మళ్లీ గడీల పాలన రానివ్వం : పిప్పిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి
పిప్పిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2034లోపు ఆదిలాబాద్‌ను విద్యా, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
విధాత, హైదరాబాద్ : గడీల పాలన బద్దలు కొట్టిన కొమురం భీమ్ రాంజీ సాక్షిగా తెలంగాణలో మళ్లీ గడీల పాలన..రాక్షసుల పాలన రానివ్వమని, మళ్లీ వచ్చేది మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమేనని, 2034 లోపల అదిలాబాద్ జిల్లాను విద్యా కేంద్రంగా, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ది చేసి చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం అదిలాబాద్ జిల్లా పిప్పిరి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రజా ప్రభుత్వం ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలన్న లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. కొంతమంది మారీచులు మాయగాళ్ల రూపంలో ప్రజలను మోసం చేయచూస్తున్నారని, కోహెడ వెళ్లి పండ్ల మార్కెట్ కట్టలేదని ప్రశ్నిస్తున్నారని, మరి పదేళ్లు వాళ్లేందుకు కట్టలేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలకు అడ్డుపడాలని ప్రయత్నిస్తే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి ఆదివాసీ బిడ్డల సాక్షిగా ఇక్కడే దీక్షబూని ప్రజాపాలన తెస్తామని భట్టి, నేను చెప్పడం జరిగిందని, మళ్లీ ఇదే వేదిక నుంచి చెబుతున్నానని… రాబోయే ఎన్నికల్లో మళ్లీ మా ప్రజా ప్రభుత్వమే వస్తుందన్నారు. 2034లోపల అదిలాబాద్ విద్యా కేంద్రంగా, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ది చేసే బాధ్యత తీసుకుంటుందన్నారు. పేదవాడి కళ్లల్లో ఆనందం చూడాలని మా ప్రజా ప్రభుత్వం సంకల్పం అని..మేం పాలకులం కాదు ప్రజలకు సేవకులం అని స్పష్టం చేశారు. గతంలో పాలపిట్ట రంగులో ఇచ్చిన ఇందిరమ్మ చీరలను ఈ సారి డిసెంబర్ లో చిలకపచ్చ రంగులో అందిస్తామని వెల్లడించారు.
పదేళ్లలో వారు చేయకుండా మాపై నిందలా..?
పదేళ్లు బీఆర్ఎస్ వాళ్లు రూ. 8లక్షల కోట్ల అప్పులు చేసి మాపై భారం పెట్టిపోతే మాకు సరిదిద్దడానికి సమయం పడుతుందని, ఆరుగ్యారంటీల అమలు కూడా ఆలస్యమైన అన్ని పూర్తి చేస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మేం చేసిన అభివృద్దిపై అసెంబ్లీలో మాట్లాడుదాం అంటే రాకపోగా లొల్లి పెట్టి ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారని, ఆలుమగల మాట్లాడుకోకుండా వినేందుకు ఫోన్ ట్యాపింగ్ పెట్టారని..ఇప్పుడు స్వేచ్చగా మమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నారన్నారు. మళ్లీ గడీల పాలన ఎవరు కోరుకోరని, మళ్లీ ఈ రాష్ట్రంలో గడీల పాలన రానివ్వబోం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాజకీయాలకు అతీతంగా రెండున్నరేండ్లలో రూ.10వేల కోట్ల రూపాయల మేరకు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 50లక్షల కుటుంబాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500 సిలిండర్ పథకం అమలవుతుందన్నారు.
పేదల ఆత్మగౌరవం కోసం సన్ని బియ్యం
గత పాలకులు డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తామని మోసం చేస్తే…మా ప్రజా ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున పేదలకు 4లక్షల ఇళ్లను 22,500 కోట్ల రూపాయాలతో నియోజకవర్గానికి 3వేలు ఇండ్లు, ఏజెన్సీ ప్రాంతాల్లో మరో 25వేల ఇండ్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. ఇప్పటికే 5,400కోట్ల రూపాయలను ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు చెల్లించామని తెలిపారు. 3కోట్ల 17లక్షల తెలంగాణ బిడ్డలకు ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున పేదలకు సన్న బియ్యం పథకం అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పథకంలో దొడ్డి బియ్యం పథకం మిల్లర్లు, రేషన్ మాఫీయా పాలైతే..ఈ రోజు సన్న బియ్యంతో పేదలకు ఆత్మగౌరవంతో కూడిన భోజనం అందుతుందన్నారు. ఆడబిడ్డలకు రూ. 1000కోట్లతో శిల్పారామంలో డాక్రా విక్రయా కేంద్రాలను ఏర్పాటు చేశాం అన్నారు.
ప్రాణహిత చేవేళ్ల కట్టి తీరుతాం
ప్రాణహిత చేవెళ్ల స్థానంలో బీఆర్ఎస్ పాలకులు కాళేశ్వరం కట్టి కూలేశ్వరం చేశారని, తుమ్మడి హట్టి నుంచి ప్రాణహిత చేవేళ్ల తిరిగి ప్రారంభించి ఆదిలాబాద్ రైతులకు నీళ్లందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకోసం మంత్రి ఉత్తమ్ సారధ్యంలో సర్వేలు కొనసాగుతున్నాయన్నారు. ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టు జూన్ 2 లోపల శంకుస్థాపనకు ప్రయత్నిస్తాం అన్నారు. ఎయిర్ పోర్టు కొనసాగేలా.. ఈ ప్రాంతాన్ని పర్యాటక, పారిశ్రామిక కేంద్రంగా చేసేందుకు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను మంజూరూ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేస్తామని, భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.
తెలంగాణ అభివృద్దికి ప్రతీకగా అదిలాబాద్
తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబాటు కొనసాగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నా పర్యటన సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి.. ఈ ప్రాంత అభివృద్దికి భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. గత పాలకులు ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ శ్రేణులు బెదిరిపోకుండా ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రయత్నించారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయినా మా ప్రజాప్రభుత్వంలో ప్రతిపక్షాలను రాజకీయ శత్రువులుగా చూడకుండా ప్రజా సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు. ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేని నియోజకవర్గాల్లో కూడా రూ.1250కోట్ల అభివృద్ది పనులు ప్రారంభించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న నిర్మల్ కూడా రూ.200కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ అభివృద్దిని అదిలాబాద్ జిల్లా నుంచే చూపించాలని, గోదావరి జలాలను ఒడిసి పట్టాలని మా ప్రభుత్వం పనిచేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఆదిలాబాద్ ఆలయాలను అభివృద్ది చేస్తాం
బాసర సరస్వతి దేవాలయం అభివృద్దికి రూ.225కోట్లు మంజూరు చేసి పనులకు భూమి పూజ చేయడం జరిగిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలోనే గొప్ప సరస్వతి ఆలయంగా తీర్చుదిద్దుతామన్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్దిలో భాగంగా కూడెం సత్యనారాయణ స్వామి ఆలయం అభివృద్దికి నిధులు మంజూరు చేస్తామని, అందుకు ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ ను ఆదేశిస్తున్నట్లుగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం 2027మార్చి 31వరకు జిల్లా, మండల, నియోజకవర్గాల సరిహద్దులు మార్చవద్దని నిబంధన పెట్టిందని, ఆ తర్వాత జ్యూడిషియల్ కమిషన్ వేసి బోధ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. యువత మత్తు బాట వదలి… క్రీడా మైదానాల బాట పట్టాలని కోరుతూ క్రీడలను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. అదిలాబాద్ జిల్లాలో క్రీడల అభివృద్దికి మినీ స్టేడియం, మైదానాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి :
అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి ట్రంప్‌ను తొలగిస్తారా?
తెలంగాణలో ఇక టెంపుల్ టూరిజం వైభవం.. బాసర నుంచి భద్రాచలం దాకా…
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram