్రీరామ్.. అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. తెలంగాణ ప్రజల జీవనాడి తెలియని ఈయనను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే చెప్పుకొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో డెక్కన్ క్రానికల్ పేపర్‌లో కొంత ప్రాముఖ్యం ఇచ్చారని, ఆ కారణంగానే ఆయనను డైరెక్టర్ పదవికి ఎంపిక చేశారని జర్నలిస్టు వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలంగాణ కోసం ఎంతో మంది జర్నలిస్టులు తెర వెనకాల, తెర ముందు పొట్లాడారు. వారిలో అందరూ కేసీఆర్‌కు బాకా ఊదలేదు. ఆంధ్రా పెట్టుబడిదారులు, వలసవాదుల దౌర్జన్యం నుంచి ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు పోరాడారు. అలాంటి వారికి గౌరవం ఇవ్వకపోగా, శ్రీకాకుళం వాసి అయిన శ్రీరామ్‌ను ఎంపిక చేయడం జర్నలిస్టులను కలచి వేస్తున్నది. తెలంగాణ కోసం పోరాడిన వారిలో ఒకరిని ఈ పదవికి ఎంపిక చేస్తే రేవంత్ రెడ్డి మరింత పేరు వచ్చేదని జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
నవీన్ మిట్టల్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి
పంజాబ్ రాష్ట్రానికి చెందిన నవీన్ మిట్టల్ (1996 బ్యాచ్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఐఏఎస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఆయనను తెలంగాణకు కేటాయించారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం రూపొందించిన ధరణి వెబ్ పోర్టల్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కేసీఆర్, కేటీఆర్ సహా ముఖ్య నాయకులు సూచించిన విధంగా భూముల రికార్డులు తారుమారు చేశారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, భూదాన్ భూములు ఇలా చెప్పుకొంటూ పోతే అనేక వివాదాస్పద భూములకు రాత్రికి రాత్రికే రెక్కలొచ్చి బడా బాబుల చేతుల్లోకి పోయాయనే విమర్శలు ఉన్నాయి. ధరణి మాయల వెనకాల నవీన్ మిట్టల్ హస్తం ఉందని అప్పట్లో కాంగ్రెస్ నాయకులే దుమ్మెత్తిపోశారు. బీఆర్ఎస్ పెద్దలు చెప్పినట్లల్లా నడుచుకుంటున్నారని, విలువైన భూములను పరాధీనం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పది నెలల ముందు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా, సీసీఎల్ఏ ఇన్‌చార్జ్ కమిషనర్‌గా మిట్టల్ నియమితులయ్యారు. ఈ రెండూ కాకుండా సర్వే, సెటిల్‌మెంట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించడంతో కింది నుంచి పై వరకు తన పైళ్లకు తానే సిఫారసు చేసి సంతకాలు చేసేవారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈయనను మార్చుతారని యావత్ తెలంగాణ రైతాంగం సంబురపడింది. కానీ ఏమీ జరగలేదు సరికదా, తన హవాను గత ప్రభుత్వంలో కొనసాగించిన విధంగానే ఈ ప్రభుత్వంలో కొనసాగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చే విధంగా ఈ ప్రభుత్వ పెద్దల తీరు ఉందని అంటున్నారు. చర్యలు లేకపోగా కనీసం రెవెన్యూ శాఖ నుంచి కదిలించడం లేదంటున్నారు. ధనం పరమావధిగా ఈ ప్రభుత్వం వ్యవహారం ఉందనేది జనాల్లోకి బలంగా వెళ్లిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శాంతి కుమారి, ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ వీసీ
గత నెలాఖరున తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన శాంతి కుమారిని, వెంటనే జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ వైస్ చైర్‌పర్సన్‌గా, పూర్తి అదనపు బాధ్యతలతో చైర్ పర్సన్ గా నియమించారు. ఆంధ్రాలోని మచిలీపట్నానికి చెందిన ఈమెను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియమించుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ రాగానే శాంతి కుమారిని తప్పిస్తారని సచివాలయ ఉద్యోగులు భావించారు. ఇక్కడ కూడా ఏమీ జరుగలేదు సరికదా పూర్తి పదవీకాలాన్ని కొనసాగించారు. ఈమెకు ఢిల్లీలోని ఏఐసీసీలో చక్రం తిప్పుతున్న మాజీ బ్యూరోక్రాట్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే కొనసాగించారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పదవీ విరమణ తరువాత ఇంటికి సాగనంపకుండా మళ్లీ ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ లో డీజీగా నియమించడం ఏంటని సచివాలయ ఉద్యోగులు మథనపడుతున్నారు. తెలంగాణ ప్రాంతం ఐఏఎస్ అధికారులు రిటైర్ అయితే ఇంటికి పంపించిన గత, తాజా ముఖ్యమంత్రులు.. ఆంధ్ర ప్రాంత అధికారులకు పెద్ద పీటలు ఎందుకు వేస్తున్నారన్న చర్చలు చోటు చేసుకుంటున్నాయి.
కేఎస్ శ్రీనివాస రాజు, ముఖ్య కార్యదర్శి, తెలంగాణ సీఎంవో
ఆంధ్రాలోని చిత్తూరు జిల్లాకు చెందిన కేఎస్ శ్రీనివాస రాజు గతేడాది ఐఏఎస్ పదవికి వీఆర్ఎస్ తీసుకున్నారు. టీటీడీ ఈవో పదవి కోసం ప్రయత్నించగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించలేదని, దాంతో ఆయన వీఆర్‌ఎస్ తీసుకున్నారని సమాచారం. కట్ చేస్తే.. ఆయన తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారులో సలహాదారుడిగా చేరారు. ఏడాది కూడా తిరక్కముందే ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి వీ శేషాద్రి ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. దేశ జ్యూడిషియరీలో చక్రం తిప్పిన ఓ పెద్దాయన ఆశీస్సులతో ఈ పదవి పొందారా? లేదా చంద్రబాబు నాయుడు సిఫారసుతో ఇచ్చారా? అనే విషయంలో సచివాలయ ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. రాజుకు తెలంగాణతో ఎలాంటి పేగుబంధం లేకున్నా, ఉన్నత పదవిని కట్టబెట్టడం పట్ల రిటైర్డ్ తెలంగాణ ఐఏఎస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నాలుగు సంవత్సరాల పాటు ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శిగా ఆయన పనిచేశారని గుర్తు చేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
IAS | ఐఏఎస్‌లా? పాదదాసులా? సీఎంలకు ఆ పాదాభివందనాలేంటి?
IAS Srilakshmi | ఒక్క పదం తొలగించినందుకు నిత్య నరకం.. ఐఏఎస్‌లకు ఈమె కేసు పెద్ద గుణపాఠం!
Telangana Ias Officers | సీఎం పేషీలో ఐఏఎస్ ల ఛాంబర్ల లొల్లి?
Operation Kagar | నంబాల ఎన్‌కౌంటర్ జరిగిందిలా.. పాయింట్ టూ పాయింట్ వివరించిన మావోయిస్టు లేఖ