Mallojula Venugopal Rao | ‘మావోయిస్టు’ పార్టీతో తెగిన మల్లోజుల అనుబంధం.. వేణుగోపాల్ రావు ఉద్యమ ప్రస్థానం

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్ కౌంటర్ తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నేతల్లో ఒకరిగా తెరపైకి వచ్చిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావిస్తుస్తున్నారు. ఈ పరిణామం విప్లవాభిమానులను షాక్‌కు గురిచేసింది. మావోయిస్టు పార్టీతో సోనుకు ఉన్న దశాబ్దాలుగా అనుబంధం తెగిపోయింది.

Mallojula Venugopal Rao | ‘మావోయిస్టు’ పార్టీతో తెగిన మల్లోజుల అనుబంధం.. వేణుగోపాల్ రావు ఉద్యమ ప్రస్థానం special story on maoist leader mallojula venugopal rao
  • ‘మావోయిస్టు’పార్టీతో తెగిన మల్లోజుల అనుబంధం
  • మూడు దశాబ్దాల వేణుగోపాల రావు ఉద్యమ ప్రస్థానం
  • సుదీర్ఘకాలం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు
  • మొన్నటి వరకు పొలిట్ బ్యూరో మెంబర్‌గా కీలకస్థానం
  • కగార్ కష్టకాలంలో పార్టీ..కొత్త వాదనలకు శ్రీకారం
  • ఆయుధాలు వదిలేయాలంటూ పార్టీలో బహిరంగ చర్చ
  • సోను లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి తీవ్ర దెబ్బ

విధాత, ప్రత్యేక ప్రతినిధి: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్ కౌంటర్ తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నేతల్లో ఒకరిగా తెరపైకి వచ్చిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావిస్తుస్తున్నారు. ఈ పరిణామం విప్లవాభిమానులను షాక్‌కు గురిచేసింది. మావోయిస్టు పార్టీతో సోనుకు ఉన్న దశాబ్దాలుగా అనుబంధం తెగిపోయింది.

నిన్నమొన్నటి వరకు ఆ పార్టీలో కీలకమైన పొలిట్ బ్యూరో మెంబర్‌గా ఉంటూ వచ్చిన సోను, దాదాపు 60 మంది అనుచరులతో గడ్చిరోలి పోలీసుల ఎదుట జనజీవనంలోకి రావడం తీవ్ర చర్చను లేవనెత్తుతోంది. కగార్ యుద్ధంతో సర్కారు మావోయిస్టులపై ఆయుధాన్ని ఎత్తిపట్టి అణచివేతను కొనసాగిస్తూ మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టి పై చేయి సాధించిన అత్యంత క్లిష్ట సమయంలో వేణుగోపాల్ పార్టీని వీడడం తీవ్ర పరిణామంగా భావించవచ్చు.

అత్యంత క్లిష్ట సమయంలో లొంగుబాట

వ్యక్తులుగా కొందరు, భిన్నాభిప్రాయాలతో మరి కొందరు మావోయిస్టు పార్టీని వీడారు. ముక్కుసుబ్బారెడ్డి, సత్యమూర్తి తదితర కేంద్ర స్థాయి నేతలు వెళ్ళిపోయిన చరిత్ర ఆ పార్టీ చవిచూసినప్పటికీ అత్యంత క్లిష్ట సమయంలో ఆయుధాలు వదిలేయాలంటూ నూతన ప్రతిపాదనలతో పార్టీలో, బయట బహిరంగ చర్చను లేవనెత్తి తీవ్ర సంచలనానికి కారణమైన సోను పోలీసులకు లొంగిపోయినప్పటికీ, తాను సృష్టించిన కల్లోలం నుంచి పార్టీ ఏ విధంగా గట్టెక్కుతోందనే చర్చసాగుతోంది. సోను తన వాదనకు గడ్చిరోలి ప్రాంత పార్టీ కమిటీల నుంచి బహిరంగ మద్ధతును కొనసాగిస్తూ పార్టీని అతలాకుతలం చేశారు.

పార్టీ ప్రధాన కార్యదర్శిగా, నాయకత్వ బాధ్యతలు నిర్వహించిన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు ఎన్కౌంటర్ లో మృత్యువాత పడిన ఈ పరిస్థితుల్లో సోను అనుసరించిన విధానం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోను లేవనెత్తే సమస్యలు పార్టీ ఎదుర్కొంటున్నప్పటికీ, పార్టీ నిర్మాణ చట్రం పరిధిలో పరిష్కరించుకోకుండా… పార్టీకి నష్టం చేసే విధానాలు అనుసరించారని పార్టీ స్పష్టం చేసింది. అయితే పార్టీ నాయకత్వం, కేడర్ ఎన్కౌంటర్ కోరల్లో చిక్కుకుంటున్న ఈ సమయంలో కాకుంటే, తర్వాత మిగిలేదేమీ ఉండదనే అభిప్రాయంతో తన అభిప్రాయాలు బహిర్గతం చేశారని కొందరు సమర్థిస్తున్నారు.

సోనును ద్రోహిగా ప్రకటించిన పార్టీ

కగార్ యుద్ధం తీవ్రమై పదుల సంఖ్యలో పార్టీ నాయకత్వం, కేడర్ ఎన్ కౌంటర్లలో మృతి చెందుతున్న క్రమంలో పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ అంటూ విడుదల చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకటన అనేక చర్చోపచర్చలకు దారితీసింది. ఈ క్రమంలో కొద్ది రోజులకు విప్లవ ప్రజలకు విజ్జప్తి అంటూ సొను పేరుతో వేణుగోపాల్ రాసిన 22 పేజీల లేఖ సెప్టెంబర్ 17 బహిర్గతమైన విషయం తెలిసిందే. ఆగస్టు తేదీతో ఉండగా, మావోయిస్టు పార్టీని, ఆ పార్టీ అనుకూల విప్లవశక్తులను ఒక్కసారిగా కుదిపేసింది.

ఈ సంఘటన నుంచి కోలుకోకముందే కొద్ది రోజులకే పార్టీ శ్రేణులకు వినతి పేరుతో మరో 22 పేజీల లేఖ బహిర్గతమైంది. ఈ లేఖ పూర్తిగా ప్రస్తుతం పార్టీ చేపట్టిన విధానం, దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమక్రమం తదితర అనేక పునాది అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆయుధాలు వదిలి పార్టీని పునర్నిర్మాణం చేపట్టాలంటూ బహిరంగంగా ప్రకటించడంతో సంచలనంగా మారింది. ప్రస్తుతం అనుసరిస్తున్న పంథా పూర్తిగా తప్పంటూ పేర్కొన్నారు. నాయకత్వ తప్పిదాల వల్ల ఉద్యమం వెనుకపట్టుపట్టిందని, కేడర్ అనవసర త్యాగం చేయకూడదన్నారు. ఈ క్రమంలో అభయ్ ప్రకటన పూర్తిగా ఆయన వ్యక్తిగతమని పార్టీ విధానాలకు వ్యతిరేకమంటూ పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

జగన్ ప్రకటన పై సోను తీవ్రంగా విమర్శలు చేసిన నేపథ్యంలో పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్, దండకారణ్య కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో విడుదల చేసిన ప్రకటన మల్లోజుల తీరును తీవ్రంగా వ్యతిరేకించింది. సోను సాయుధ పోరాట విరమణ అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయమంటూ ఆయుధాలతో లొంగిపోయే హక్కు ఆయనకు లేదంటూ పార్టీకి అప్పగించాలని స్పష్టం చేశారు. ద్రోహిగా పరిగణించాల్సి ఉంటుందోని హెచ్చరించారు.

ఈ ప్రకటన విడుదల చేసిన నేతలు కట్టా రామచంద్రరెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డిలు రెండు రోజుల్లోనే ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర కమిటీ ప్రకటనకు మాత్రంసోను నుంచి కౌంటర్ లేక పోవడం గమనార్హం. పార్టీలో కొత్త చర్చ, సిద్ధాంతం, రాజకీయాలను ముందు పెట్టిన సోనూ గురువారం లొంగిపోవడం తీవ్ర పరిణామంగా భావిస్తున్నారు. ఈ లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ ఏ విధంగా స్పందిస్తుందోననే చర్చ సాగుతోంది.

మావోయిస్టు ఉద్యమానికి దెబ్బ మీద దెబ్బ

ఇటీవల వరుస దెబ్బలతో మావోయిస్టు ఉద్యమం బలహీనపడింది. కేంద్ర సైనిక బలగాల ఆపరేషన్ తో ఏడాది కాలంలో 471 మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లలో మరణించారు. 1,850 మంది లొంగిపోయారు. హోమ్ మంత్రి అమిత్ షా మార్చి 2026 నాటికి నక్సలిజాన్ని రూపుమాపాలు లేకుండా చేస్తామని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో సోను లొంగుబాటు తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటున్నారు. ఇదిలా ఉండగా మావోయిస్టు పార్టీలో వేణుగోపాల్ పయనం ముగిసింది. భవిష్యత్లో తాను ప్రతిపాదించిన మేరకు నూతన పార్టీని నిర్మిస్తారా? లేదా? అనే ప్రశ్నలు పక్కనపెడితే సుదీర్ఘకాలం పీపుల్స్ వార్, మావోయిస్టు పార్టీలో కొనసాగిన తన ప్రస్థానం ముగిసింది.

వేణుగోపాల రావుది పార్టీలో ఐడియాలాజికల్ జర్నీగా అభివర్ణిస్తున్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వేణుగోపాల్ డిగ్రీ చదివారు. మావోయిస్టు ముఖ్య‌నేత మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీ వేణుగోపాల్‌కు అన్న, పశ్చిమ బంగాల్‌లో 2011లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. విద్యార్థి దశ నుంచే వేణుగోపాల్ విప్లవోద్యమంలో భాగమై అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు.

ముప్పాల లక్ష్మణ రావు అలియాస్ గణపతి సమకాలికుడిగా ఉద్యమంలో పని చేశారు. ఐదు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఉంటూ కీలక నేతగా ఎదిగారు. 26 ఏళ్ళుగా కేంద్ర కమిటీ మెంబర్ గా కొనసాగారు. పార్టీ ఉత్థాన, పతనాలను చూసిన వ్యక్తిగా ఆయనను పేర్కొనవచ్చు. పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు ఎన్ కౌంటర్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తిగా ఒక దశలో చర్చ సాగింది. వేణుగోపాల్‌పై పలు కేసులు ఉండగా రూ.1 కోటి ఉంది.