- కేసీఆర్‌కు సైతం ఒకటే క్యాంప్ కార్యాలయం
- ప్రజాధనం దుబారా… అధికారుల గాభరా
- ఇదేమీ తీరంటూ సీనియర్ ఐఏఎస్‌ల విస్మయం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీసుల వ్యవహారం రాజకీయ, అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ముఖ్యమంత్రులు సచివాలయం నుంచి పనిచేస్తారు. వెసులుబాటు కోసం క్యాంప్ ఆఫీస్‌లు ఏర్పాటు చేసుకుంటారు. సహజంగా ఇంటినే క్యాంప్ ఆఫీస్‌గా మార్చుకున్న ముఖ్యమంత్రులు అనేక మంది ఉన్నారు. కానీ.. రేవంత్ రెడ్డి ఏకంగా ఐదు క్యాంపు కార్యాయాలయాలు ఏర్పాటు చేసుకోవడంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రధాన మంత్రి మోదీకి సైతం ఇన్ని క్యాంపు కార్యాలయాలు లేవని సీనియర్ అధికారులు గుర్తు చేస్తున్నారు. మోదీకి న్యూ ఢిల్లీలో అధికారిక నివాసంతోపాటు క్యాంప్ కార్యాలయం ఒకటి ఉన్నది. కానీ.. తెలంగాణలో రేవంత్ రెడ్డికి సచివాలయంలో ప్రత్యేక కార్యాలయంతోపాటు.. జూబ్లీహిల్స్ నివాసంలో క్యాంప్ కార్యాలయం ఉంది. ఈ రెండూ కాకుండా జూబ్లీహిల్స్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్ హెచ్ఆర్డీ)లో ఒక కార్యాలయం నిర్మించారు. ఇక బంజారాహిల్స్ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సైతం ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో నిర్మించ తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయడం గమనార్హం. అంటే.. మొత్తంగా ఆయనకు ఐదు అధికారిక కార్యాలయాలు ఉన్నాయి.
కేసీఆర్‌నూ మించి..
మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కూడా ఇన్ని క్యాంప్ కార్యాలయాలు అప్పట్లో లేవని సీనియర్ అధికారులు అంటున్నారు. ఆయనను మించి రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీసులను ఏర్పాటు చేసుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఆయన వెసులుబాటు రీత్యా ఎక్కడికక్కడ క్యాంపు కార్యాలయాలు పెట్టుకున్నా.. అక్కడి సమీక్షలకు వెళ్లటానికి సీనియర్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రేవంత్ రెడ్డి ఏ పూట ఎక్కడ ఉంటారు? ఏ సమావేశం ఎక్కడ పెడతారు? అనే ఆదుర్దాను.. ఉన్నతాధికారులతో పాటు ఆయనను కలవాలనుకునే నాయకులు సైతం నిత్యం ఎదుర్కొంటున్నారని సీనియర్ అధికారుల చర్చించుకుంటున్నారు. ఎక్కడ సమీక్ష ఉంటే అక్కడికి అధికారులు కట్టగట్టుకుని పోవాల్సి వస్తున్నదని అంటున్నారు. పైగా నిత్యం ఈ కార్యాలయాల్లో మెయింటనెన్స్ సైతం ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఇన్ని బదులు.. సచివాలయం లేదా అధికారిక క్యాంప్ కార్యాలయంలో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తే ప్రభుత్వ నిధుల ఆదాతో పాటు మంత్రులు, ఉన్నతాధికారుల సమయం ఆదా అవుతుందని ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.
మోదీకి రెండే కార్యాలయాలు..
న్యూఢిల్లీ రైసినా హిల్స్ సేవాతీర్థ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అధికారిక కార్యాలయం ఉంది. లోక కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాన మంత్రి అధికారిక నివాసం (క్యాంప్ ఆఫీసు) ఉంది. ఈ రెండు తప్ప అదనంగా ఆయనకు ఎక్కడా కార్యాలయాలు లేవు. తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కే చంద్రశేఖర్ రావుకు కూడా సచివాలయం ఆరో అంతస్తులో కార్యాలయం ఉంది. బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ (ప్రగతి భవన్) అధికారిక నివాసం ఉండేది. తన పదవీకాలంలో సచివాలయం బదులు ఎక్కువగా ప్రజా భవన్‌లోనే మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఉండేవారు. ఇది సచివాలయానికి సమీపంలో ఉండటంతో ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులకు అంతగా ఇబ్బంది ఉండేది కాదని ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. మిగతా సమయం ఎక్కువగా సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గడిపేవారు.
నాడు గడీల పాలన అంటూ విమర్శలు..
కేసీఆర్ వ్యవహార శైలిపై గడీల పాలన అంటూ విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయానికి వస్తారని చాలా మంది అధికారులు భావించారు. కానీ దానికి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయన్న చర్చలు వినిపిస్తున్నాయి. అది కూడా ఏకంగా ఐదు కార్యాలయాల నుంచి విధులు నిర్వహిస్తుండటంపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలోని ఆరో అంతస్తులో సీఎం రేవంత్ రెడ్డికి కార్యాలయంతోపాటు.. సీఎంవో అధికారులకు ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేశారు. కానీ.. మంత్రివర్గ సమావేశాలు ఉన్నప్పుడు తప్ప ఇతర సమయాల్లో సీఎం సచివాలయానికి రావడం లేదు. మరో విశేషం ఏమిటంటే.. కనీసం వారానికి ఒకటి రెండుసార్లు కూడా రాకపోయినా.. ఆరో అంతస్తులో సాధారణ పౌరులు, మీడియా ప్రతినిధులకు ప్రవేశాన్ని నిషేధించడంపై మీడియా వర్గాల్లో తరచూ చర్చ సాగుతోంది. ముందస్తు అనుమతులు ఉంటే తప్ప ప్రవేశం లేకుండా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సీ బ్లాక్‌లో సీఎం కార్యాలయానికి ప్రజా ప్రతినిధులు, సాధారణ పౌరులు, అధికారులు, మీడియా ప్రతినిధులు వెళ్లి వస్తుండేవారు. కానీ.. ఇప్పుడు అటు వైపు వెళ్లడం అసాధ్యంగా మారింది.
మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి…
నూతన సచివాలయం నిర్మాణం చేసిన తరువాత కేసీఆర్ హయాంలో అమలు అయిన విధానాలనే రేవంత్ రెడ్డి కూడా కొనసాగిస్తుండటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ ప్రజలే కాదు.. పార్టీ కార్యకర్తలు, నాయకులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హయాలో గడీల పాలన, నియంత, ఫామ్‌హౌస్ సీఎం అని పలు రకాలుగా విమర్శించి మనం చేస్తున్నది ఏమిటి? అంటూ పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంతర్గత సంభాషణల్లో మండిపడుతున్నారు. ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఉన్న ఇనుప కంచెను బద్దలు చేశామని చెప్పుకొంటున్న రేవంత్ రెడ్డి… సచివాలయం, మిగతా కార్యాలయాల్లో చేస్తున్నదేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముఖ్యమంత్రిగా మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. అలా కాకుండా ఏ రోజు ఏ సమయంలో ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితిని తీసుకువచ్చారనే అభిప్రాయాలు ఐఏఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకరోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, మరో రోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్, జూబ్లీహిల్స్ అధికారిక నివాసంలో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే పరిపాలన కొనసాగిస్తే గత సీఎం కేసీఆర్ మాదిరి అపఖ్యాతి పాలు కావడం ఖాయమని, ప్రజలకు సమాధానం చెప్పుకోలేని దుస్థితి ఎదురవుతుందని నాయకులు వాపోతున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా క్యాంప్ కార్యాలయాల పై స్పష్టమైన నిర్ణయం తీసుకుని అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నారు.
