Speaker Options | ఉప ఎన్నికలు వస్తాయా? సుప్రీం తీర్పు నేపథ్యంలో స్పీకర్‌ ముందు ఆప్షన్లు అవే!

సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆక్టోబర్ 31లో ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనుందా? ఉప ఎన్నికలు వస్తాయా? స్పీకర్ ముందు ఉన్న ఆప్షన్స్‌ ఏంటి? అనే అంశంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

Speaker Options | ఉప ఎన్నికలు వస్తాయా? సుప్రీం తీర్పు నేపథ్యంలో స్పీకర్‌ ముందు ఆప్షన్లు అవే!

Speaker Options | హైదరాబాద్‌, ఆగస్ట్‌ 1 (విధాత) : తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపుగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌ను ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్జిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. దేశంలోని రెండు రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించిన అంశంగా ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో జస్టిస్‌ గవాయ్‌ బెంచ్‌ సుదీర్ఘ వాదనలను విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ స్పీకర్ ను ఆదేశించింది. ఏండ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్‌లో ఉంచడం సరికాదని స్పష్టం చేసింది. అలాగే పార్లమెంటు కూడా ఫిరాయింపు చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ల వినతిని కోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆక్టోబర్ 31లో ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనుందా? ఉప ఎన్నికలు వస్తాయా? స్పీకర్ ముందు ఉన్న ఆప్షన్స్‌ ఏంటి? అనే అంశంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

3 నెలల తర్వాత ఉప ఎన్నికలు వస్తాయా?

బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు విడతలవారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ చేసిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని మూడు నెలల్లోపుగా ప్రకటించాలి. అంటే ఈ పిటిషన్ల ఆధారంగా స్పీకర్ ఆ పదిమందిని అనర్హులుగా ప్రకటిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. లేకపోతే ఉప ఎన్నికలు రావు. అది స్పీకర్ తీసుకొనే నిర్ణయం ఆధారంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

స్పీకర్ ముందున్న ఆప్షన్స్‌ ఏంటి?

మూడు నెలల్లోపుగా బీఆర్ఎస్ పిటిషన్లపై స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించాలని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోంది. అనర్హత పిటిషన్ల ఆధారంగా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవచ్చు.. తీసుకోకపోవచ్చు.. ఇది స్పీకర్ ఇష్టం. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. మరోవైపు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పీకర్ రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఇలాంటి పిటిషన్లపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, తెలంగాణ, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిర్ణీత కాల వ్యవధిలో నిర్ణయం తీసుకున్న సందర్భాలు లేవు. సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ జీ ప్రసాద్ కుమార్ న్యాయ నిపుణులతో చర్చించారు. అనర్హత పిటిషన్లకు సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు స్పీకర్ తెలిపారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఎమ్మెల్యేలు ఏమంటున్నారు?

అనర్హత వేటు పడకుండా ఉండేందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దానం నాగేందర్ సహా మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలపై కూడా బీఆర్ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా అందించినట్టు గులాబీ పార్టీ చెబుతోంది. తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ది పనుల కోసం సీఎం వద్దకు వెళ్లినట్టు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులపై కూడా తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేశారు. మీడియా సమావేశాల్లో కూడా తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమని ప్రకటించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు సమాధానాలు ఇవ్వాలి. అయితే నియోజకవర్గ అభివృద్దికి సంబంధించిన నిధుల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీఎం వద్దకు వెళ్లిన సమయంలో తమకు కండువా కప్పితే పార్టీలో చేరినట్టా అని స్పీకర్ ముందు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు చెప్పే అవకాశం ఉంది. తాము కాంగ్రెస్ లో చేరినట్టు ఆధారాలు కూడా చూపాలని కోరవచ్చు. ఇందుకు సంబంధించి కోర్టుకు సమర్పించిన ఆధారాలు, మీడియా ప్రకటనలను కూడా స్పీకర్ కు చూపే అవకాశం ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా ఈ పది మంది పార్టీ మారినట్టు మీడియాలో వచ్చిన వార్తలు, ఇతర ఆధారాలను కూడా స్పీకర్ ముందుంచి తమ వాదనను వినిపించే అవకాశం ఉంది. అయితే ఇరువాదనలు విన్న తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకొంటారు. స్పీకర్ నిర్ణయం ప్రకారం తాము నడుచుకుంటామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఉప ఎన్నికలను పార్టీలు నిర్వహించవని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నట్టు స్పీకర్ కార్యాలయం నోటిఫై చేసి ఈసీకి ఆ వివరాలు పంపాలి. అప్పుడే ఉప ఎన్నికలపై ఈసీ నిర్ణయం తీసుకుంటుంది.

గత 10 ఏళ్లలో ఏం జరిగింది?

తెలంగాణలో గతంలో కూడా ఇలానే ఫిరాయింపులు జరిగాయి. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఆప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక్కొక్కరుగా 12 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడారు. టీడీపీ శాసనసభపక్షాన్ని బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్)లో విలీనం చేస్తున్నామని స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా టీడీపీ శాసనసభపక్షం టీడీపీలో విలీనం అయిందని అప్పటి స్పీకర్ ప్రకటించారు. అప్పట్లో టీడీపీ తరపున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. టీడీపీ శాసనసభపక్షాన్ని బీఆరెస్‌లో విలీనం చేయడంపై అప్పట్లో టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2017లో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్య మాత్రమే మిగిలారు. టీడీపీ కంటే ముందే బీఎస్పీ తరపున గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప బీఎస్పీ శాసనసభపక్షాన్ని బీఆర్ఎస్‌లో విలీనం చేశారు. 2018లో తెలంగాణలో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో కాంగ్రెస్ , టీడీపీ శాసనసభపక్షాలు బీఆర్ఎస్‌లో విలీనమయ్యాయి. కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ శాసనసభపక్షాన్ని బీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు లేఖలు ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఈ తీర్పు ఆధారంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి.