అప్పుల ఊబిలో పౌరసరఫరాల కార్పొరేషన్.. మొత్తం రుణభారం ఎంతో తెలుసా?
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్ రుణాలు కేవలం రూ.4,747 కోట్లు మాత్రమే. ఆ తరువాత 2019-20 రుణ భారం రూ.11,819 కోట్లకు చేరుకున్నది. ఇక్కడి వరకు పర్వాలేదు. కాని 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అది ఏకంగా రూ.58,623 కోట్లకు పెరిగి పెను భారంగా మారింది
- రెండేళ్లలో రూ.9వేల కోట్ల అప్పులు
- అప్పుల ఊబిలో పౌర సరఫరాల కార్పొరేషన్
- మొత్తం రుణ భారం రూ.67వేల కోట్లు?
హైదరాబాద్, విధాత: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్ రుణాలు కేవలం రూ.4,747 కోట్లు మాత్రమే. ఆ తరువాత 2019-20 రుణ భారం రూ.11,819 కోట్లకు చేరుకున్నది. ఇక్కడి వరకు పర్వాలేదు. కాని 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అది ఏకంగా రూ.58,623 కోట్లకు పెరిగి పెను భారంగా మారింది. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పదమూడు రెట్లు అప్పులు పెరిగాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత తగ్గించకపోగా మరో రూ.9వేల కోట్లు పెరగడంతో మొత్తం అప్పులు రూ.67 వేల కోట్లకు చేరుకున్నాయని కార్పొరేషన్ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలోనే రూ.9వేల కోట్లు పెరగడం గమనార్హం.
అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ ఆగ్రహం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత డిసెంబర్, 2023 లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ఆర్థికాంశాలు – శ్వేతపత్రం పై చర్చ సందర్భంగా అప్పుల వివరాలు వెల్లడించారు. అవినీతి పరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసిందని ఆరోపించారు. పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.56వేల కోట్లు అప్పులు తీసుకున్నారని వివరించారు. ప్రతి ఏడాది రూ.3వేల కోట్ల వడ్డీ భారం పడుతోందన్నారు. కార్పొరేషన్ కు చెందిన రూ.22వేల కోట్ల విలువైన వరి తగిన భద్రత లేకుండా మిల్లర్ల వద్ద ఉందన్నారు. 95 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను బ్యాంకు గ్యారెంటీ లేకుండా మిల్లర్లకు అప్పగించారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక అక్రమాలు జరిగాయని, అందులో అధికారుల మొదలు అందరి ప్రమేయం ఉందన్నారు.
ఇబ్బడిముబ్బడి అప్పులపై చర్యలేవీ
అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పెద్ద ఎత్తున తీసుకున్న అప్పులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీస విచారణ చేపట్టకుండా విస్మరించింది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు రూ.40వేల కోట్లు అప్పులు సేకరించడం పలు అనుమానాలకు తావిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదు. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి పరులను వదిలేది లేదని హెచ్చరించారు. కాని ఆయన ప్రకటన చేసి రెండెళ్లు సమీపిస్తున్నా ఇంత వరకు ఒక్క విచారణ జరగలేదు. నీటి పారుదల అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం పౌర సరఫరాల అక్రమాల విషయంలో ఎందుకు మౌనం వహిస్తుందో అర్థం కావడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అక్రమాలను వెలికి తీయాలంటే విచారణ జరిపితేనే తప్పుచేసిన వారు ఎవరనేది తెలుస్తుందని ఉద్యోగులు అంటున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పొదుపు చర్యలు చేపట్టకుండా రూ.9వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుని భారం పెంచడం గమనార్హం. ఇప్పటికే అప్పులతో కూనరిల్లుతున్న కార్పొరేషన్ కు అదనపు రుణాలు గుదిబండగా మారాయి.
సీఎంఆర్ రికవరీలో నిర్లక్ష్యం
కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో పౌర సరఫరాల శాఖ కఠిన చర్యలు తీసుకోకపోవడం మూలంగా అప్పులు పెరిగాయంటున్నారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కు కావడంతోనే అక్రమ దందా కొనసాగుతుందనే విమర్శలు న్నాయి. పౌర సరఫరాలకు కేటాయించిన స్టాక్ మాత్రమే రైసు మిల్లుల్లో ఉండాల్సి ఉండగా, అదనంగా స్టాక్ ఉంటున్నా రికార్డుల్లో నమోదు చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలో నియమితులు అయిన ఈ ప్రొక్యూర్ మెంట్ జీఎం ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. ఆయన డెప్యూటేషన్ 2022 సెప్టెంబర్ నెలలో ముగిసినా పొడిగించుకున్నారని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ పోస్టులో ఎవరు పనిచేయాలనేది నిబంధనలు ఉన్నాయి. కాని కమిషనర్ మారినప్పుడల్లా పదవులు మారుతున్నాయని ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. గత పదేళ్లలో సీఎంఆర్ ఎవరెవరికి ఇచ్చారు, ఎంత వరకు రికవరీ చేశారు, ఇంకా రావాల్సింది ఎంత అనేదానిపై మంత్రి సమీక్షించడం లేదని ఉద్యోగులు అంటున్నారు. బ్యాంకు గ్యారెంటీ లేకుండా వడ్లు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవడం లేదని చర్చించుకుంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram